రైతు కేంద్రక విధానం ఎక్కడ? | Devinder Sharma Writes Guest Column ABout Agriculture Centers In India | Sakshi
Sakshi News home page

రైతు కేంద్రక విధానం ఎక్కడ?

Published Thu, Jul 23 2020 12:32 AM | Last Updated on Thu, Jul 23 2020 12:43 AM

Devinder Sharma Writes Guest Column ABout Agriculture Centers In India - Sakshi

కార్పొరేట్‌ మొండి బకాయిలను మాఫీ చేస్తే ఆర్థిక ప్రగతికి అది ఎలా దోహదపడుతుందో, రైతుల రుణమాఫీలను రద్దు చేస్తే అది జాతీయ చెల్లింపుల సమతూకానికి ఎలా తూట్లు పొడుస్తుందో వివరించి చెప్పేవారే లేరు. కంపెనీలు అధిక వేతనాలు చెల్లించకుండా తప్పించుకోవడానికి వీలు కలిగిస్తూ గ్రామాలనుంచి పట్టణాలకు శ్రామిక శక్తిని భారీస్థాయిలో తరలించడం అనే కాలం చెల్లిన ఆర్థిక థియరీని దేశదేశాలు గుడ్డిగా ఎందుకు ఇంకా పాటిస్తున్నాయి? మన దేశంలో సంపన్నులకు సోషలిజం అమలుచేస్తూ పేదలను మాత్రం మార్కెట్‌ భూతాల కోరల్లో పడవేస్తున్న విధానాలను మన పాలకులు ఎందుకు కొనసాగిస్తున్నారు? మన ఆర్థిక చింతనలో కనిపిస్తున్న ఈ పాక్షికత ఇకనైనా మారవలసి ఉంది.

అమెరికా కార్మికశాఖ మాజీ మంత్రి రాబర్ట్‌ రీచ్‌ రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేస్తూ, అమెరికాలో ఒక్క శాతం సంపన్నులు  దేశం స్టాక్‌ మార్కెట్‌ విలువలో సగం వాటాను సొంతం చేసుకున్నారని, అలాగే దేశంలోని 10 శాతం మంది సంపన్నులు 90 శాతం స్టాక్‌ విలువలను చేజిక్కించుకున్నారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అంటే స్టాక్‌ మార్కెట్టేనని ట్రంప్‌ పేర్కొన్నప్పుడు వాస్తవానికి ఆయన ఎవరి గురించి మాట్లాడారో అందరికీ తెలిసిపోయింది. అయితే స్టాక్‌ మార్కెట్‌ విజృంభించడం అనేది ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు ప్రతిబింబం అని నమ్మే దేశాధినేతల్లో ట్రంప్‌ మొదటివాడూ కాదు.. చివరివాడూ కాదు. అలా విశ్వసించే వారి జాబితా చాలానే ఉంటుంది. అందుకే ఈ భావాన్ని మన మనస్సుల్లోకి ఇంకించడంలో క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు ఎంతగా విజయవంతమయ్యాయో ఇది సమర్థవంతంగా చూపిస్తోంది.

భారత ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్‌ను సమర్ఫించిన రోజు అందరికళ్లూ స్టాక్‌ మార్కెట్లవైపు పడ్డాయి. కనీవినీ ఎరుగని రీతిలో దేశీయ డిమాండ్‌ పతమైపోయినప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి నిర్మలా సీతారామన్‌ గత సెప్టెంబర్‌లో వరుసగా ఉద్దీపన చర్యలు ప్రకటించినప్పుడు ఆమె పరిశ్రమకు రూ. 1.45 లక్షల కోట్ల మొత్తాన్ని పన్ను రాయితీ రూపంలో ప్రకటించారు. అలాగే కార్పొరేట్‌ వర్గాలపై కీలకమైన పన్ను రేటును 22 శాతానికి కుదించారు. ఆ మరుసటి దినం దీనికి స్పందనగా స్టాక్‌ మార్కెట్లు పండుగ చేసుకున్నాయి. గత పదే ళ్లలో ఎన్నడూ ఎరుగని విధంగా షేర్లు 5 శాతానికి పెరిగాయి. అయితే ఈ మొత్తంలో కొంత భాగాన్ని పేదల చేతుల్లో పెడుతూ కేటాయిం పులు చేసి ఉంటే స్టాక్‌ మార్కెట్‌ స్తబ్దంగా ఉండిపోయేది కానీ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప జేయడం ద్వారా దేశంలో మరింత డిమాం డును సృష్టించి ఉండేది.

