మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ | Degree entries notification on May 8 | Sakshi
Sakshi News home page

మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌

Mar 20 2018 2:33 AM | Updated on Mar 20 2018 2:33 AM

Degree entries notification on May 8 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2018–19 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల (దోస్త్‌) షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను మే 8న జారీ చేయాలని దోస్త్‌ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమ వారం దోస్త్‌ సమావేశం జరిగింది. ఇందులో ప్రవేశాలనిబంధనలు, షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇంటర్మీడియెట్‌ వొకేషనల్, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. అన్ని వర్సిటీల్లో కామన్‌ షెడ్యూల్‌ అమలు చేయనుంది.

ఇంటర్‌లో కామర్స్‌ ప్రధాన సబ్జెక్టుగా చదివిన విద్యార్థులకు బీకాంలో 60 శాతం సీట్లు, హెచ్‌ఈసీ చదివిన వారికి బీఏలో 50 శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. కాలేజీలు, సీట్ల వివరాలను ఏప్రిల్‌ నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో (దోస్త్‌కు) అప్‌లోడ్‌ చేయాలని వర్సిటీలను ఆదేశించింది. ఇంటర్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ మెమోను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడే డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు డౌన్‌లోడ్‌ అవుతాయని అధికారులు వెల్లడించారు.

మరోవైపు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్సిటీల వారీగా కాలేజీలు, కోర్సులు, సీట్ల వివరాలను త్వరలో దోస్త్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతామని వివరించారు. గతంలో దోస్త్‌ పరిధిలోని అటానమస్‌ కాలేజీలు కూడా ఈసారి ఆన్‌లైన్‌ ప్రవేశాల పరిధిలోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈసారి మూడో కౌన్సెలింగ్‌ కూడా ఉంటుందన్నారు. గతంలో జీరో, 25 శాతంలోపు ప్రవేశాలు ఉన్న కాలేజీల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లో విలీనం చేయా లని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు పాల్గొన్నారు.

డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌..
8–5–2018: ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ
10–5–2018 నుంచి 26–5–2018 వరకు: రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లు
27–5–2018 నుంచి 29–5–2018 వరకు: 400 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌
4–6–2018: మొదటి దశ సీట్లు కేటాయింపు
5–6–2018 నుంచి 12–6–2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు
13–6–2018, 14–6–2018: రెండో దశ వెబ్‌ ఆప్షన్లు
19–6–2018: రెండో దశ సీట్లు కేటాయింపు
20–6–2018 నుంచి 25–6–2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు
26, 27–6–2018: మూడో దశ వెబ్‌ ఆప్షన్లు
30–6–2018: మూడో దశ సీట్లు కేటాయింపు
2–7–2018 నుంచి 4–7–2018 వరకు: కాలేజీల్లో విద్యార్థుల చేరికలు
2–7–2018 నుంచి: మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement