విశ్వవినాయకుడు | Sakshi
Sakshi News home page

విశ్వవినాయకుడు

Published Sun, Sep 4 2016 12:02 AM

విశ్వవినాయకుడు

విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఆరాధించే ఆచారం అనాదిగా వస్తోంది. లంబోదరుడిగా, హేరంబుడిగా, గజాననుడిగా, ఏకదంతుడిగా, గణాధిపతిగా, మూషికవాహనుడిగా, మోదకప్రియుడిగా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. ఏ పూజలోనైనా, ఏ వ్రతంలోనైనా, క్రతువులోనైనా, యజ్ఞయాగాదికాలలోనైనా తొలిపూజలు అందుకునేది వినాయకుడే! ముక్కోటి దేవతలలో వినాయకుడికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఇది. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం గణపతి గాథలను విపులంగా ప్రస్తావించాయి. ప్రాచీన గ్రంథాలను పరిశీలిస్తే, రుగ్వేదంలో గణపతి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాల నాటిదని చరిత్రకారుల అంచనా.  

మన దేశంలో గుప్తుల కాలం నాటికి... అంటే, క్రీస్తుశకం నాలుగు, ఐదో శతాబ్దాల నాటికి వినాయకుడి ఆరాధన ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటికి ప్రత్యేకంగా గాణపత్య మతమే ఏర్పడింది. షణ్మతాలలో ఒకటిగా పేరుపొందింది. మన దేశంలో శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణపత్య, కౌమార మతాలు ఉండేవి. గాణపత్య మతస్థులు గణపతిని ప్రత్యేకంగా ఆరాధించేవారు. అయితే ఇతర మతాలలోనూ వినాయకుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. బౌద్ధ, జైన మతస్థులు కూడా గణపతిని ఆరాధించేవారు. గణపతి ఆరాధాన మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, నేపాల్, భూటాన్, టిబెట్, చైనా, కంబోడియా, జపాన్, ఇండోనేసియా, సింగపూర్ వంటి దేశాలలోనూ ప్రాచీనకాలం నుంచే గణపతి ఆరాధన ఉండేది. పలు దేశాల్లో గణపతి ఆరాధన ఇప్పటికీ కొనసాగుతోంది.
 
విదేశాలలో వినాయకుడు
మన దేశానికి చెందిన వర్తకులు ప్రాచీన కాలంలోనే వివిధ దేశాలతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారి ద్వారా అప్పట్లోనే వినాయకుడు విదేశాలకూ వ్యాపించాడు. క్రీస్తుశకం పదో శతాబ్ది కాలంలో మన వర్తకులు దక్షిణాసియా ప్రాంతంలోని పలు దేశాలతో వర్తక వాణిజ్యాలు సాగించేవారు. జావా, బాలి, బోర్నియో, బర్మా, కంబోడియా, జపాన్, థాయ్‌లాండ్, టిబెట్, చైనా, సింగపూర్ వంటి తూర్పు, ఆగ్నేయాసియా దేశాలలో పురాతన కాలం నాటి గణపతి విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఇండోనేసియా కరెన్సీ నోటుపై కూడా గణపతి బొమ్మ కనిపిస్తుంది. మన దేశంపై ముస్లిం దండయాత్రలకు మునుపు అఫ్ఘానిస్థాన్ ప్రాంతంలో సైతం గణపతి ఆరాధన ఉండేది.
 
 బౌద్ధ, జైనాలలో వినాయకుడు
గణపతి ఆరాధన హిందూమతానికి మాత్రమే పరిమితం కాలేదు. జైన, బౌద్ధమతాలు కూడా తమదైన రీతిలో గణపతిని ఆరాధించుకుంటాయి. జైనమతం కుబేరుడికి చెందిన కొన్ని కీలకమైన విధులను గణపతికి కేటాయించింది. ‘అభిదానచింతామణి’ అనే జైనగ్రంథంలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ గ్రంథం వినాయకుడిని హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా ప్రస్తుతించింది. గుప్తుల కాలంలో బౌద్ధులు కూడా వినాయకుడిని ఆరాధించడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

తాంత్రిక బౌద్ధంలో మహారక్త గణపతిని పూజించేవారు. షడ్భుజాలు గల మహాకాలుడి రూపంలో బౌద్ధ తాంత్రికులు మహారక్త గణపతిని ఆరాధించేవారు. చైనా, జపాన్ ప్రాంతాల్లో బౌద్ధులు క్రీస్తుశకం ఏడు, ఎనిమిది శతాబ్దాల కాలంలోనే వినాయకుడిని ఆరాధించేవారు. ఇక ‘గణపతి పురాణం’ ప్రకారం బుద్ధుడిని గణపతి అవతారంగానే భావిస్తారు. గణేశ సహస్రనామాల ప్రకారం బుద్ధుడు సాక్షాత్తు గణపతి అవతారమేనని పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు అభిప్రాయపడ్డారు. థాయ్‌లాండ్, కంబోడియా వంటి దేశాలలో వినాయకుడిని విజయానికి, అదృష్టానికి కారకుడిగా ఆరాధిస్తారు. వినాయకుడు బుద్ధిబలాన్ని అనుగ్రహించడమే కాకుండా, అదృష్టాన్ని కలిగిస్తాడని పలు దేశాలలో నమ్ముతారు.
 
వినాయకుడు..వాహనాలు
అత్యంత పురాతన కాలంలో వినాయకుడి విగ్రహాలు ఎలాంటి వాహనం లేకుండానే కనిపించేవి. వినాయకుడు మూషిక వాహనుడిగా ప్రసిద్ధి పొందినా, పలు ప్రాచీన విగ్రహాలలో వినాయకుడు వేర్వేరు వాహనాలపై కనిపిస్తాడు. వినాయకుడికి ఎనిమిది అవతారాలు ఉన్నట్లు  ‘ముద్గల పురాణం’ వివరిస్తుంది. వాటిలోని ఐదు అవతారాలలో వినాయకుడు మూషికాన్నే వాహనంగా చేసుకున్నట్లు ఉంది. అయితే, మహోత్కటావతారంలో సింహాన్ని, మయూరేశ్వరావతారంలో నెమలిని, ధూమకేతు అవతారంలో అశ్వాన్ని వాహనంగా ఉపయోగించినట్లు ‘ముద్గల పురాణం’ చెబుతోంది. గణపతిని విఘ్నేశ్వరుడిగా పురాణాలు ప్రస్తుతించాయి. వినాయకుడు ఐహిక, ఆముష్మిక విఘ్నాలన్నింటినీ దూరం చేస్తాడని ప్రతీతి. విద్యలకు కూడా అధిపతి అయిన వినాయకుడు బుద్ధిని అనుగ్రహిస్తాడని ప్రతీతి.

Advertisement
 
Advertisement
 
Advertisement