అనవసర యంత్రాలతో అధిక హాని | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 31 2018 12:51 AM

Devinder Sharma Writes Article On Unnecessary Agricultural Machinery - Sakshi

అత్యధిక వ్యయంతో కూడిన వ్యవసాయ యంత్రాల అనవసర భారం వల్లే దేశీయ వ్యవసాయం దురవస్థల పాలవుతోందని గుర్తించకపోవడం వలన వ్యవసాయిక ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలు తమ రైతులకు మరిన్ని యంత్రాలను అమ్మడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. వరి పంట కోతల కాలం సమీపిస్తుండటం, ఢిల్లీలో వాయు కాలుష్యం భీతి కలిగిస్తుండటం వల్ల, ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ పంట కోతలు పూర్తయ్యాక మిగిలే దుబ్బు తగులబెట్టడం లేదా తొలగించడం పేరిట మరిన్ని యంత్రాలను రైతులకు అంటగట్టేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. 

పంటకోతలు పరాకాష్టకు చేరుతున్నందున, పంజాబ్‌ 27,972 వ్యవసాయ యంత్రాల సరఫరాను లక్ష్యంగా పెట్టుకుంది. వరి నాటు యంత్రాలు, పంట కోత యంత్రాలు, దుబ్బును తొలగించే యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు వంటి పలు రకాల పనిముట్లు వీటిలో భాగం. ఇక హరియాణాలో అలాంటి 40 వేల యంత్రాలను ఇప్పటికే 900 కిరాయి కేంద్రాలకు, వేలాది విడివిడి రైతులకు ప్రత్యక్ష కొనుగోలు పద్ధతిలో సరఫరా చేశారు. రైతులకు కలుపుతీత, వరిపంట కోత యంత్రాన్ని –హ్యాపీ సీడర్‌ మెషీన్‌– 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇకపోతే కో–ఆపరేటివ్‌ లేదా రైతుల బృందాలకు దీన్ని 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. 

వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు ఇది వరం లాంటిది. చాలా కాలంగా ఈ యంత్రాలను అమ్మడానికి వీరు పెద్ద ఎత్తున లాబీ చేస్తున్నారు. పంజాబ్‌లో లక్ష ట్రాక్టర్లు అవసరమైన చోట ఇప్పటికే నాలుగున్నర లక్షల ట్రాక్టర్లను ఉనికిలోకి తెచ్చారు. ఒక యంత్రం అవసరమైన చోట పంజాబ్‌ రైతులు ఆరు నుంచి ఎనిమిది వరకు అదనపు యంత్రాల భారాన్ని ఎందుకు మోస్తున్నారనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ట్రాక్టర్లను మోతాదుకు, అవసరానికి మించి మోస్తుండటమే పంజాబ్‌ రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణమవుతోంది. వ్యవసాయ కార్యకలాపాల్లో అధిక యంత్రాల వినియోగం రైతుల రుణభారాన్ని మరింతగా పెంచుతోంది. 

వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సబ్సిడీ కేటాయింపును పరిశీలిస్తే ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఎంత హ్రస్వ దృష్టితో ఉంటున్నాయో అర్థమవుతుంది. ఈ కేటాయింపుల అసలు లక్ష్యం వ్యవసాయదారుల పేరుతో వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు సహాయం చేయడమేనా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. గతంలో కూడా పాలీ హౌస్‌ల (పాలిథిన్‌ షీట్ల నీడలో చేసే వ్యవసాయం)ను ఏర్పాటు చేయడానికి వాటి పరిమాణాన్ని బట్టి రూ. 25 లక్షల భారీ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ పాలీ హౌస్‌లలో 80 శాతం కంటే ఎక్కువగా పని చేయడం లేదని అనేక అధ్యయనాలు కోడై కూస్తున్నాయి. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువ కాదు.

అయితే పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లకు ఏది అవసరమో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ గతంలోనే సూచిం చారు. దుబ్బును తగులబెట్టకుండా, తొలగించడానికి కేంద్రప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలను మదుపు పెట్టాల్సి ఉంది. ‘క్వింటాల్‌ దుబ్బు తొలగింపునకు కనీసం రూ. 100లు ఇవ్వాలని మేం కేంద్రాన్ని డిమాండ్‌ చేశాం. ఈ మొత్తం రూ. 2 వేల కోట్లకు సమానం’ అని చెప్పారాయన. అమరీందర్‌ సింగ్‌ చెప్పింది యథార్థం. కానీ అంత డబ్బు తమ వద్ద లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. అయితే జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదించిన 6.9 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఒక చిన్న మొత్తాన్ని ఈ దుబ్బు తొలగింపు సమస్య పరిష్కారం కోసం ఎందుకు వెచ్చించలేరో అర్థం కాదు. కానీ వ్యవసాయం విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం ప్రతిసారీ మొండిచేయి చూపిస్తుంటుంది.

పంట అవశేషాలను తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు తీసుకుంటున్నందుకు తమపై పడుతున్న అదనపు ఖర్చులకోసం గాను ఎకరాకు రూ.6 వేలను పరిహారంగా అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పైగా పంజాబ్‌లో పనికి ఆహార పథకంలో 12.5 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఈ పథకం కింద అందుబాటులో ఉన్న రూ. 4 వేల కోట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించలేకపోతోంది. పంట కోతల అనంతరం పొలంలో మిగిలే దుబ్బు నిర్వహణను పనికి ఆహార పథకంలో భాగం చేసినట్లయితే ఖాళీగా ఉన్న రైతుకూలీలకు పని కల్పించడమే కాకుండా, దుబ్బును తగులబెట్టడం ద్వారా కలుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించవచ్చు కూడా.

వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement