వడ్ల గింజలో...

Sri ramana Satirical Article On Chandrababu Naidu - Sakshi

అక్షర తూణీరం

మొత్తానికి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. గజనీ మహమ్మద్‌ దండ యాత్రల్లాగా పదమూడు సార్లు విఫలమై ఆ తర్వాత అవిశ్వాసానికి సఫలమ య్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మోదీవల్ల ఘోర మరియు తీరని అన్యాయం జరిగిందని ఆలస్యంగా చంద్రబాబు దృష్టికి వచ్చింది. అంతే! అవిశ్వాసానికి భేరి వేశారు. ఇప్పు డేం జరుగుతుందని నాలాంటి సగటు ఓటర్లకి ఉత్కంఠగా ఉంది. ఏమీ జరగదు, వడ్లగింజలో బియ్యపు గింజ అంటున్నారు. తెలివిమీరిన కొందరు. సభ్యుల సంఖ్యని బట్టి సభలో సమయం కేటాయిం చారు. తెలుగుదేశం పార్టీకి పదమూడు నిమిషాల ‘టాక్‌ టైం’ వస్తే, బలవంతంగా ఇంకో రెండు నిమి షాలు వినిపిస్తారేమో. అయితే అవిశ్వాసంపై చర్చ మొదలయ్యాక టీడీపీకి 50 నిమిషాల పైనే మాట్లాడ టానికి అవకాశం ఇచ్చారు.

ఈ కాస్త వ్యవధిలోనే గతమంతా తవ్వి పొయ్యాలి. కాంగ్రెస్‌ పార్టీకి ఏ మాత్రం ఒత్తిడి తగ లకుండా నేపథ్యాన్ని చెప్పుకు రావాలి. మోదీ పాల నలో ఏపీకి జరిగిన అన్యాయాలను, మోదీ వాగ్దాన భంగాలను తెలుగుదేశం సభ్యులు గడగడా అప్ప జెప్పాలి. ఈ సందర్భాన్ని అడ్డం పెట్టుకుని భారత ప్రధానిని ఉతికి, ఝాడించి పార్లమెంట్‌ హాల్లో ఆరేస్తారు. దాంతో అధికార పార్టీ సొమ్మసిల్లిపో తుంది. అరె! తెలుగు తమ్ముళ్లు మన ప్రభుత్వ వైఫ ల్యాలని, మోదీ సవతి తల్లి ప్రేమని ఓ క్రమంలో కడిగి ఆరపోశారని విస్తుపోతారు. 

నేరకపోయి మన మోదీ చంద్రబాబుతో పెట్టు కున్నందుకు కమల దళం నాలుకలు కరచుకుం టుంది. కొందరికి ఒడుపు తెలియక నోట్లో నెత్తుర్లొ స్తాయ్‌. ఇలాంటి దృశ్యాన్ని టీడీపీ వూహిస్తోంది. కానీ అనుభవజ్ఞులు ఈ సీన్‌ రివర్స్‌ అవుతుందంటు న్నారు. తెలుగుదేశం సభ్యులు పాడిన పాటే పాడి, ఎనభై నిమిషాలు హరించుకుంటారు. ఇంకో ఇరవై నిమిషాలు కోరస్‌లతో సరి.

ఇంకా ఇప్పటికి ప్రధాని వంతు రాలేదు. మోదీ తనదైన శైలిలో నిలబడి, తనదైన స్టైల్‌లో ఉండగా, వూహాతీతంగా ప్రసంగం ఆరంభమవుతుంది. బాబు దక్షతని పొగుడుతారు. రాష్ట్రంపట్ల బాబుకి గల భక్తి శ్రద్ధల్ని నొక్కి వక్కాణిస్తారు. గడచిన నాలుగేళ్లలో ఏపీకి ఎన్నేసి కోట్లు నిధులు ఇచ్చిందీ వివరిస్తారు. ఏయే సంస్థలు మంజూరు చేసిందీ చెబుతారు. రైల్వే జోన్‌ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నామంటారు. మోదీ చాలా సమతూకంగా జవాబిస్తారు. 

మూడు గంటలసేపు నిండు హాల్లో మ్యాట్నీ సినిమా చూపిస్తారని ఒక వర్గం అభిప్రాయపడు తోంది. నిన్నటిదాకా తన మంత్రి వర్గంలో ఉండి సహకరించిన టీడీపీ మంత్రులని అభినందిస్తారట. ఆనక అసలు చిట్టాలు విప్పుతారట. ఎన్ని నిధులు దారిమళ్లాయో వివరిస్తారు. వరల్డ్‌ క్లాస్‌ క్యాపిటల్‌ మోదీ వాగ్దానం కాదు. పోలవరం పూర్తి చేస్తారు. మోదీ ఆవేశపడరు. నా పరిధి భారతదేశంగానీ ఏపీ మాత్రమే కాదని చెబుతారు. 

తర్వాత లాంఛనప్రాయంగా ఓటింగ్‌ ముగు స్తుంది. నాలుగేళ్ల నా పాలన తర్వాత కూడా నాటి సభ్యులంతా నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ సంగతి తేల్చుకోడానికి పార్లమెంట్‌లో అవకాశం కల్పించిన చంద్రబాబుకి ధన్యవాద్‌! మోదీ సుదీర్ఘ సమాధాన ప్రసంగంలో అనేక విషయాలు వెలుగు లోకి వస్తాయి. ఉన్నత న్యాయస్థానానికి సమర్పిం చిన అఫిడవిట్‌లో కేంద్రం బోలెడు అబద్ధాలు ఉటం కించిందని బాబు ఆరోపణ. దీన్నెవరూ పట్టుకు ప్రశ్నించలేరా? అఫిడవిట్‌ సంతకం చేసిన వారికి శిక్ష ఉండదా? ఇవి సామాన్యుడి సందేహాలు. 

చాలామంది ఏమంటున్నారంటే– మోదీ బయ టపెట్టే నిజాలు బాబు ప్రత్యర్థులకు కొత్త బలాన్ని స్తాయి. వైఎస్సార్‌సీపీ తదితరపార్టీలకు వచ్చే ఎన్ని కల దాకా అవి ఇంధనంగా ఉపయోగపడతాయి. నిధులకు సంబంధించిన నిజాల్ని నిగ్గు తేల్చడం అసాధ్యమేమీ కాదు. ఇప్పుడేం జరిగింది? మాట్లా డిందే మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే అత్యంత విలువైన సభా సమ యం చాలా వృథా అయ్యింది. చంద్రబాబు మోదీని విలన్‌గా చూపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తు న్నారు. బీజేపీకి పెద్దగా ఓట్లు లేని ఏపీలో నష్ట పోయేదేమీ లేదని మోదీ ఉదాసీనంగా ఉన్నారు. వడ్ల గింజలో బియ్యపు గింజ!

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top