
'కాపు రిజర్వేషన్'పై మాట దాటేసిన పవన్
తుని ఘటనపై సినీ నటుడు, జనశక్తి అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: తుని ఘటనపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 'కాపు గర్జన' ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రవేశించడం వల్లే ఉద్యమం హింసాత్మకంగా మారిందన్నారు.
చౌరీ చోరీ ఘటన మూలంగా దేశ స్వాతంత్ర్య ఉద్యమం పాతకేళ్ల పాటు వెనక్కి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కాపులను బీసీలో చేర్చాలన్న డిమాండ్ ను మీరు సమర్ధిస్తారా అన్న ప్రశ్నకు మాత్రం పవన్ సూటిగా సమాధానం చెప్పలేదు. కులం కోసం కాదు ప్రజల కోసం ఉద్యమిస్తానంటూ సమాధానాన్ని దాట వేశారు. ఈ సమస్యను రాజకీయం చేయడం తనకిష్టం లేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు కాపులలో ఏదో భయం పట్టుకుందని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
దేశంలో ఎన్ని కుల ఉద్యమాలు జరిగినా ఇంత హింస చెలరేగలేదని పవన్ ఆ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమ నాయకులు బాధ్యతతో వహించాలని హితవు పలకడం విశేషం. మనుషుల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యవహరించకూడని, తుని ఉద్యమం హింసాత్మకంగా పరిణమించడం దురదృష్టకరమన్నారు. కాపుల డిమాండ్ ఇప్పటిదికాదని.. అనేక దశాబ్దాలుగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కాపుగర్జన సందర్బంగా ప్రభుత్వం సరైన ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, ఇప్పటికైనా కాపు నేతలతో సంప్రదింపులు జరిపి పరిస్థితి చేయి దాటకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.