రూపాయి పతనం ‘ఏల్నాటి శని’

ABK Prasad Artical On Demonization Effect - Sakshi

రెండో మాట

పెద్ద నోట్ల రద్దు వంటి అనుమానాస్పద చర్యల ఫలితంగా భారత రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి రిజర్వ్‌ బ్యాంక్‌ రూపాయి పతనాన్ని నిలవరించడానికి రంగంలోకి దిగక తప్పని స్థితి దాపురించింది. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. దాని ఫలితాల్లో రూపాయి పతనం ఒక భాగం. అసలు రిజర్వు బ్యాంకునే ‘వాజమ్మ’గా మార్చేశారు. చివరికి ప్రజలెన్నుకున్న పార్లమెంటు, పార్లమెంటరీ కమిటీల ముందుకు రావడానికిగాని, చర్చలో పాల్గొనడానికిగాని బ్యాంకు అధిపతులు రాలేకపోయారు. నోట్ల రద్దు వ్యవహారం వారిని కుంగదీసింది.

‘‘ఆర్థిక మంత్రుల ఆదుర్దా అంతా ఎప్పటి కప్పుడు రాబడి పేరిట కొత్త మార్గాల అన్వేషణగా ఉండకూడదు. వారి ఆబ అంతా ఉత్పత్తినీ, ప్రజల క్షేమ సౌభాగ్యాలు పెంచే నూతన పద్ధతులను అనుసరించడంలో మాత్రమే ఉండాలి. ప్రజా సంక్షేమం భద్రంగా ఉండి, వారికి భరోసా ఏర్పడిననాడు ప్రభుత్వాలకు రాబడి కొరతే ఉండదు.’’ 
– 1871లో రాసిన ‘ఊడ్చుకుపోతున్న దేశ సంపద (డ్రెయిన్‌ థియరీ) అనే సుప్రసిద్ధ ఆర్థికపత్రంలో జాతీయవాది, ఆర్థికవేత్త దాదాభాయ్‌ నౌరోజీ ఉవాచ

‘‘అమెరికా తన డాలర్‌ని కాపాడుకునే క్రమంలో వర్థమాన దేశాల మార్కెట్‌ కరెన్సీలను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తోంది. ఈ పరిస్థితిలో మన రూపాయి విలువ దిగజారకుండా కాపాడడం భారత రిజర్వ్‌ బ్యాంక్‌ బాధ్యత.’’
 – 2018 జూన్‌ 28న పలువురు భారత ఆర్థికవేత్తలు

కాంగ్రెస్‌ ఏడు దశాబ్దాల పాలనలో ప్రారంభమై నేడు బీజేపీ పాలనలో(వాజ్‌పేయి–నరేంద్రమోదీ) కొనసాగుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో పరిపాలనా విలువలు, ప్రకటిత రిపబ్లిక్‌ రాజ్యాంగ విలువలు వేగంగా పతనమౌతున్నాయి. ఈ దశలో అదే దామా షాలో దేశీయ రూపాయి విలువ, మారకం విలువ పదే పదే పతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో వాజ్‌పేయి హయాంలోలాగే నేటి మోదీ పాలనలో కూడా బీజేపీ వాలిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోందని కితాబులిచ్చు కుంటోంది. మార్కెట్‌లో సామాన్య ప్రజలు కొను గోలు చేసే సరకుల ధరలు అడ్డగోలుగా పెరిగిపోతు న్నాయి. మధ్యతరగతి ఉద్యోగవర్గాలు, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వృత్తిదారులు విలువ కోల్పోతున్న రూపాయినే ‘పుల్ల వెలుగే పూట బత్తెం’గా భావించి జీవితాలు గడుపుతున్నారు. ఒక వైపున పతన మౌతున్న రూపాయి విలువతో పోల్చితే ఇతర దేశాల కరెన్సీ బరువు పెరుగుతోంది. ముఖ్యంగా వర్థమాన దేశాలను అమెరికా డాలర్‌ వ్యవస్థ పరాధార స్థితిలోకి నెట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో సర్వత్రా విలువలేని నోట్లు దేశంలో మార్కెట్‌ను ముమ్మరించే దశ వచ్చింది. మార్కెట్‌లోకి విలువలేని నోట్లు ముమ్మరించడ మంటే అర్థం– నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దెలు, ప్రయాణ ఖర్చులు, వైద్యం, ఆరోగ్య ఖర్చులు తడిసి మోపెడు కావడమే.

