అర్థరాత్రి 12 గంటలకు రహస్యంగా..

Telugu Crime Story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

ఆకాశానికీ భూమికీ మధ్య వేలాడే అద్భుత కట్టడంలా నగర వాతావరణానికి దూరంగా వున్న సెవెన్‌ విల్లా ప్రపంచంలోని ఏడు వింతలనూ తలదన్నేలా కనిపిస్తోంది. మొన్నమొన్నటి వరకు కళాకాంతులతో ఒకనాటి వైభవానికి గుర్తుగా నిలిచిన సెవెన్‌ విల్లా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది. వందల ఎకరాల్లో విస్తరించి వున్న ఆ ప్రాంతం నడిబొడ్డున వున్న సెవెన్‌ విల్లా ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యంతో కళ్లు పెద్దవవుతాయి. కొన్ని దశాబ్దాలకు పూర్వమే నిర్మించిన ఆ విల్లాలో రాజా స్వరణేంద్ర భూపతి రాచరికానికి నిలువెత్తు సంతకం. అలాంటి రాజవంశానికి సంబంధించిన రాజా స్వరణేంద్ర భూపతి అనుమానాస్పద రీతిలో మరణించాడు. రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదనకు సరైన అన్వేషణలో వున్నారు పోలీసులు. కాదు అతని మీద విషప్రయోగం జరిగిందని రాజా స్వరణేంద్ర భూపతి బంధువులు ఆరోపిస్తున్నారు. రాజా స్వరణేంద్ర భూపతికి పెళ్లికాకపోవడం, వారసులు ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ విల్లా హక్కుదారులు లేక వెలవెల పోతోంది. అందులోని విలువైన వస్తువులు కోట్లాది డబ్బు అదృశ్యమవుతోంది. ఆ విల్లాలో పనిచేసిన వారు శవాలవుతున్నారు. ఇప్పుడా విల్లాలోకి ఒక అపరిచితుడు ప్రవేశించాడు.

తలెత్తి చూసినా కనిపించనంత ఎత్తులో వున్న సెవెన్‌ విల్లా వైపు చూసి వీపుకు వేలాడుతోన్న ఎయిర్‌ బాగ్‌ను తీశాడు. జిప్‌ ఓపెన్‌ చేశాడు. అందులో నుంచి ఓ ప్రాణి కదులుతూ బయటకు వచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచేలా. అది ఉడుము...దాన్ని చాలా క్యాజువల్‌గా చేతుల్లోకి తీసుకున్నాడు. దానికి ఒక వైరులాంటి తాడు చుట్టబడి వుంది. రెండు చేతులతో గిరగిరా తిప్పుతూ బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని పైకి విసిరాడు. ఆ ఉడుం తన ఉడుం పట్టును చూపించింది. ఆ తాడును గట్టిగా లాగి చూశాడు. ఆ తాడు సాయంతో పైకి ఎక్కుతున్నాడు. సరిగా మూడురోజుల ముందే ఆ విల్లా వాచ్‌మన్‌ హత్యకు గురయ్యాడు. ఆ విల్లాలో వున్న సొత్తును దోచుకోవడానికి వచ్చిన దోపిడీదొంగల పనే అని పోలీసుల అనుమానం. ఆ విల్లాను పోలీస్‌లు సీజ్‌ చేశారు. పరిసర ప్రాంతంలో గస్తీ పెంచారు. స్వరణేంద్ర భూపతికి వున్న పేరు ప్రతిష్టల రీత్యా ఈ కేసును సవాలుగా తీసుకుంది ప్రభుత్వం.

అపరిచితుడు విల్లాపై భాగానికి చేరుకున్నాడు. తాను ఎంతటి సాహసానికి ఒడికడుతున్నాడో తెలుసు. విల్లా పై అంతస్తు నుంచి లోపలి ప్రవేశించాడు. ఆ విల్లాకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ అతని దగ్గర వుంది. అతని జేబులో శక్తివంతమైన టార్చిలైట్‌ వుంది. స్వరణేంద్ర భూపతి మరణించాక ముందు జాగ్రత్తగా ఆ విల్లా ఎలక్ట్రిసిటీని కట్‌ చేసింది పోలీస్‌ శాఖ. ఆ అపరిచితుడు.. అక్కడి నుంచి రాజా స్వరణేంద్ర భూపతి పడగ్గదికి వెళ్ళాడు.. ఆ పడగ్గది లక్షల విలువ చేసే ఫర్నిచర్‌తో నిండి వుంది. ఎక్కడ చూసినా ఖరీదైన సామగ్రి... విశాలమైన మంచం. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మంచం అది.

