కమల దళంలో కలవరం!

BJP Losing Its Strongholds One By One States - Sakshi

సందర్భం

‘బీజేపీ హఠావో– భారత్‌ బచావో‘ నినాదం రోజురోజుకు బలపడుతోంది. జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో కలవరం మొదలైంది. జార్ఖండ్‌ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పునిచ్చారు. బీజేపీ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌–జే.ఎన్‌.ఏం కూటమిని గెలి పించారు. జార్ఖండ్‌ శాసనసభలో మొత్తం 81 స్థానాలుండగా, కాంగ్రెస్‌–జె.ఎన్‌.ఎం (యూపీఏ) కూటమి 48 స్థానాలలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అధికార బీజేపీ 25 స్థానాలకు పరిమితం అయింది. మోదీ 9 ఎన్నికల సభల్లో ప్రసంగించగా కేవలం 3 చోట్ల మాత్రమే బీజేపీ గట్టెక్కింది. దీంతో ఏడాది కాలంలో వరుసగా 5 రాష్ట్రలలో బీజేపీ అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ లలో ప్రజలు బీజేపీని ఇంటికి పంపించారు. జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలను, బీజేపీ దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలనే దురుద్దేశంతో తీసుకున్న ఎన్‌.ఆర్‌.సి. నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన రెఫరెండంగా చూడాలి. భారత రాజ్యాంగ పునాదులను, విలువలను పెకలించేలా, దేశ ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, మోదీ–షా ద్వయం పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌.ఆర్‌.సి.) అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  

కాంగ్రెస్‌ పార్టీని ఈ దేశంలో లేకుండా చేస్తా మని కలలు కన్న బీజేపీ అధిష్టానానికి, ప్రజలు తమ పార్టీనే వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సాగనంపుతుంటే తల బొప్పి కడుతోంది. 2019లో దేశ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, మెజారిటీ ఉన్నది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో  బీజేపీ అనేక ప్రజావ్యతిరేక చట్టాలు తెస్తోంది. కానీ తాము తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, సరైన సమ యంలో, సరైన నిర్ణయం తీసుకుంటారనే ఆలోచనే బీజేపీకి లేదు. దేశ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా వివాదాస్పద నిర్ణయాలతో మోదీ–షాలు కాలం వెళ్లదీస్తున్నారు.  

నోట్ల రద్దు నిర్ణయం, లోపభూయిష్ట జీఎస్టీ విధానం, కశ్మీర్‌ నిర్బంధం, సమాచార హక్కు చట్టానికి కోరలు పీకే సవరణలు లాంటి నిర్ణయాలు బీజేపీ అప్రజాస్వామిక పోకడలకు తార్కాణాలు. ఇపుడు, మైనార్టీ వర్గాలను ప్రత్యేకంగా ముస్లింలను టార్గెట్‌ చేస్తూ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌.ఆర్‌.సి.) పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది. ఈ చట్టం అమలు విషయమై మోదీ–అమిత్‌ షా ఇద్దరూ పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టా లని చూస్తున్నారు. ఈ చట్టాన్ని కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాలరాసే ఈ పౌర చట్టం అమలును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాజ్‌ఘాట్‌ వేదికగా సత్యాగ్రహం చేపట్టింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. 

మోదీ–అమిత్‌ షా ధ్వయానికి అసలు సవాల్‌ ముందుంది. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కమల దళంలో కలవరపాటు పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ మినహా చెప్పుకోదగ్గ పెద్ద రాష్ట్రంలో ఎక్కడా అధికారంలో లేని బీజేపీకి ఈ ఎన్నికలు కత్తిమీద సాము లాంటివి. జార్ఖండ్‌ ఎన్నికల్లో లెక్కచేయని బీజే పీతో, బీహార్‌ ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేసే విషయమై జేడీయూపార్టీ పునరాలోచనలో పడింది. బెంగాల్‌ రాష్ట్రంలో పాగా వేయటానికి బీజేపీ ఎన్ని అల్లర్లు సృష్టించినా అక్కడి ప్రజలు తిప్పికొడుతున్నారు. దీనికి తోడు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగ సమస్య, ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ ఇదే ఒంటెద్దు పోకడలు కొనసాగిస్తే, 2020 నాటికి ‘బీజేపీ ముక్త్‌ భారత్‌‘ ఖాయంగా కనిపిస్తోంది. 

కొనగాల మహేష్‌ 
వ్యాసకర్త జాతీయ సభ్యులు, ఏఐసీసీ మొబైల్‌ : 98667 76999

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top