రాజ్యాంగ సవరణ అక్కర్లేదు | No need to constitutional Amendment | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ సవరణ అక్కర్లేదు

Oct 6 2016 3:13 AM | Updated on Sep 4 2017 4:17 PM

రాజ్యాంగ సవరణ అక్కర్లేదు

రాజ్యాంగ సవరణ అక్కర్లేదు

తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

నియోజకవర్గాల పునర్విభజనపై మంత్రి కేటీఆర్
పాలనా వ్యవస్థలు సక్రమంగా పని చేసేందుకే జిల్లాల విభజన
తెలంగాణ తెచ్చానంటున్న జైపాల్‌రెడ్డి..
కల్వకుర్తిని డివిజన్ చేయలేదెందుకో?
త్వరలో జీహెచ్‌ఎంసీని ప్రక్షాళన చేస్తామని వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంటులో సాధారణ మెజారిటీతో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ సాధ్యమేనని తెలిపారు. కేటీఆర్ బుధవారం సచివాలయంలో మీడియాతో  మాట్లాడారు.
 
 అన్ని పాలనావ్యవస్థలు సమర్థంగా పని చేసేందుకే చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ జరుగుతుందని, పెత్తందారీ వ్యవస్థ పోతుందన్నారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యంతోపాటు రెండో స్థాయి నాయకత్వ ఎదుగుదల జరుగుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. తెలంగాణ తెచ్చానంటున్న కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి ఇన్నాళ్లు మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘సిరిసిల్లను జిల్లా చేస్తామంటే కొడుకుకు ఓ జిల్లా, బిడ్డకో జిల్లా అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. అధికారంలోకి వస్తే సిరిసిల్లను జిల్లా చేస్తామని మళ్లీ అదే ప్రతి పక్ష నేతలు హామీలిస్తారు’ అని అన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి జిల్లాలను ప్రకటించామని తెలిపారు.
 
 జీహెచ్‌ఎంసీ ప్రక్షాళన
 త్వరలో జీహెచ్‌ఎంసీని ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో వైట్ టాప్ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.25 వేల కోట్ల ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు. అన్ని మున్సిపాలిటీలను ఒకే చట్టం కిందకు తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో మేజర్ రోడ్‌‌స డివిజన్ వ్యవస్థను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక సర్కిళ్ల వారీగా అధికార వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. జీహెచ్‌ఎంసీలో సర్కిళ్లను 24 నుంచి 30కి పెంచుతామన్నారు. రోడ్ల పునర్‌వ్యవస్థీకరణకు జేపీ గ్రూప్ సంస్థ ముం దుకొచ్చిందని, కేసీపీ జంక్షన్, నాగార్జున సర్కిల్ వద్ద ఆ సంస్థ పనులు మొదలు పెట్టబోతోందన్నారు.
 
 ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’కు కేటీఆర్
 కేటీఆర్ బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గురు, శుక్ర వారాల్లో ఢిల్లీలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. 8న వడోదరలో కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో జరిగే అన్ని రాష్ట్రాల గనుల మంత్రుల సదస్సులో పాల్గొంటారు.
 
 జిల్లాల విభజన తర్వాత ‘డబుల్’
 జిల్లాల విభజన తర్వాత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై దృష్టి పెట్టనున్నట్లు కేటీఆర్ చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వ్యయాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. టీఏఎస్ ఏర్పాటుపై అధ్యయనం జరుగుతోందని వెల్లడించారు. నయీమ్ వ్యవహారంలో ఎవరికి హెచ్చరికలు వెళ్లాలో వారికి వెళ్లాయని తెలిపారు. ఈ వ్యవహారాన్ని చట్టం చూసుకుంటుందని, అక్రమాలకు పాల్పడిన వారెవరినీ ఉపేక్షించేది లేదన్నారు. లక్ష అనుమానాల మధ్య పుట్టిన తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ఎంఐఎం పార్టీ మత ప్రాతిపదికనే గెలుస్తుందనుకోవడం తప్పని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నిత్యం దారుస్సలాంలో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ఎంఐఎంను బూచిగా చూపి బీజేపీ గెలుస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement