మూలకణాలతో గుండెకు చికిత్స | Sakshi
Sakshi News home page

మూలకణాలతో గుండెకు చికిత్స

Published Sun, Jul 6 2014 3:30 AM

మూలకణాలతో గుండెకు చికిత్స

15 నిమిషాల్లో డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి చేసే పరిజ్ఞానం  
సీఎస్‌ఐ వార్షిక సదస్సులో సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్: మూలకణాల (స్టెమ్‌సెల్స్) ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను నయం చేసే సరికొత్త పరిజ్ఞానం త్వరలోనే అందుబాటులోకి రానుందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ మోహన్‌రావు స్పష్టం చేశారు. గుండెలో మూల కణాలు ఉండవనేది అపోహ మాత్రమేనని, ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు ఇదే అంశాన్ని నిర్ధారించాయన్నారు.

బంజారాహిల్స్‌లోని హోటల్ పార్క్‌హయత్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏపీ చాప్టర్) 19వ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హృద్రోగ బాధితుల్లో చాలామందికి ప్రస్తుతం ఓపెన్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు చేస్తున్నారని, ఖరీదైన స్టంట్స్‌ను అమర్చి మూసుకుపోయిన రక్తనాళాలను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు.

ఇకపై ఇలాంటి శస్త్రచికిత్సల అవసరం ఉండబోదన్నారు. స్టెమ్‌సెల్స్ పరిజ్ఞానం ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు. గుండెనొప్పికి కారణాలను కనుగొనేందుకు చేసే డీఎన్‌ఏ పరీక్షలు 15 నిమిషాల్లోనే పూర్తిచేసే సరికొత్త పరిజ్ఞానాన్ని మరో మూడేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే ఫార్మికోజెనిటిక్స్ ఆధారంగా రోగి అవ సరానికి తగినట్లుగా మందులు తయారు చేసే పరిజ్ఞానం కూడా రాబోతుందన్నారు. సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 200 మంది హృద్రోగ నిపుణులు హాజరయ్యారు.

Advertisement
Advertisement