రాయని డైరీ: ముకేశ్‌ అంబానీ (రిలయన్స్‌) | Madhav Singaraju Rayani Dairy On Mukesh Ambani | Sakshi
Sakshi News home page

రాయని డైరీ: ముకేశ్‌ అంబానీ (రిలయన్స్‌)

Jul 12 2020 1:00 AM | Updated on Jul 12 2020 1:00 AM

Madhav Singaraju Rayani Dairy On Mukesh Ambani - Sakshi

నేను చూసుకోలేదు. నీతా వచ్చి చూపించింది.
‘‘టాప్‌ టెన్‌ రిచ్‌లో మీరు ఎనిమిది లోకి వచ్చారు’’ అంది నవ్వుతూ. 
కళగా ఉంటుంది నీతా ముఖం. రేపు నేను మళ్లీ తొమ్మిదిలోకి పడిపోయి, తొమ్మిది నుంచి పదిలోకి చేరిపోయినా ఆ ముఖం కళ తప్పదు. ‘‘అసలు ఎవరైనా టాప్‌ హండ్రెడ్‌లో ఉన్నారంటేనే గ్రేట్‌ కదా..’’ అంటుంది. 
నీతా చేతిలో పూలసజ్జ ఉంది. 
‘‘గుడికా నీతా.. ’’ అన్నాను. 
‘‘అవును. శుక్రవారం కదా, అమ్మవారి గుడికి..’’ అంది. 
సంతోషం అనిపించింది. ‘మీరు ఎయిత్‌ లోకి వచ్చారు కదా, అర్చన చేయించడానికి..’ అని చెప్పలేదు. 
‘‘సరే నీతా.. జాగ్రత్త. మాస్క్‌ పెట్టుకో. నాలుగు నిమిషాల కంటే ఎక్కువసేపు ఎవరి ఎదురుగా నిలుచోకు. ఎక్కడో చదివాను. మాస్క్‌ పవర్‌ నాలుగు నిమిషాలేనట’’ అని చెప్పాను. 
నీతా నవ్వింది. ‘‘మీరు జాగ్రత్త. మీరు ఎయిత్‌లోకి వచ్చారని మనవాళ్లెవరైనా పూలబొకేతో వచ్చి, బొకే ఇచ్చేటప్పుడు వేళ్లు తగిలిస్తారేమో. బొకేని ఆ టీపాయ్‌ మీద పెట్టమనండి’’ అంది. 
నీతా వెళ్లాక, పేపర్‌ తీశాను. మాస్క్‌ పవర్‌ నాలుగు నిమిషాలైతే.. బ్లూమ్స్‌బర్గ్‌ బిలియ నీర్‌ల ఇండెక్స్‌ పవర్‌ ఇరవై నాలుగు గంటలు. ఇరవై నాలుగు గంటల తర్వాత ఇదే పేపర్‌లో ‘అంబానీని నెట్టేసిన బఫెట్‌’ అనే గ్రాఫు కనిపించవచ్చు. నవ్వొచ్చింది నాకు. 
ఎవరో వస్తున్న చప్పుడైంది. పూలబొకే పట్టుకుని ఎవరైనా రావచ్చని నీతా చెప్పింది నిజమే!
‘‘గుడ్‌ మాణింగ్‌ అన్నయ్యా..’’ అన్నాడు అనిల్‌.. లోపలికి వస్తూ. 
అనిల్‌ చేతిలో బొకే లేదు. లేకపోవడం మంచిదైంది. ఉంటే, ‘ఇప్పుడు మన ఆస్తుల విలువ ఎంత అన్నయ్యా’ అని అడగడానికి ఆ బొకే అతడికి తగిన సందర్భాన్ని కల్పించి ఉండేది. 
‘‘బఫెట్‌ని మించిపోయావ్‌ కదన్నయ్యా! అవునూ అన్నయ్యా.. అరవై మూడూ పాయింట్‌ ఎనిమిది బిలియన్‌ డాలర్లు అంటే ఐదు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలే కదా..’’ అన్నాడు. 
‘‘కాదు’’ అన్నాను. 
‘‘అదేంటన్నయ్యా!!’’ అన్నాడు. 
‘‘రూపాయల లెక్క కరెక్టే. డాలర్లు మాత్రం అరవై మూడూ పాయింట్‌ ఎనిమిది బిలియన్‌లు కాదు. అరవై ఎనిమిదీ పాయింట్‌ మూడు బిలియన్‌లు’’ అన్నాను. 
‘‘అందుకే అన్నయ్యా.. నువ్వు నువ్వే. నేను నేనే’’ అన్నాడు. అన్నాక.. ‘‘అన్నయ్యా.. వైఫ్‌ హండ్రెడ్‌ రుపీస్‌ కావాలి’’ అన్నాడు! 
‘‘ఐదొందలా!! లాస్ట్‌ ఇయర్‌ మార్చి నెలలోనే కదా ఇచ్చాను. మళ్లీ ఏమిటి!’’ అన్నాను. 
‘‘నేనూ అదే అన్నాను అన్నయ్యా.. పాన్‌ షాపువాడు ఎప్పటి మార్చి, ఎక్కడి జూలై అంటున్నాడు’’ అన్నాడు.
కోపం వచ్చింది నాకు. 
‘‘పాన్‌ ఎప్పటి నుంచి వేసుకుంటున్నావ్‌?’’ అన్నాను. ‘‘అబ్బే.. నేను కాదన్నయ్యా. నా పేరు చెప్పి నా ఫ్రెండ్‌ కట్టించుకున్నాడట పాన్‌లు..’’ అన్నాడు.  మౌనంగా ఉన్నాను. 
‘‘ఇంకో ఐదొందలు కూడా ఇవ్వన్నయ్యా. సాయంత్రం పూలబొకే తెస్తాను’’ అన్నాడు. 
ఐదొందలు ఇచ్చి, ‘మనలో మనకు బొకేలు ఎందుకులే అనిల్‌’ అన్నాను. 
తీసుకుని వెళ్లిపోయాడు. 
అనిల్‌ ఎప్పటికి మారతాడో తెలియడం లేదు. బఫెట్‌ దానాలిచ్చి నా కన్నా డౌన్‌లోకి వెళ్లిపోయాడు. అనిల్‌కి అడిగినప్పుడల్లా డబ్బులిస్తుంటే టాప్‌ టెన్‌ నుంచి టాప్‌ ఫైవ్‌ హండ్రెడ్‌లోకి వెళ్లడానికి ఎంతసేపు! అప్పుడు కూడా నీతా.. ‘ఎవరైనా అసలు టాప్‌ ఫైవ్‌ హండ్రెడ్‌లో ఉన్నారంటేనే గ్రేట్‌ కదా..’ అంటుందేమో.. అదే చిరునవ్వుతో.

- మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement