పెళ్లికి నిరాకరించారని.. కొడవలితో దాడి! | lover family injured in lover attack | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించారని.. కొడవలితో దాడి!

Mar 2 2017 11:54 PM | Updated on Sep 5 2017 5:01 AM

పెళ్లికి నిరాకరిస్తున్నారన్న అక్కసుతో ప్రియురాలితో పాటు ఆమె తండ్రిపై దాడి చేసిన యువకుడిని శాలిబండ పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్ (చాంద్రాయణగుట్ట): పెళ్లికి నిరాకరిస్తున్నారన్న అక్కసుతో ప్రియురాలితో పాటు ఆమె తండ్రిపై దాడి చేసిన యువకుడిని శాలిబండ పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ నల్లపు లింగయ్యతో కలిసి ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ తాజుద్దీన్‌ అహ్మద్‌ కేసు వివరాలు వెల్లడించారు. మిశ్రీగంజ్‌ యాహ్యా పాషా మసీదు ప్రాంతానికి చెందిన మజ్దూద్‌ అబ్దుల్లా కుమార్తె అర్షియా(26), ఆసిఫ్‌నగర్‌కు చెందిన అంజద్‌(26)లు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయమై కొన్నాళ్ల క్రితం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది.

ఇటీవల అంజద్‌ పెళ్లి విషయమై అర్షియా ఇంట్లో అడిగాడు. ఎలాంటి పని చేయకుండా తిరుగుతున్న నీతో అర్షియా వివాహం జరిపించలేమని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మరోసారి బుధవారం రాత్రి అడిగేందుకు వచ్చాడు. యువతి కుటుంబ సభ్యుల నుంచి మళ్లీ అదే సమాధానం రావడంతో ఆగ్రహానికి గురైన అతడు అర్షియా చేతులు, వీపు భాగంతో పాటు ఆమె తండ్రి అబ్దుల్లాపై కూడా కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అతడు ఒక్కసారిగా మృగాడిగా మారడంతో గాయాలతోనే ఉన్న అర్షియా అతని కళ్లల్లో కారం చల్లి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చసి గురువారం రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి దాడికి పాల్పడిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్సై ప్రతాప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement