మోదీకి ఓ సలహా

Gollapudi Writes on Narendra Modi - Sakshi

జీవన కాలమ్‌
రాహుల్‌ గాంధీ సూచనలను బొత్తిగా కొట్టిపారేయకుండా మోదీ ‘జాదూ కా జప్పీ’ని గుర్తుంచుకోవాలి. వారు విదేశాల్లోనే కాకుండా దేశంలో పర్యటించి నప్పుడు మధ్య మధ్య మామూలు మనుషుల్ని కూడా కావలించుకోవాలి.

నాకు రాహుల్‌ గాంధీ అభి ప్రాయాలమీద అపారమైన విశ్వాసం ఉంది. వారు ఏ అభిప్రాయమైనా ఆచితూచి చెబుతారు. ఇప్పుడు రాహుల్, మోదీకి ఓ సలహా చెప్పారు. మోదీ టీవీలు తరచూ చూస్తారని మొన్న రాజ్యస భలో రేణుకాదేవి నవ్వుకి రామాయణాన్ని ఉదహరిం చడం ద్వారా మనకి అర్థమయింది. అలాగే వారు ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమాని కూడా చూసి ఉండవచ్చు.

అందులో కథానాయకుడు సంజయ్‌దత్‌ మహాత్మాగాంధీ ఉదహరించిన ‘జాదూ కి జప్పీ’ మోదీ హృదయానికి గట్టిగా హత్తుకుని ఉంటుంది. మహా త్ముడు– ఎదుటి వ్యక్తి మంచిచెడ్డలను విశ్లేషించకుండా గట్టిగా ఆలింగనం చేసుకోవడం వల్ల ఎటువంటివార యినా ఆత్మీయులవుతారనీ– ఇదే ‘ఆలింగనంలో ఉన్న మ్యాజిక్‌’ అని వక్కాణించారు. కనుక– ఈ మూడు నాలుగు సంవత్సరాలలో వారు పర్యటించిన 50 దేశా లలో ఈ ‘మ్యాజిక్‌’ని వినియోగించారు.

అయితే ఇందులో చిన్న పక్షపాత ధోరణి ఉన్నదని రాహుల్‌ గాంధీ భావించారు. ఎంతసేపూ మోదీ ఆయా దేశాల నాయకుల్ని, మహానుభావుల్నీ కావలించుకుం టారు కానీ– పేద రైతుల్నీ, కార్మికుల్నీ, జవాన్లనీ కావ లించుకోవడం లేదు అని విచారాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా ఈ వీరంగాన్ని మనం ఎన్నికల్లో చూస్తాం. మామూలు రోజుల్లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాన్ని మరచిపోతారు.
‘ఒరే కేతీ! మన నియోజకవర్గం పేరేటిరా?’ అని గుర్తు తెచ్చుకుంటారు.
గుడిసె గుడిసెకీ వెళ్లి అందర్నీ కావలించుకుని, ముద్దులాడి, పిల్లల్ని ఎత్తుకుని కితకితలు పెట్టి, వీల యితే వారింట్లో తరవాణీ అన్నం రుచి చూస్తారు. సంభాషణ ఇలా సాగుతుంది:
‘బాగున్నావా నూకాలమ్మా?’
‘బాగున్నాను కానీ నా పేరు నూకాలమ్మ కాదు బాబూ– అసిరమ్మ’
‘నీ మొగుడు ఉద్యోగం చేస్తున్నాడా?’
‘ఆడు సచ్చిపోయి 13 ఏళ్లయింది బాబూ’
‘నీ కొడుకు నౌఖరీ ఎలా ఉంది?’
‘నాకు కొడుకే లేడు బాబూ’
ఎమ్మెల్యేగారు కంగారుపడి కార్యకర్త వేపు తిరిగి– మెల్లగా ‘ఏరా! లం.. కొడకా! ఏటీ తిరకాసు?’
కార్యకర్త ‘వార్డు నంబరు తప్పు పడిందయ్యా’ అని నాలిక కొరుక్కుంటాడు.
ఒక్కో నాయకునికి ఒక్కొక్క అలవాటుంటుంది. ఒక్కో ఏడుపు ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌జీఆర్‌ మామూలు మనుషుల్ని ఆదరంగా కావలిం చుకునేవారు. అంతే. ఓట్ల వర్షం కురిసేది. నెహ్రూ ఉన్నట్టుండి కారులోంచి దూకి రోడ్డు పక్క నిలబడిన పిల్లల్ని ముద్దాడేవారు. రక్షణ సిబ్బందికి తలప్రాణం తోకకి వచ్చేది. దాదాపు తాతగారి మర్యాదల్నే పాటిం చిన రాజీవ్‌ గాంధీ ప్రజల మధ్య అలవోకగా నడిచి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు.

