వలస పాలనకు ప్రతిరూపమీ చట్టం

Arun Kumar Article On Citizenship Amendment Bill - Sakshi

విశ్లేషణ- అరుణ్‌ కుమార్‌

ఒక విదేశీ శక్తి.. పాలనకు సంబంధించి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? ‘‘జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అని ఏనాడో గాంధీజీ ‘హిందూ స్వరాజ్‌’లో రాసిన అంశాన్ని జాతి ఎన్నటికీ మర్చిపోకూడదు.

పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) ఇప్పుడు చట్టమైంది. న్యాయస్థానాలు ఈ చట్టాన్ని తోసిపుచ్చినా లేక దాని అమలుపై స్టే విధించినా జాతీయ రాజ్యమైన భారతదేశం స్వభావం గురించి ఇది కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇతర దేశాల భూభాగాల్లో అణచివేతను ఎదుర్కొంటున్న వారికి భారత్‌లో ఆశ్రయమిచ్చి, ఉపశమనం కలిగించి, పౌరసత్వాన్ని మంజూరు చేయడం అనే భావనను ఏ ఒక్కరూ వ్యతిరేకించరు. సమస్యల్లా ఏమిటంటే, భారత్‌ వంటి ఉదార ప్రజాస్వామిక దేశంలో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశాన్ని మతం  నిర్ణయించవచ్చా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశంపై మూడు భావధారలు వ్యాప్తి చెందుతున్నాయి. మొదటగా, సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినవారు.. ఇరుగుపొరుగు ఇస్లామిక్‌ దేశాల్లో మతపర మైనారిటీలను తొక్కిపెడుతున్నారని, వీరికి రక్షణ కల్పించాలనే ప్రాతిపదికను ఎంచుకున్నారు. ఇస్లామిక్‌ దేశాల్లో ముస్లింలను అణిచివేయరు కాబట్టి వీరిని పౌరసత్వ సవరణ బిల్లునుంచి మినహాయించవచ్చని వీరి వాదన.

శ్రీలంక హిందువులకు మినహాయింపు ఎందుకు?
పైగా, ఇతరదేశాల్లో ప్రత్యేకించి శ్రీలంకలోని హిందూ, ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ఈ బిల్లులో ఎందుకు మినహాయించారు అంటే 1964లో నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారనాయకే, నాటి భారత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కొన్ని లక్షల మంది శ్రీలంక తమిళులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించారు కాబట్టి, ఇప్పుడు వారికోసం మరొక నిబంధన చేర్చాల్సిన అవసరం లేదని వీరి వాదన. పైగా, నాటి భారత, పాక్‌ ప్రధానులు నెహ్రూ, లియాఖత్‌ మధ్య 1950లో కుదిరిన ఒప్పందానికి భారత్‌ కట్టుబడగా, పాకిస్తాన్‌ దాన్ని గౌరవించలేదని వీరు వాదిస్తున్నారు. భారత్‌లోని మైనారిటీలను ఇండియా పరిరక్షిస్తూ రాగా, పాకిస్తాన్‌ నుంచి భారీ సంఖ్యలో హిందువులు భారత్‌కి వలస వచ్చారని వీరి వాదన. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువుల జనాభా శాతం బాగా తగ్గిపోతూండగా, భారత్‌ లోని ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చిందన్న వాస్తవమే తమవాదనకు నిదర్శనం అని చెబుతున్నారు.

అంటే ముస్లింలు కోరుకుంటే ఇస్లామిక్‌ దేశాల్లో ఆశ్రయం తీసుకోవచ్చు కానీ ఇతర దేశాల్లో అణచివేతకు గురైన హిందువులు మాత్రం ఆశ్రయం కోరి భారత్‌కి మాత్రమే రాగలరు కాబట్టి వారి పట్ల జాతి సానుభూతితో ఉండాలని వీరు చెబుతున్నారు. ఇక రెండోవాదన ఈశాన్య భారత రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారి నుంచి వస్తోంది. భారతదేశంలోకి ఏ మతానికి సంబంధించినవారైనా సరే.. వలస రావడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. వలసలు వెల్లువెత్తితే తమ ప్రాంతం వనరులను ఊడ్చేస్తారని, తమ భాష, సంస్కృతి కూడా క్షీణించిపోతుందని వీరి భయం. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన బెంగాలీలు ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే జనాభా స్వరూపాన్ని ప్రభావితం చేశారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తే వలసలు మరింతగా పెరిగి స్థానిక ప్రజలు అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదముందని వీరి భావన. అందుకే వలస వచ్చే విదేశీయులను దేశంలోని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రజల భయాలు చాలావరకు సద్దుమణుగుతాయి. 

దేశంలో పేలవమైన పాలన, జాతీయ పౌర పట్టిక అమలు సమయంలో తలెత్తిన కల్లోల పరిస్థితుల వల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలపై విశ్వాసం చూపడం లేదు. ఇక్కడి స్థానిక ప్రజలు కానీ, హిందువులు, ముస్లింలు కానీ రానున్న సంవత్సరాల్లో తమకు న్యాయం జరుగుతుందని విశ్వసించడం లేదు. పైగా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆర్థిక దుస్థితి రీత్యా, ఇప్పటికే తక్కువగా ఉన్న ఉద్యోగాలను వలస ప్రజలు కొల్లగొడతారని, స్థానికుల ఆర్థిక అవకాశాలను తగ్గించివేస్తారని ప్రజలు భయపడుతున్నారు.

