వచ్చే గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి బృహత్తర ప్రణాళికతో ముందుకు వస్తోంది.
టీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహం
♦ వాట్సాప్ గ్రూపుల్లోకి ఏరియా, డివిజన్, నగర కమిటీలు
♦ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి..
♦ 48 గంటల్లో పరిష్కారానికి చొరవ చూపనున్న అమాత్యులు
♦ స్థానిక బలహీనతలను ఎదుర్కొనే దిశగా గులాబీ పార్టీ ప్రణాళిక
♦ 20న గ్రేటర్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక, మైనంపల్లి ఎన్నిక లాంఛనమే
సాక్షి, సిటీబ్యూరో : వచ్చే గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి బృహత్తర ప్రణాళికతో ముందుకు వస్తోంది. నగరంలో బలమైన పునాదులు లేక వరుస ఓటమి ఎదుర్కుంటున్న తీరును..వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధిగమించేందుకు ‘యాక్షన్ 48 గంటలు’ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. మహానగరంలో ఏరియా కమిటీలు, డివిజన్ కమిటీలను దాదాపు ఏకగ్రీవం చేస్తున్న పార్టీ వ్యూహకర్తల్ని ఇక ప్రజా సమస్యల పరిష్కారంలో తలమునకలు చేయాలని నిర్ణయించారు. స్థానిక సమస్యలను గుర్తించి, వీలై నంత త్వరగా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లి వాటిని 48 గంటల్లోగా పరిష్కరించే లక్ష్యంతో ఏరియా కమిటీ - డివిజన్ కమిటీలు ఒక వాట్సాప్ గ్రూపులుగా, డివిజన్ కమిటీ - నగర కమిటీలు మరో గ్రూపుగా ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వం- పార్టీ మధ్య సమన్వయం
ఇటీవలి గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సి ఎన్నికల్లో చతికిలబడ్డ టీఆర్‌ఎస్ ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏరియా కమిటీ నుండి వచ్చే సమస్యలను నగర కమిటీ ద్వారా నేరుగా మంత్రులే సమీక్షించనున్నారు. ముఖ్యంగా మంచినీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, రహదారులు, వీధిలైట్లతో పాటు అర్హులైన వారికి రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు వంటి అంశాలను కూడా 48 గంటల్లోగా పరిష్కరించే దిశగా టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ప్రణాళిక రూపొందించారు.
20న గ్రేటర్ అధ్యక్షుని ఎన్నిక
టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్ష పదవికి ఈనెల 20న ఎన్నిక నిర్వహించనున్నారు. పార్టీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తిరిగి గ్రేటర్ అధ్యక్షునిగా ఎన్నిక కావటం లాంఛనమేనని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు.
మరింత ఊపుతో ముందుకు
స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచచరణను అమలు చేయనున్నాం. ఇప్పటికే మలక్‌పేట నియోకజవర్గంలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. వీలైనంత మేరకు ప్రజాసమస్యల్ని అతి తొందరగా పరిష్కరించే దిశగా పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నాం.
- సింగిరె డ్డి శ్రీనివాసరెడ్డి,పార్టీ నగర నేత