ఇప్పుడు మోదీకి నావి కొన్ని సలహాలు. రాహుల్‌ గాంధీ సూచనలను బొత్తిగా కొట్టిపారేయకుండా మోదీ ‘జాదూ కా జప్పీ’ని గుర్తుంచుకోవాలి. వారు విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా దేశంలో పర్యటించినప్పుడు మధ్య మధ్య మామూలు మను షుల్ని కూడా కావలించుకోవాలి. అయితే వారిలో రైతులు ఎవరు, కార్మికులు ఎవరు, జవాన్లు ఎవరు– అన్నది ఎలా తెలుస్తుంది? మార్గం ఉంది. మోదీ వెళ్లే ఊరేగింపులో ‘ఎర్ర’ బ్యాడ్జీ పెట్టుకున్న వ్యక్తి కార్మి కుడుగా ముందు రక్షణ శాఖ మోదీకి సూచన చేయవచ్చు.

అలాగే ‘పచ్చ’ బ్యాడ్జీ రైతుగా, మిలట్రీ యూని ఫారం రంగు బ్యాడ్జీగల వారిని సైనికులుగా మోదీకి సూచించవచ్చు. మధ్య మధ్య ఓ రిక్షా వాడిని, ఓ మరమరాల దుకాణం వాడిని, ఓ టీ దుకాణం వాడినీ కావలించుకోవచ్చు. అయితే ఇందులో చిన్న తిరకాసు ఉంది. మోదీ ఊరేగింపులో ఉన్నట్టుండి ఆయన కారు దిగి తనవైపు దూసుకు వస్తుంటే మరమరాల దుకాణం వాడికి చెమటలు పట్టవచ్చు. భయంతో పారిపోవచ్చు. కంగా రుతో భోరుమని ఏడవవచ్చు. మరి ఫలానా మరమ రాల వాడిని మోదీ కావలించుకుంటారని రక్షణ శాఖకి ఎలా తెలుస్తుంది? అందుకని మోదీ వెళ్లే దారిలో కావలించుకున్నా ఇబ్బందిలేని టీకొట్టువాడు, పాత సామాన్లు అమ్మేవాడు– వీళ్లకి ధైర్యం చెప్పడానికి మామూలు దుస్తుల్లో రక్షణ భటుల్ని ఉంచాలి.

‘చూడు బాబూ.. కొద్దిసేపట్లో ప్రధానమంత్రి ఇటు వస్తారు. వారు కారు దిగి ఒకవేళ నీ వేపు వస్తే నువ్వు కంగా రుపడనక్కర లేదు. కేవలం నిన్ను కావలించుకుని మురిసిపోతారు. అంతే’ అని ధైర్యం చెప్పాలి. అలా పోగయిన వాళ్లలో ఓ థానూ, ఓ శివరాజన్‌ వంటి వారు ఉండకుండా చూసుకోవాలి.

ఏనాడైనా మోదీ చాలా గడుసయిన నాయకులని నాకనిపిస్తుంది. విదేశాల్లో 50 కెమెరాలు తమ మీద ఉండగా కావలించుకున్న మోదీ గారిని ట్రంప్‌ దొర గారు తుపాకీతో కాల్చరు. మరి ‘జాదూ కా జప్పీ’ మాటో! రోడ్డుమీద మనిషికి మోదీ ఆ అవకాశం కల్పించి తనకి పక్షపాతం లేదని నిరూపించుకోవాలి. ఇదీ రాహుల్‌ అభిమతం.

గొల్లపూడి మారుతీరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top