మళ్లీ వర్ధమాన దేశాలను పీడిస్తున్న అమెరికా! 
2007–2008లో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయక స్థానంలో ఉన్న అమెరికన్‌ డాలర్, ఇతర దేశాల దోపిడీపై ఆధారపడిన దాని విలువ తర్వాత తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అయితే, ఈ పరిస్థితిని వర్థమాన దేశాలపై రుద్దడానికి ప్రయత్నించింది. దాని ఫలితమే నేటి సర్వవ్యాపిత సంక్షోభం. అమె రికా కొత్తగా తన కరెన్సీ రక్షణ పేరిట వేసిన ఎత్తుగడ ‘వాణిజ్య యుద్ధాలు’. వాణిజ్య యుద్ధాలను మొదట అమెరికా ఎదురుదాడిగా ప్రారంభించింది. ఇప్పటికీ ఈ ట్రేడ్‌ వార్‌ను తట్టుకుని నిలబడగలిగిన స్తోమత ఉన్న దేశం  చైనా ఒక్కటే! ఇండియాకు అంత శక్తి లేదు. విలువ కోల్పోతున్న రూపాయి మారకంలో మనం విదేశాలకు చేయాల్సిన సరకుల ఎగుమతుల విలువ తరిగి–మనం దిగుమతి చేసుకునే వస్తువుల రేటు పెరిగిపోతోంది. అంటే ఇరు వైపులా ‘క్షవరం’ అయ్యేది భారతదేశమే అని మరచిపోరాదు. అమెరికాను రేపో మాపో చైనా అధిగమించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానానికి చేరు కుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఆ పరిణామాన్ని నిలువరించడం కోసమే అమెరికా అధ్యక్షుడు కజ్జా కోరు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వాణిజ్య యుద్ధాలు ప్రకటిం చారని మరచిపోరాదు.

అమెరికా సరకులపై చైనా సుంకాలు తగ్గించకపోతే, చైనా సరకులపై భారీగా సుంకాలు విధిస్తానన్న బెదిరింపులకు ట్రంప్‌ దిగారు. ఇంకా చైనా స్థాయికి ఎదగని ఇండియాను, మన పాలకులను అదే స్థాయిలో ఒత్తిడి చేస్తూ, అమెరికా సరకులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్‌ హెచ్చరిస్తు న్నారు. అక్కడికీ సరేనని, మోదీ ప్రభుత్వం మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 25 వస్తువుల పైన సుంకాలు తగ్గిస్తానని ప్రతిపాదించింది. కానీ, నిజానికి ఇప్పటి దాకా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ విషయంలో దేశ ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరించలేదు. మన దేశ పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు సుఖంగా ఉత్పత్తి చేసుకోగల దాదాపు రెండు వేలకు పై చిలుకు వస్తువులను అమె రికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్న ఓ సత్యాన్ని మరచిపోకూడదు. పైగా, అమెరికా ఒత్తిళ్లకు లొంగి ఆ సరకులపై సుంకాలను లోగడనే తగ్గించ డమో, రద్దుచేయడమో జరిగిందన్న సత్యాన్ని కూడా మర్చిపోరాదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం అమెరికా నుంచి చేసుకునే పాతిక దిగుమతులపై ‘రాయితీ’ ఇస్తానని ప్రకటించుకోవడం మన కరెన్సీ విలువను శాసిస్తున్న డాలర్‌కు లొంగిపోవడమే. 

సవాలు స్వీకరించిన చైనా ఎదురుదాడి!
అమెరికా మార్కెట్‌ను ఇన్నాళ్లుగా చైనా ఎగుమతులే శాసిస్తున్నాయి. ట్రంప్‌ వాణిజ్య యుద్ధం సవాలును చైనా స్వీకరించింది. తానూ కయ్యానికి సిద్ధమని ఎదురు సవాలు విసిరింది. అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచేసింది. అమెరికా మార్కెట్‌ను ముంచెత్తే చైనాను అమెరికా మార్కెట్‌ నుంచి సాగ నంపడం సాధ్యపడని విషయం కాబట్టే ట్రంప్‌ ఒక మేరకు దిగిరాక తప్పలేదు. ఇక ఇండియా విషయా నికి వస్తే–మనం పలు రకాల అమెరికా దిగుమతు లపై ఆధారపడి ఉన్నాం. మొత్తం ఆర్థికవ్యవస్థను బహుళజాతి కంపెనీ పెట్టుబడుల పట్టు నుంచి, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ దశ నుంచి తప్పిం చగలిగితేనే అమెరికా