ఇప్పుడు సైతం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కరోనా వైరస్‌ కుళ్లబొడుస్తున్న సమయంలోనూ స్టాక్‌ మార్కెట్లు ఉరుకులు పెడుతున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత పాల్‌ క్రూగ్‌మన్‌ స్పందిస్తూ ఘోరమైనది ఏదో జరుగబోతోందని వ్యాఖ్యానించారు. కరోనా విజృంభించిన మార్చి 18 నుంచి జూన్‌ 17 మధ్య కాలంలో 614 మంది అమెరికన్‌ బిలియనీర్ల సంపద 584 బిలియన్‌ డాలర్లకు పెరగడమే దీనికి సాక్ష్యం. ఇదే కాలంలో 4 కోట్ల 55 లక్షలమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగుల క్యూలో నిలుచున్నారు. అమెరికాలో పోగుపడిన సంపదలో చాలా భాగం వాల్‌స్ట్రీట్‌కి సంబంధించినది కాగా, ఆర్థికపరమైన బెయిలవుట్లు, ఉద్దీపన ప్యాకేజీలు వంటివి సంపన్నుల జేబుల్లోకి మరింత డబ్బును నింపడానికే పరిమితమయ్యాయి. పైగా, పరిణామాత్మకమైన సరళీకరణ పేరిట అదనపు డబ్బును మరింతగా ముద్రించడం కీలకస్థానం సాధించింది. 

ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థ ప్రకారం ప్రపంచ పరిణామాత్మక సరళీకరణలోభాగంగా ఆస్తుల కొనుగోళ్లు 2020 చివరినాటికి 6 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఆర్థిక, ప్రాపర్టీ మార్కెట్లను పెంచి పోషించడం ద్వారా సంపన్నులు మరింత సంపన్నులుగా మారడానికే తోడ్పడవచ్చు. కానీ మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ పరిణామాత్మకమైన సరళీకరణను ప్రజలకోసం రూపొందించడాన్ని నేను అస్సలు చూడలేదు. మన ఆర్థిక ప్రణాళికలో ప్రజాకేంద్రక సరళీకరణను చేర్చడంలో వైఫల్యం ఎందుకు సంభవించిందో, మీడియా డిబేట్లలో ఇది ఎందుకు చర్చనీయాంశంగా కాలేకపోయిందో నాకయితే ఆర్థం కావడం లేదు.

భారతదేశంలో కార్పొరేట్‌ పన్ను శ్లాబ్‌ రేటును అత్యల్పంగా 15 శాతానికి కుదించుకోవడం ద్వారా రూ.2.50 లక్షల కోట్లను పన్ను రూపంలో మినహాయింపు పొందాలని పరిశ్రమ వర్గాలు లాబీ చేస్తున్నాయి. వచ్చే 10 సంవత్సరాల్లో ప్రపంచంలోని ఒక శాతం సంపన్నులు సంవత్సరానికి కేవలం 0.5 శాతం అదనపు పన్నును చెల్లించడానికి సిద్ధపడితే అది 11 కోట్ల 70 లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించగలదని ఆక్స్‌ఫామ్‌ అధ్యయనం తెలిపింది. ఆర్థిక కోణంలో దీన్ని మనం చూడగలిగినట్లయితే ఇది అద్భుతాలు సృష్టించగలదని మనకు బోధపడుతుంది. ఉపాధి కల్పన, తగు సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేవి అంతిమంగా ప్రగతిని ముందుకు నడిపిస్తాయని యూఎన్‌సీఎస్‌డీ పేర్కొంది. కానీ, కార్పొరేట్‌ ట్యాక్స్‌ కాస్త పెంచితే ఇంతభారీగా ఉపాధి అవకాశాలు వస్తున్నప్పుడు మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు కార్పొరేట్‌ పన్ను పెంపుదలపై ఎందుకు కిమ్మనకుండా ఉన్నారో అర్థం కావడం లేదు.

గత 30 ఏళ్లలో ఒక శాతం సంపన్నుల సంపద 22.65 బిలియన్‌ డాలర్లకు పెరగగా, సమాజంలో దిగువస్థాయిలో ఉన్న 50 శాతం జనాభా సంపద అదే సమయంలో 776 బిలియన్ల మేరకు దిగజారిపోయిందని అమెరికా రాజకీయనేత బెర్నీ శాండర్స్‌ చెప్పారు. సంపద విషయంలో పెరుగుతున్న ఈ స్థాయి అసమానత్వం నిజంగానే నైతిక బాహ్యమైన విషయమని తాను పేర్కొన్నారు. అసమానత్వం అనేది సంపద పోగుపడటంతో ముడిపడి ఉంది, అదే సమయంలో అది భావజాలపరమైన పాక్షికతను కూడా పెంపొందిస్తోంది. భారత్‌లో ఒక మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు గతంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ మొండిబకాయిలు లేక నిరర్ధక ఆస్తులు అనేవి ఆర్థిక ప్రగతికి దారితీస్తాయని చెప్పారు. 

