ఆర్టీసీలో హాహాకారాలు | financial problems in RTC, workers sufferings | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో హాహాకారాలు

Mar 26 2016 4:15 AM | Updated on Sep 3 2017 8:34 PM

ఆర్టీసీలో హాహాకారాలు

ఆర్టీసీలో హాహాకారాలు

ఆర్టీసీలో మళ్లీ హాహాకారాలు మొదల య్యాయి. కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తాలకు డబ్బుల్లేక ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసింది.

- కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాలపై చేతులెత్తేసిన సంస్థ
- రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించని ప్రభుత్వం
- బడ్జెట్‌లో సాయం చేస్తానని మొండిచేయి చూపిన సర్కారు

- ఉద్యమానికి సిద్ధమవుతున్న కార్మికులు
- ఈ నెల 29న అసెంబ్లీ ముట్టడి

 
సాక్షి, హైదరాబాద్:
ఆర్టీసీలో మళ్లీ హాహాకారాలు మొదల య్యాయి. కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తాలకు డబ్బుల్లేక ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసింది. ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కార్మికుల కుటుంబాలు రుణాలు అందక అల్లాడుతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఆర్టీసీ యాజమాన్యాన్ని అడిగి ప్రయోజనం లేదని, ఇక ప్రభుత్వంతోనే అమీతుమీ తేల్చుకోవాలని కార్మికులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు.

అంతా అగమ్య గోచరం..
తీవ్ర నష్టాలతో మునిగిపోయిన ఆర్టీసీ పరిస్థితి దినదిన గండంగా మారింది. జీతాల కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. గత బడ్జెట్‌లో కనీసం రూ.500 కోట్లు ప్రకటించినా వాటితో కష్టాలు గట్టెక్కుతాయని భావించిన యాజమాన్యానికి ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. రాయితీ బస్ పాస్‌లకు సంబంధించి గతంలో నెలకు రూ.75 కోట్ల చొప్పున చెల్లించేది. అయితే గత మూడు నెలలుగా వాటినీ చెల్లించట్లేదు. పెరిగిన కరువు భత్యం బకాయిలు మూడు నెలలుగా రూ.7 కోట్ల మేర పేరుకుపోయాయి.

పాత కరువు భత్యానికి సంబంధించి జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్ నెలల బకాయిలు రూ.22 కోట్లు ఉన్నాయి. 2012 నుంచి 2015 వరకు లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు దాదాపు రూ.20 కోట్లు పేరుకుపోయాయి. స్టాఫ్ బెన్వలెంట్ అండ్ థ్రిఫ్ట్ పథకం కింద 2014 జూన్ నుంచి కార్మికులకు రుణాలు అందట్లేదు. ప్రతినెలా వారి జీతం నుంచి డబ్బులు మినహాయిస్తున్నారు. దాదాపు రూ.35 కోట్లు వాటికి ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. స్టాఫ్ రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీం కింద 22 నెలలుగా రుణాలు అందట్లేదు. ఈ పేరునా కార్మికుల జీతాల నుంచి నెలనెలా డబ్బు మినహాయించుకుంటోంది. దీనికోసం దాదాపు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. వేతన సవరణకు సంబంధించి 2013 నుంచి పేరుకుపోయిన బకాయిలు రూ.183 కోట్లు తమ వద్ద లేవని యాజమాన్యం చెబుతోంది.
 
 వచ్చే నెల 6 లోపు కార్మికులకు స్పష్టత ఇవ్వని పక్షంలో ఉద్యమానికి సిద్ధం అవుతాం
- నాగేశ్వరరావు ఎన్‌ఎంయూ

ఇప్పటికే చాలాసార్లు కోరినా స్పందన లేదు. బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధులు కేటాయించనందున ఈ నెల 29న ఆసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించాం.
-రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement