రైతులకే అంకితం

TRS Set New Trend In Four Years Ruling - Sakshi

టీఆర్‌ఎస్‌ నాలుగో ఏడాది పాలనలో సరికొత్త ఒరవడి

బృహత్తర పథకాలు.. సంచలన నిర్ణయాలు 

సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ‘రైతు బంధు’ 

రైతుల కుటుంబాలను ఆదుకునే.. ‘రైతు బీమా’ 

ప్రత్యేకంగా రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ 

యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల పనులు

సాక్షి, హైదరాబాద్‌ : రైతు ఎజెండా, జనాకర్షక పథకాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగో ఏడాది కొత్త ఒరవడి నెలకొల్పింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రయోగాత్మక పథకాలను అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని రైతులందరికీ మేలుచేసే బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏటా రూ.8 వేలు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించేలా ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించింది. అందులో ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి రూ.6 వేల కోట్లను రైతులకు అందజేసింది. ఈ కార్యక్రమం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా భూరికార్డుల ప్రక్షాళనకు నడుం బిగించిన సర్కారు... యుద్ధప్రాతిపదికన నెల రోజుల రికార్డు సమయంలోనే భూముల రికార్డులను సరిచేసింది. ఈ వివరాలను ఆధారంగా చేసుకునే.. ‘రైతుబం«ధు’ చెక్కులను, కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసింది. 

రైతులందరికీ బీమా.. 
రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల బీమా పథకాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. నాలుగో రాష్ట్రావతరణ వేడుకల కానుకగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి రైతుకు బీమా చేసి... ప్రమాదమైనా, సాధారణ మరణమైనా, మరే కారణంతో చనిపోయినా పది రోజుల్లోనే రూ.5 లక్షల పరిహారం అందించేలా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలోని అరకోటి రైతు కుటుంబాలకు ధీమానిచ్చేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరుతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. దానికి రూ.200 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. రైతులను సంఘటితం చేయడంతో పాటు పంటల ఉత్పత్తి, మార్కెటింగ్‌లో రైతు సమితులు క్రియాశీల పాత్ర పోషించేలా ప్రణాళికలూ సిద్ధం చేసింది. వీటికితోడు రాష్ట్రంలోని గొల్ల, కుర్మ, యాదవ సామాజిక వర్గానికి నేరుగా లబ్ధి చేకూర్చేలా గొర్రెల పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికే 75 శాతం సబ్సిడీపై దాదాపు రెండున్నల లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేసింది.  
 
పరుగులు పెడుతున్న పనులు.. 
‘తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణ’అన్న లక్ష్యం దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు వేగిరం చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అటు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తూ.. ఇటు కొత్త ప్రాజెక్టుల పనులను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో వివిధ ప్రాజెక్టుల కింద 2014 నుంచి ఇప్పటివరకు ఏకంగా 10.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడం గమనార్హం. దీంతోపాటు మరో 9.81 లక్షల ఎకరాల ఆయకట్టునూ స్థిరీకరించారు. ఇక ఈ ఖరీఫ్‌లో కొత్తగా మరో 8.89 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరో నాలుగేళ్లలో 55.50 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. గత నాలుగేళ్లలో ప్రాజెక్టులపై 50,120 కోట్లు ఖర్చు చేయగా.. మరో లక్ష కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి గోదావరి జలాలను తరలించేలా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజ్‌ల పనులు సాగుతున్నాయి. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజుల్లో 90 టీఎంసీలను తరలించి.. పది లక్షల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తొలి మూడేళ్లు ప్రతిష్టాత్మకంగా అమలైన మిషన్‌ కాకతీయ పథకం మాత్రం ఈ ఏడాది కొంత నీరసించింది. 
 
అందరికీ సంక్షేమం.. 
సీఎం కేసీఆర్‌ చేపట్టిన మరో ప్రతిష్టాత్మక పథకం మిషన్‌ భగీరథ. ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ప్రకటించిన కేసీఆర్‌.. పథకాన్ని వేగంగా పరుగులు పెట్టించారు. ఈ జూన్‌లోగా గ్రామాల అంతర్గత పనులు పూర్తి చేయాలని భావించారు. కానీ పలు చోట్ల జాప్యంతో పనులన్నీ ఇంకా చివరి దశలోనే ఉన్నాయి. దీంతో వచ్చే డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాదిలో కేసీఆర్‌ కిట్‌ పేరుతో గర్భిణులు, బాలింతలకు ఉపయుక్తంగా ఉండే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ‘తెలంగాణ కంటి వెలుగు’పేరుతో త్వరలోనే పల్లెపల్లెనా అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక నాలుగేళ్లుగా విజయవంతమైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఇచ్చే నగదును ప్రభుత్వం రూ.75 వేల నుంచి రూ.లక్షా పదహారుకు పెంచింది. కొత్తగా బోదకాలు బాధితులకు పింఛన్‌ అందించాలని నిర్ణయించింది. 
 