దేశ లౌకిక, సామాజిక నిర్మాణంపైనే దాడి
ఇక మూడో వాదన మతపరమైన వివక్ష ప్రాతిపదికన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వారినుంచి వస్తోంది. ఈ బిల్లు నుంచి ముస్లింలను మినహాయించాలని వీరు కోరుకోవడం లేదు. పైగా ఈ చట్టం దేశ లౌకిక సామాజిక నిర్మాణంపైనే దాడిగా వీరు భావిస్తున్నారు. పొరుగుదేశాలనుంచి అణచివేత కారణంగా భారత్‌కు వస్తున్నవారు మతపర కారణాలతోటే కాకుండా జాతి, భాషా పరమైన కారణాల వల్ల కూడా వలస వస్తున్నారని వీరి వాదన. దారిద్య్రం వంటి ఆర్థిక కారణాలే వలసలను ప్రభావితం చేస్తుం టాయి. పైగా బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి దృష్టి మరల్చడానికి పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పైగా ఈ చట్టం దేశంలో మతపరమైన విభజనను మరిం తగా పెంచి ముస్లిం కమ్యూనిటీని ఏకాకులను చేస్తుంది.

దేశంలో మతతత్వపరమైన వాతావరణం పెరుగుతున్న తరుణంలో మైనారిటీలు అణచివేతకు పాలబడి రెండో తరగతి పౌరులుగా వ్యవహరించబడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏ ముస్లిం పైన అయినా విదేశీయుడిగా ముద్రవేయడమే కాకుండా తాము విదేశీయులం కామని వారే నిరూపించుకోవలసి ఉంటుంది. జాతీయ పౌర పట్టీ ప్రక్రియ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో చాలామంది తగిన డాక్యుమెంటేషన్‌ కలిగిలేరు. ఇలాంటి వ్యక్తులను పొరుగుదేశాలు అంగీకరించవు కాబట్టి వీరిని శాశ్వతంగా నిర్బంధ శిబిరాల్లోనే ఉంచాల్సి వస్తుందేమో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇలాంటి వారి జనాభా కూడా అధికంగా ఉంటోంది. పైగా నిర్బంధ శిబిరాలను ఏర్పర్చి అసంఖ్యాక ప్రజలను వాటిలో పెట్టి నిర్వహించడం భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి కారణంగా ఇంత అదనపు భారాన్ని మోయడం సాధ్యమేనా? ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల మదుపు, ప్రత్యేకించి విదేశీ మదుపులు వెనక్కి పోతాయి. దీనివల్ల ఇప్పటికే మాంద్యంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే ప్రమాదముంది.

మరోవైపున ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని బీజేపీ వాదిస్తోంది. ఒక పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇస్తే అధికారంలోకి వచ్చాక దాని పూర్వాపరాలను పట్టించుకోకుండా దాన్ని అమలు చేయవలసిందేనా? పైగా కేంద్రం లోని మోదీ ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసింది. కానీ అవి అమలుకు నోచుకోలేదు. పైగా ఎన్నికల సమయంలో చేసిన వందలాది హామీలలో ఒక ప్రత్యేక హామీ కోసం ప్రజలు పార్టీలకు ఓటు వేయరు కూడా. పైగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పౌరసత్వ సవరణ చట్టం కారణం కాదు. అనేక ఇతర అంశాలు, ప్రత్యేకంగా ఆర్థిక దుస్థితిని నేర్పుగా పక్కన బెట్టేశారు. అందుకే పాలకపార్టీ హిందూ అనుకూల, ముస్లిం అనుకూల వైఖరిలలో ఏదో ఒకదానిని ప్రజలు స్వీకరించే ఎజెండాతో పనిచేస్తోందా?

ఏకజాతిగా మనుగడ సాగించలేం!
గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను భారత్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆనాడు హిందూ స్వరాజ్‌లో ‘‘ది హిందూస్‌ అండ్‌ మహమ్మదియన్స్‌’ పదవ అధ్యాయంలో గాంధీ ఇలా చెప్పారు. ‘భారత్‌ ఏక జాతిగా మనుగడ సాగించలేదు. ఎందుకంటే అనేక మతాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. విదేశీయులు ప్రవేశించడం అనే ఒక్క కారణం జాతిని ధ్వంసం చేయలేదు. వారు దేశంలో భాగం అవుతారు... జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’

అందుచేత, దేశాన్ని మతపరంగా విభజించి పాలించాలనే బ్రిటిష్‌ వలస పాలకుల అసంపూర్ణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు మనం మతపరంగా విభజించే ఎజెండాను అమలు చేసుకుంటూ పోతున్నామా? ఒక విదేశీ శక్తి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా?

అరుణ్‌ కుమార్‌
(ది వైర్‌ తోడ్పాటుతో)
వ్యాసకర్త మాల్కొమ్‌ ఎస్‌ ఆదిశేషయ్య చైర్‌ ప్రొఫెసర్,
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, రచయిత 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top