అడ్డదారి కానిస్టేబుళ్లకు అరదండాలు

mall practice in constable exam - Sakshi

2009 నాటి కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌పై సీఐడీ ఉచ్చు  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 13 మంది అరెస్టు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తాము రాయాల్సిన పరీక్షను వేరొకరితో రాయించి (పైలెటింగ్‌) కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారిపై  ఉచ్చు బిగుసుకుంది. 2009లో నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లో అడ్డదారిలో కొలువులు దక్కించుకున్న 13 మంది కానిస్టేబుళ్లను సీఐడీ తాజాగా అరెస్ట్‌ చేసింది. వీరంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు. రెండో జాబితాలో మరికొంత మంది ఉన్నారని ప్రచారం జరుగుతుండడంతో పైలెటింగ్‌తో వచ్చిన కానిస్టేబుళ్లకు వణుకు పుడుతోంది. 

తీగ లాగితే డొంక.. 

2010 అక్టోబర్‌ 19న నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. ఇదే మండలానికి చెందిన ఓ అభ్యర్థి రిక్రూట్‌మెంట్‌ టెస్టు ఉన్న రోజు కబడ్డీ పోటీల్లో పాల్గొనడం.. ఆ తర్వాత అతడికి ఉద్యోగం రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాటి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అప్పటి నకిరేకల్‌ సీఐ బి.రాములు నాయక్‌ తొలుత 14 మందిని అరెస్టు చేశారు. ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. తర్వాత మరికొందరిని అరెస్టు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు సీఐడీ నిర్ధారించుకుంది.

గత జూన్‌లో 23 మంది జాబితాతో కూడిన కానిస్టేబుళ్ల వివరాలు కావాలంటూ సీఐడీ నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల ఎస్పీలకు లేఖ రాసింది. సదరు కానిస్టేబుళ్లు సెలవు పెట్టినప్పుడు పెట్టిన సంతకం, బ్యాంకు ఖాతాల్లో పెట్టిన సంతకం తదితర వివరాలు ఈ లేఖలో అడిగింది. వీటిని 3 జిల్లాల ఎస్పీలు పంపిన తర్వాత.. కొందరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకొని విచారించింది. ఈ నెల 17న 10 మందిని, 18న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు. 

అరెస్టు అయింది వీరే..:సీఐడీ అరెస్టు చేసినవారిలో బుర్రి వెంకటేశ్వర్లు (కోదాడ రూరల్‌ పీఎస్‌), చెవుల నాగరాజు (వాడపల్లి పీఎస్‌), దొంగరి సందీప్‌ (మిర్యాలగూడ వన్‌టౌన్‌), మండవ నాగేశ్వరరావు (కోదాడ టౌన్‌ పీఎస్‌), వడ్డే ఉపేందర్‌ (కొండ మల్లేపల్లి పీఎస్‌), ఎండీ అఫ్సర్‌ (సూర్యాపేట టౌన్‌ పీఎస్‌), మర్తనపల్లి వెంకట సత్యనారాయణ (భువనగిరి పీఎస్‌), గుండు వీరప్రసాద్‌ (8వ బెటాలియన్‌ కొండాపూర్‌) బుడిజం నాగేశ్వరరావు (మఠంపల్లి పీఎస్‌), ధన్యాకుల శ్రీకాంత్‌ (రాజాపేట పీఎస్‌), అట్టూరి సత్యనారాయణరెడ్డి (కరీంనగర్‌ పీటీసీ), కైగురి రమేశ్‌ (స్పెషల్‌ పార్టీ నల్లగొండ), వెంబడి రమేశ్‌ (మోత్కూరు పీఎస్‌) ఉన్నారు. వీరిని నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. మరికొందరిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top