కొత్త పీఆర్సీ.. బదిలీలు.. 
కొత్త రాష్ట్రం ఏర్పాటై, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. గడువు ప్రకారం తాజాగా కొత్త పీఆర్సీని నియమించింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగుల బదిలీలకు దూరంగా ఉన్నా.. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈసారి సాధారణ బదిలీలకు అవకాశం కల్పించింది. 
 
నియామకాలపై అసంతృప్తి 
ఉద్యోగ నియామకాల విషయంలో విమర్శలను ఎదురవుతున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగో ఏడాది దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల నాటికి మొత్తంగా 1.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. 2018 ఆగస్టుకల్లా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గతేడాది స్వాతంత్రం దినోత్సవం రోజున సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ నియామకాలు 56 వేలకు మించకపోవటంతో సర్కారు సైతం అసంతృప్తిగానే ఉంది. ఇక మొదట్లో అన్ని ఉద్యోగాల భర్తీ బాధ్యతలను టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన ప్రభుత్వం.. నత్తనడక ప్రక్రియలు నడుస్తుండటంతో రెసిడెన్షియల్‌ స్కూళ్ల నియామకాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. 
 
కొత్త పంచాయతీ చట్టం.. గడువులోపే ఎన్నికలు 
నిర్ణీత గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రామాల్లో సర్పంచుల బాధ్యతలను మరింత పెంచుతూ కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకువచ్చింది. సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ల కాలపరిమితిని పదేళ్లకు పొడిగించింది. సర్పంచ్‌లతోపాటు ఉప సర్పంచులకు ఉమ్మడిగా చెక్‌ పవర్‌ ఉండేలా నిబంధనలు చేర్చింది. 
 
కొత్త జోన్లతో సంచలనం 
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పాత జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ప్రతిపాదించింది. స్థానికతకు కొత్త నిర్వచనం ఇవ్వడంతోపాటు రాష్ట్ర, మల్టీజోన్, జోన్, జిల్లా కేడర్లలో 95 శాతం పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం కేంద్రానికి ఫైలు పంపించింది. 
 
సచివాలయానికి దూరంగా..! 
నాలుగో ఏడాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కసారి కూడా సచివాలయంలో అడుగు పెట్టలేదు. పూర్తిగా ప్రగతిభవన్‌ కేంద్రంగానే పాలన చేస్తున్నారు. జనహిత వేదికగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి కొత్త సచివాలయం నిర్మించాలని భావించినా వీలుకాలేదు. సచివాలయం నిర్మాణం రక్షణ శాఖ భూములు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై కొంతవరకు చర్చలు జరిగినా ఫలితం రాలేదు. ఇక రాష్ట్ర విభజనకు సంబంధించిన వివాదాలు ఇంకా సమసిపోలేదు. ఏపీ తమ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలు అప్పగించకుండా జాప్యం చేసింది. హైకోర్టు విభజన, తొమ్మిది, పదో షెడ్యూల్‌లలోని సంస్థలకు సంబంధించిన అంశాలు సైతం పరిష్కారానికి నోచుకోలేదు. 
 
ప్రపంచం దృష్టి తెలంగాణపై.. 
గత ఏడాదిలో ప్రధాని మోదీ చేతుల మీదుగా హైదరాబాద్‌ మెట్రో రైలు పట్టాలెక్కింది. ఇక హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నాలుగో ఏడాదిలో హైలైట్‌గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక రాష్ట్రంలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం నుంచి సూత్రప్రాయ అనుమతి లభించింది. నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. సిద్దిపేట మెడికల్‌ కాలేజీలో ఈ ఏడాది ప్రవేశాలు కూడా మొదలవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ హయాంలో మంజూరైన ఐటీఐఆర్‌కు కేంద్రం వీడ్కోలు పలికింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top