ఒత్తిళ్లను తట్టుకోగలం. 
పాలకులు ప్రజలకు చూపే సగటు జాతీయో త్పత్తుల విలువకు, చూపెడుతున్న ఆర్థికాభివృద్ధి వాస్తవ లెక్కలకు చాలా తేడా ఉంటోందని రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ సి. రంగరాజన్‌ వెల్లడించారు. అలాగే వర్తమాన ఆర్థిక సంవత్సరాల్లో పాలకులు చూపే ఆర్థిక లోటు అంచనాలకు, వాస్తవంలో అంచ నాకు అందే లోటుకూ తేడా ఉందని తెలిపారు. ఎందుకంటే, జాతీయోత్పత్తుల విలువ 2017–18 తొలి మూడు మాసాలలో అంతకు ముందు ఏడా దిలో లోటు బడ్జెట్‌లో 0.6 శాతం నమోదు కాగా, ఆ లోటు చివరి మూడు మాసాల్లో 1.9 శాతానికి పెరిగి, 2019లో 2.5 శాతానికి పెరగనుంది. ఈ లెక్కన రూపాయి విలువను దిగజార్చి పెరిగిన డాలర్‌ 2019 ఆర్థిక సంవత్సరంలో ఇతర ప్రధాన పోటీ కరెన్సీ విలువలకు కనీసం 7.5 శాతం దాకా (ఫిబ్రవరికి) పెరిగిపోవచ్చని అంచనా. చివరికి రూపాయి విలు వలో అనిశ్చిత పరిస్థితి ఫలితంగా, 2018 ఏప్రిల్‌లో విదేశీ పెట్టుబడులు (పోర్ట్‌ఫోలియో)  రూ. 15,561 కోట్లు అర్థంతరంగా దేశం నుంచి ‘ఉడాయించాయి’ . ఒక్క మే నెలలోనే రూ. 29,714 కోట్లు బయటకుపో యాయి. రూపాయి విలువ కుదేలయ్యాక భారత్‌ బాండ్స్‌ మార్కెట్‌ నుంచి ఈ విదేశీ నిధులు ఆక స్మికంగా తరలిపోయాయి. అంటే ఇండియన్‌ బాండ్స్‌ విలువ ఆ మేరకు పతనమైపోయింది.

నోట్ల రద్దుతో రిజర్వ్‌ బ్యాంక్‌కు మరకలు
పెద్ద నోట్ల రద్దు వంటి అనుమానాస్పద చర్యల ఫలితంగా భారత రాజకీయ చరిత్రలో మొట్టమొదటి సారి రిజర్వ్‌ బ్యాంక్‌ రూపాయి పతనాన్ని నిల వరిం చడానికి రంగంలోకి దిగక తప్పని స్థితి దాపురిం చింది. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని విచ్చలవి డిగా దుర్వినియోగం చేశారు. దాని ఫలితాల్లో రూపాయి పతనం ఒక భాగం. పాలకులు హామీ పడిన జనధన్‌ అకౌంట్లు ప్రాణం పోసుకోవడం మానేశాయి, స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 24 లక్షల కోట్ల మేర భారత సంపన్నుల దొంగ డబ్బును వెతికితెచ్చి, పేద వర్గాలకు కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పంచుతామన్న పాలకుల ప్రగల్భాలూ ‘గుంటపూలు’ పూశాయి. పైగా స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనానికి 2017లోనే అదనంగా రూ.7 వేల కోట్లు వచ్చి చేరడం బీజేపీ పాలకులకు పెను సవాలుగా మారింది.

కేంద్ర ప్రభుత్వం పరువు మరింతగా బజారున పడిపోయింది. అసలు రిజర్వు బ్యాంకునే ‘వాజమ్మ’గా మార్చే శారు. చివరికి ప్రజలెన్నుకున్న పార్లమెంటు, పార్ల మెంటరీ కమిటీల ముందుకు రావడానికిగాని, చర్చలో పాల్గొనడానికిగాని బ్యాంకు అధిపతులు రాలేకపోయారు. నోట్ల రద్దు వ్యవహారం వారిని కుంగదీసింది. ‘‘మన దేశ జాతీయోత్పత్తుల విలు వను లెక్క కట్టడానికేగాక, ఆ విలువకు తగిన ఆర్థిక స్తోమతను కల్పించడంలో, విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడుల ఈక్విటీని పెద్ద ఎత్తున సమకూర్చడంలో విదేశీ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ కంపెనీలు సమకూర్చిన విదేశీ నిధులనే విదేశీ మారక ద్రవ్య నిల్వలని చెప్పుకోడానికి ఇండియా వెరవటం లేదు,’’ అని ‘థామస్‌ రాయిటర్స్‌’

సంస్థ (2018) నివేదిక వెల్లడించింది. 
ఎందుకీ దుస్థితి? కేంద్ర ప్రభుత్వ పోకడలు, రిజర్వ్‌ బ్యాంక్‌ విధానాలు మనల్ని ‘ఏల్నాటి శని’గా పీడిస్తున్నాయి. అందుకు దీటైన సమాధానం కోసం వెతకాలి. అర్థం లేని సాకులను పక్కనపెట్టి గాలి కబుర్లతో తిరుగుతున్న మనమూ, పాలకులూ భారత రాజ్యాంగ నిర్దేశాన్ని ఒక్కసారి మననం చేసుకోవాలి: ‘దేశ పౌరులకు తగినంత జీవన భృతిని పొందే హక్కు కల్పించేందుకు వీలుగా అనువైన సాంఘిక వ్యవస్థను నెలకొల్పి రక్షించాలి. తద్వారా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించాలి. అలాంటి వ్యవస్థ జాతీయ జీవనంలోని అన్ని వ్యవస్థలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగేలా వ్యవ హరించాలి’.

- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top