అయితే మన దేశంలో కార్పొరేట్లు, రైతులు అదే బ్యాంకులనుంచి రుణాలను ఎలా పొందుతున్నారన్నది ఆలోచించాల్సిన ప్రశ్నే. కార్పొరేట్‌ మొండి బకాయిలను మాఫీ చేస్తే ఆర్థిక ప్రగతికి అది ఎలా దోహదపడుతుందో, రైతుల రుణమాఫీలను రద్దు చేస్తే అది జాతీయ చెల్లిం పుల సమతూకానికి ఎలా తూట్లు పొడుస్తుందో వివరించి చెప్పేవారే లేరు. కంపెనీలు అధిక వేతనాలు చెల్లించకుండా ఎగవేయడానికి తప్పించుకోవడానికి వీలు కలిగిస్తూ  గ్రామాలనుంచి పట్టణాలకు శ్రామిక శక్తిని భారీస్థాయిలో తరలించడం అనే కాలం చెల్లిన ఆర్థిక థియరీని దేశదేశాలు గుడ్డిగా ఎందుకు ఇంకా పాటిస్తున్నాయి?

అదే సమయంలో, వ్యవసాయంలో అదనపు పెట్టుబడి పెట్టడం, ప్రజారోగ్యం, విద్యకు అధికంగా ఖర్చు చేయడం అనేది ఆర్థిక వ్యవస్థను ఎలా వెనక్కు లాగుతుందో ఆర్థికవేత్తలు చెప్పాల్సి ఉంది. ఒక్క కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల మన ప్రభుత్వాలకు ప్రజారోగ్యం ప్రాధాన్యత ఏమిటో తెలిసివచ్చింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ రంగానికి ఎనలేని బాధ్యత ఉంది. ప్రైవేట్‌ రంగం ఒక్కటి మాత్రమే దీన్ని పూర్తి చేయలేదు. దేశంలో ఇప్పటికే కొంతవరకు పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యాలు నడుస్తున్నాయనుకోండి. వచ్చే ఐదేళ్లలో కేంద్రప్రభుత్వం మాత్రమే ఆరోగ్య రంగంపై జీడీపీలో కనీసం 2.1 శాతం మేరకు కేటాయించవలసి ఉందని 15వ ఆర్థిక కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌.కె. సింగ్‌ చెప్పారు. కారణం ఏదైనా కావచ్చు సాధారణ సమయాల్లో సైతం ప్రజారోగ్యం ప్రాధాన్యతను తగ్గించకూడదు. కానీ ఆర్థిక కమిషన్‌ నివేదికలను క్లాస్‌ రూముల్లో చర్చించడం ద్వారా మాత్రమే సామాజిక రంగాల్లోని ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడంపై తగిన ఆర్థిక విధానాలను మన ఆర్థికవేత్తలు రూపొందించలేరు పైగా ఇది తీవ్రమైన సామాజిక, ఆర్థిక అసమానతలకు దారితీస్తోంది.

బ్రిటన్‌ తన జీడీపీలో ప్రజారోగ్యంపై 9.6 శాతాన్ని వెచ్చించడం యావత్‌ ప్రపంచానికి గుణపాఠం కావాలి. భారతదేశం తనవంతుగా జీడీపీలో కనీసం 6 శాతం మేరకు ప్రజారోగ్యంపై ఖర్చుపెట్టకూడదు. దేశజనాభాలో 50 శాతం మంది  వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుండగా, 2010–2012 నుంచి 2017–18 మధ్యకాలంలో వ్యవసాయంలో పెట్టుబడులు కేవలం 0.4 శాతంతో స్తబ్దుగా ఎందుకు ఉండిపోయాయి? దేశంలోని సంపన్నులు బ్యాంకులనుంచి భారీ స్థాయిలో రుణ మాఫీలు పొందుతూ ప్రభుత్వాలనుంచి పన్ను రాయితీలు గుంజుతూ, అభివృద్ధి కోసం ప్రోత్సాహకాల పేరిట సబ్సిడీలను కొల్లగొడుతూ బలుస్తున్నప్పుడు దేశంలోని కోట్లాది మంది పేదలు కనీస అదాయాలు కూడా లేకుండా ఎందుకు కునారిల్లిపోతున్నారు? అంతకుమించి మన దేశంలో సంపన్నులకు సోషలిజం అమలు చేస్తూ పేదలను మాత్రం మార్కెట్‌ భూతాల కోరల్లో పడవేస్తున్న విధానాలను మన పాలకులు ఎందుకు కొనసాగిస్తున్నారు. ఆర్థిక ప్రగతి సిద్ధాంతవేత్తలు సమస్త ప్రకృతితో ఎందుకు ఘర్షణ పడుతున్నారు. ఇవి సమాధానం చెప్పలేని సంక్లిష్ట ప్రశ్నలు కావు. కానీ ఆర్థిక వ్యవస్థను పునరాలోచింపచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నాయి.


వ్యాసకర్త
దేవీందర్‌ శర్మ

వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ :  hunger55@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement