హిమాలయాల నుంచి శీతలగాలులు వీస్తుండటంతో తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
గణనీయంగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హిమాలయాల నుంచి శీతలగాలులు వీస్తుండటం.. పొడి వాతావరణం నెలకొనడంతో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 4 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత రామగుండం, మెదక్‌లలో 12 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
హైదరాబాద్, హన్మకొండ, ఖమ్మంలలో 13 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఖమ్మంలో 4 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. నిజామాబాద్, హకీంపేటల్లో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒకటి రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.