ఆ పడగ్గదిలో క్రైమ్‌ సీన్‌.. ఈజీ చైర్‌లో కూర్చొని రివాల్వర్‌తో కాల్చుకున్నట్టు విల్లా కేర్‌ టేకర్‌ చెప్పాడు. రాజా స్వరణేంద్ర భూపతి పడగ్గది నుంచి రివాల్వర్‌ పేలిన శబ్దం విన్నట్టు చెప్పాడు. ఆ గదిని నిశితంగా పరిశీలిస్తూ మిర్రర్‌ వైపు చూశాడు. ఒకేసారి ఏడు ప్రతిబింబాలు కనిపించే ఆ మిర్రర్‌ లో ఎనిమిదవ ప్రతిబింబం కనిపించినట్టు అనిపించి ఉలిక్కిపడి చూశాడు. అక్కడ ఎవరో తచ్చాడుతున్నట్టు అనిపించింది. అక్కడి నుంచి ఆ విల్లాలో వున్న గదులను వరుసగా చూస్తూ వెళ్ళాడు. సరిగ్గా ముప్పై నిమిషాల తర్వాత ఆ అపరిచితుడు ఆ విల్లాలో నుంచి బయటకు వచ్చాడు. ఉడుమును ఆ పరిసరాల్లోన వదిలేశాడు. విల్లాను దాటి వెళ్తుండగా అతని తలమీద బలమైన దెబ్బ పడింది. అలానే నేలమీద కూలబడిపోయాడు.

ముఖ్యమైన పోలీసు అధికారులు ఆ హాలులో సమావేశమయ్యారు. ఆ హాలులో వారికి ఎదురుగా సెవెన్‌ విల్లా కేర్‌ టేకర్‌ వున్నాడు. అతను భయంతో వణికిపోతున్నాడు.
‘‘విల్లాకు కాపలాగా వాచ్‌మన్‌ చనిపోయిన కేసులో దోపిడీదొంగల్లో ఒకడి ఆచూకీ దొరికింది. పలు దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడు. అతని పేరు వడియప్ప’’... పోలీసులు ఈ విషయాన్నీ మీడియాకు చెప్పి మిగితా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. పత్రికలో వార్త వచ్చిన ఎనిమిది గంటల్లోనే దోపిడీదొంగ వడియప్ప బార్‌లో హత్యకు గురయ్యాడు. పోలీసులు ఈ మిస్టరీని చేధించారు... వడియప్పతో బంగారు నగల వ్యాపారి కుమ్ముౖక్కై దోపిడీకి ప్లాన్‌ చేయించినట్టు ఆధారాలు సేకరించారు. ఆ బంగారు నగల వ్యాపారిని అరెస్ట్‌ చేయడానికి రంగం సిద్ధమైంది. అప్పుడే ఒక షాకింగ్‌ న్యూస్‌ తెలిసింది.

గుడికి వెళ్లి ప్రసాదం తిని ఇంటికి వస్తున్న బంగారు నగల వ్యాపారి కారులోనే మరణించాడు. అతను తిన్న ప్రసాదంలో విషం కలిపి వుంది. వెంటనే పూజారిని విచారించడానికి సిద్ధమైంది పోలీస్‌ శాఖ. గుడికి వెళ్లేసరికి గుడి వెనుక పూజారి హత్య చేయబడి వున్నాడు. పూజారి దగ్గర రాజా స్వరణేంద్ర భూపతి చేతి బంగారు కడియం దొరికింది. అయితే అతను నకిలీ పూజారి అని ఆ రోజు అసలు పూజారిని దారిలో కొందరు దుండగులు అడ్డగించి కొట్టి పడేసి వెళ్లారని తెలిసింది. భక్తులు కొత్త పూజారి అని భ్రమపడ్డారు. సెవెన్‌ విల్లాలో అనుమానితులు ఒక్కరొక్కరు మరణిస్తున్నారు. హత్యల మిస్టరీ అలానే ఉండిపోయింది.

ఆ హాలులో వున్న పోలీసులు కేర్‌ టేకర్‌ సిద్దప్ప వైపు చూసి కుచోమన్నారు.
‘‘మీరు భయపడవలిసిన అవసరం లేదు. ఈ హత్యల మిస్టరీ తేలిపోయింది’’ చెప్పారు.
‘‘ఎవరు...? ముందు అతణ్ణి అరెస్ట్‌ చేయండి.. నమ్మకంగా మా యాజమాని దగ్గర నలభై సంవత్సరాలుగా పని చేస్తున్నాను... నా  మీద ఎన్నో బాధ్యతలు పెట్టారు. ఎన్నో ట్రస్టులు వున్నాయి... రాజా స్వరణేంద్ర భూపతిగారి మరణంతో నేను ఒంటరివాడిని అయ్యాను...  ఖరీదైన వస్తువులు చోరీ అవుతున్నాయి. వరుస హత్యలు జరుగుతున్నాయి’’ భయంగా చెప్పాడు.
‘‘మీకు కాళిదాసు గురించి తెలుసా..?’’ అడిగాడు ఓ పోలీస్‌ అధికారి సూటిగా సిద్దప్ప వైపు చూస్తూ.. ‘‘తెలియదు...’’ అయోమయంగా చెప్పాడు.

‘‘మేము సేకరించిన వివరాల ప్రకారం... రాజా స్వరణేంద్ర భూపతి మిమ్మల్ని కూడా నమ్మకుండా గత కొన్నేళ్లుగా కాళిదాసును తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నాడు. కేవలం ఫోన్స్‌ ద్వారానే సంప్రదింపులు చేసుకున్నారు. రెండురోజుల క్రితం కాళిదాసు విల్లాలో అడుగుపెట్టినట్టు సాక్ష్యాలు వున్నాయి. బహుశా రాజా స్వరణేంద్ర భూపతికి వున్న వేలకోట్ల ఆస్తిని కాజేయడానికి అతను కుట్రపన్ని ఉంటాడు.. నమ్మకద్రోహానికి ఒడికట్టి ఉంటాడు... ఇదే అతని ఫొటో అంటూ ఓ ఫొటోను అతని ముందు ఉంచారు. ఆ ఫొటోను చూడగానే సిద్దప్ప కళ్లు పెద్దవయ్యాయి.

బలవంతంగా కళ్లు తెరిచాడు అతను. అంతా చీకటి... తన కళ్లకు ఎవరో గంతలు కట్టారని అర్థమైంది అతనికి. అంతేకాదు అతనికి మరో విషయం కూడా అర్థమైంది.. తన చేతులు వెనక్కి విరిచి కట్టేశారని. అతను గింజుకోలేదు.. ఆలోచిస్తున్నాడు.. తానెక్కడున్నాడో గెస్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను తన ఎడమచేతిని మణికట్టు వరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే తనను బంధించి ఎంత కాలమైందో తెలియడం లేదు... కానీ ఒక్క విషయం స్పష్టమైంది.. కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే... ఎందుకంటే రోజుల తరబడి తనను మత్తులో ఉంచడం సాధ్యం కాదు కనుక. అతని చేయి మణికట్టును తాకింది అతి కష్టంమీద. రిస్ట్‌ వాచ్‌ తగిలింది. రిస్ట్‌ వాచ్‌ కీ రాడ్‌... బొడిపెను గట్టిగా ప్రెస్‌ చేసాడు.

 వాచ్‌ ముందు భాగం నుంచి చిన్న రెండు అంగుళాల కత్తి బయటకు వచ్చింది. ఆతని మొహానికి చెమటలు పడుతున్నాయి... క్షణాలు గడుస్తున్నాయి... అతని చేతి కట్లు విడిపడ్డాయి... మణికట్టు ఎర్రగా కందిపోయింది. తల మీద రక్తపు చారికలు. సెవెన్‌ విల్లా బయట తనను తల వెనగ్గా కొట్టడం గుర్తొచ్చింది. ఎక్కడో పాము బుస.... మెల్లిమెల్లిగా అతనికి ఆ పాము తను వున్న ప్రాంతంలోనే ఉందన్న విషయం తన కళ్ళకు గంతలు విప్పాక అర్థమైంది. అంతా చీకటి... అతని కళ్ళు ఆ చీకటికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది.
మెల్లగా చేతులు మెడ రుద్దుకుంటూ లేచాడు. అలానే గోడను తడుముకుంటూ లైట్‌ వేయడానికి స్విచ్‌ బోర్డు దగ్గరికి వెళ్ళాడు. స్విచ్‌ వేశాడు.. లైట్‌ వెలుగలేదు... పాము పాకుతూ వస్తున్నట్టు అతని పాము చెవులకు అనిపించింది. ఇలాంటి వాటిలో అతను తర్ఫీదు పొందినవాడు కాబట్టి...

‘‘ఆ లైట్‌ వెలుగదు మిస్టర్‌ కాళిదాస్‌’’ అన్న మాటలు వినిపించాయి.
‘‘ఈ లైట్‌ వెలుగకపోయినా నా బ్రెయిన్‌ లైట్‌ వెలిగింది మిస్టర్‌ సిద్దప్పా...’’ అన్నాడు ఆ అపరిచితుడు.
అవతలి వైపు నుంచి క్షణకాలం నిశ్శబ్దం ‘‘నేను సిద్దప్పనా? ఎలా కనిపెట్టావ్‌?’’
‘‘ఎలా కనిపెట్టావ్‌? అని అన్నావ్‌ కానీ ‘నేను కాదు’ అనలేదు... అదీ కాకుండా నీ గొంతు నా మైండ్‌ లో రిజిస్టర్‌ అయిపోయింది’’ అతను చెప్పాడు.
‘‘ఎలా? ఎప్పుడు? అయినా నువ్వు ఎప్పుడు రాజా స్వరణేంద్ర భూపతి దగ్గర చేరావ్‌? నన్నెలా కనిపెట్టావ్‌?’’
‘‘నువ్వు నన్నెలా కనిపట్టావో... అలా’’ నవ్వుతూ అన్నాడు.
‘‘అంటే...’’ అర్థం కానట్టు అడుగుతూ... సెల్‌లో వున్న ఫ్లాష్‌ ఆన్‌ చేశాడు. ఆ విశాలమైన గదిలో వెలుతురు వచ్చేసింది.
‘‘సిట్‌–స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఆఫీసర్‌ని ఆ మాత్రం తెలుసుకోలేనా? ఎప్పుడైతే రాజా స్వరణేంద్ర భూపతి ఆత్మహత్య వార్త బయటకు వచ్చిందో... నా ఇన్వెస్టిగేషన్‌ అడ్వెంచర్‌ మొదలైంది. దోపిడీ దొంగలు పథకం ప్రకారం దొంగతనం చేయడంలో నీ హ్యాండ్‌ ఉందని అర్థమైంది. కేసును పక్కదారి పట్టించడానికే నువ్వు దొంగతనం ప్లాన్‌ చేశావని.

దోపిడీ దొంగ వడియప్పతో నువ్వు చేయించిన దొంగతనం బయటపడుతుందని అతడిని చంపేశావు.. ఆ విషయం తెలిసిన వాచ్‌మన్‌ని హత్య చేశావు... మా అనుమానం బంగారునగల వ్యాపారి మీదికి వెళ్లిందని తెలియగానే పూజారితో ప్రసాదంలో విషం పెట్టి చంపించావ్‌.. ఆ పూజారి మీద మాకు అనుమానం కలిగిందని తెలియగానే అతడిని చంపి, బంగారుకడియాన్ని అక్కడ వదిలి మా అనుమానాన్ని పూజారి మీదికి మళ్లేలా చేశావు.. కానీ నువ్వు చేసిన పొరపాటు... బం...గా...రు...క...డి...యం ...రాజా స్వరణేంద్ర భూపతి చనిపోయిన సమయంలో ఆ బంగారుకడియం నీ చేతికి ఉండడం టీవీలో స్పష్టంగా వుంది. 

అన్నింటి కన్నా రాజా స్వరణేంద్ర భూపతి ఆత్మహత్య కథ... పాయింట్‌బ్లాంక్‌లో ఆయుధం పేలగానే ఆపోజిట్‌ డైరెక్షన్‌లో గానీ, పక్కకుగానీ పడిపోవాలి. ఎడమ కణతపై పిస్టల్‌తో కాల్చుకుంటే.. బుల్లెట్‌ కుడి కణత నుంచి బయటకు వెళ్లి గోడకు తగలాలి. అప్పుడు ఆపోజిట్‌ సైడ్‌ నుంచి రక్తం రావాలి. రాజా స్వరణేంద్రభూపతిది ఎడమ చేతి వాటం... అతని మీద విషప్రయోగం కొన్నినెలలుగా జరుగుతూనే వుంది. నన్ను నువ్వు బంధించిన రోజు ఈ విషయాలు గమనించాను..అంతే కాదు అద్దంలో ఓ పక్కన వున్న నిన్ను నా బటన్‌ కెమెరా బంధించింది.
అందుకే కాళిదాసు డ్రామా ఆడాను... నువ్వు నన్ను ఇక్కడే బంధిస్తావని తెలుసు.. ఇది సెవెన్‌  విల్లా అని తెలుసు’’...‘అన్నాడు అతను
‘‘ఎలా తెలుసుకున్నావు?’’
‘‘పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇక్కడ పవర్‌ తీయించింది కదా.. దానితో పాటు సీక్రెట్‌ కెమెరాలు నేను పెట్టాను... రాజా స్వరణేంద్ర భూపతి అతి ప్రమాదకరమైన డివోచి అనే దక్షిణాఫ్రికా విషసర్పాన్ని పెంచుకుంటున్నాడు... తొమ్మిది అడుగుల విషసర్పం... దానికి రోజూ ఆహారాన్ని స్వయంగా అందించేవాడు... ఆ విషయం ఎవరికీ తెలియదు.. నీతో సహా... ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అతని డైరీలో చదివాను. నువ్వు రాజా స్వరణేంద్ర భూపతిని బంధించి విషప్రయోగంతో చంపేసి.. ఎవరినీ విల్లాలోకి అడుగుపెట్టకుండా చేశావు...
అనుమానం వున్న ప్రతీవాళ్లను ఆనవాలు లేకుండా చేశావు... నిన్ను నమ్మినందుకు విషసర్పమే సిగ్గుపడేలా కాటువేసి నీ స్వార్థమనే విషంతో రాజా స్వరణేంద్ర భూపతిని చంపేశావు’’... అన్నాడు సిట్‌ ఆఫీసర్‌ కార్తికేయ..

‘‘ఇన్ని తెలిసిన నిన్ను వదిలేస్తే నాకు ప్రమాదం కదా’’ అన్నాడు రివాల్వర్‌ తీసి కార్తికేయ వైపు గురిపెట్టి.
అప్పుడే సెల్‌ ఫ్లాష్‌ లో కార్తికేయ కాళ్ళ దగ్గర తొమ్మిది అడుగుల ప్రమాదకరమైన విషం వున్న డివోచి విషసర్పం ప్రత్యక్షమైంది.
కార్తికేయ భయపడలేదు.. దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.. చిత్రంగా అది కార్తికేయను చుట్టేసింది. ఏమీ చేయకుండానే...
‘‘డియర్‌ డివోచి... నీ యజమానిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటావా? నన్ను మింగేస్తావా..’’ ఛాయిస్‌ నీదే అన్నాడు నవ్వుతూ. కార్తికేయ ఆ విషసర్పం వైపు చూస్తూ.
సిద్దప్ప పగలబడి నవ్వాడు
‘‘అది విషసర్పం.. దానికి కాటేయడం.. మింగేయడమే తెలుసు.. నా రివాల్వర్‌లో తూటా కూడా వేస్ట్‌ అది నిన్ను చంపే ..’’ ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే కార్తికేయను చుట్టేసిన డివోచి విషసర్పం గాలిలోకి లేచింది.. దాని పడగ క్షణములో వెయ్యో వంతులో సిద్దప్ప తలను తాకింది... పాము తలలోకి సిద్దప్ప శరీరం వె...ళ్తోం...ది...
తన యజమానిని చంపిన దృశ్యం కనిపించినంత కసిగా.... పైశాచిక స్వార్థంతో ప్రాణంలా నమ్మిన నమ్మినబంటు విశ్వసఘాతుకానికి విషపు కోరలున్న విషసర్పం ప్రతీకారం తీర్చుకుంది. తన యజమానికి విశ్వాసాన్ని చూపించింది. తనకు ప్రతీరోజు ఆహారాన్ని అందించి తనను పెంచుకున్నందుకు కృతజ్ఞతా చూపించింది. 
కొన్నివేల కోట్లు.. ఏమీ తీసుకువెళ్లని రాజా స్వరణేంద్ర భూపతి.
కొన్నివేల కోట్లు.. స్వార్థంతో ప్రాణాలు కోల్పోయిన సిద్దప్ప... కార్తికేయ బయటకు వచ్చేసరికి... తెల్లవారుతోంది.. ఒక  చీకటిలోని  నిజం వెలుగులోకి వచ్చినట్టు.... డివోచి సర్పాన్ని తన రెండు చేతుల్తో అతి కష్టంమీద తీసుకుని సెవెన్‌ విల్లా బయటకు వచ్చి అడవిలో వదిలేశాడు...
‘‘మా మనుషుల్లో వున్న విషం కన్నా నీ విషం ప్రమాదకరమైంది కాదు.. వెళ్ళు ఫ్రెండ్‌.... నీ సాహసం నేను గుర్తుంచుకుంటాను.. ఈ రహస్యం నాలోనే ఉండిపోతుంది’’ అంటూ ముందుకు నడిచాడు కార్తికేయ. ఈ రహస్యం నాలోనే ఉండిపోతుంది’’ అంటూ ముందుకు నడిచాడు కార్తికేయ. 
- విజయార్కె

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top