సమీక్షణం: ఆధునిక జీవితం మీద అపూర్వ ముద్ర | review on books | Sakshi
Sakshi News home page

సమీక్షణం: ఆధునిక జీవితం మీద అపూర్వ ముద్ర

Feb 23 2014 4:23 AM | Updated on Sep 2 2017 3:59 AM

సమీక్షణం: ఆధునిక జీవితం మీద అపూర్వ ముద్ర

సమీక్షణం: ఆధునిక జీవితం మీద అపూర్వ ముద్ర

ఆదర్శాల ముసుగులోనో, అంధ విశ్వాసాల్లోనో, నవనాగరికతా వ్యామోహంతోనో అతలాకుతలమవుతున్న నేటి వ్యవస్థలో దర్శనమిస్తున్న సజీవ పాత్రలకు తన జీవితానుభవాలను జోడించి కొంత కాల్పనిక మేకప్‌తో కథలు రాశారు ఎ.జి.కృష్ణమూర్తి.

 ప్రచురణ: ఎమెస్కో బుక్స్, దోమలగూడ, హైదరాబాద్-29. ఫోన్: 040 23264028
 వెల: 90
 పుస్తకం    :    ఎజికె కథలు
 రచన    :    ఎ జి కృష్ణమూర్తి
 
 విషయం    :    ఆదర్శాల ముసుగులోనో, అంధ విశ్వాసాల్లోనో, నవనాగరికతా వ్యామోహంతోనో అతలాకుతలమవుతున్న నేటి వ్యవస్థలో దర్శనమిస్తున్న సజీవ పాత్రలకు తన జీవితానుభవాలను జోడించి కొంత కాల్పనిక మేకప్‌తో కథలు రాశారు ఎ.జి.కృష్ణమూర్తి. సమకాలీన ఆధునిక జీవిత కోణాల్ని తనదైన శైలిలో అవగాహనించుకుని పాత్రలకు ప్రాణం పోశారు. ఆంగ్లంలో ఏడు, తెలుగులో ఇప్పటికి పదమూడు పుస్తకాలను ప్రచురించి రచనారంగంలో కూడా తనదైన ‘ముద్ర’ వేసిన ప్రతిభాశాలి కృష్ణమూర్తి. వీరు ప్రచురించిన ‘ఎ.జి.కె. కథలు’ సంపుటిలో మొత్తం పదకొండు కథలున్నాయి. వీటిల్లో చదివించే శక్తి ఉంది. పాఠకుణ్ని వెంటాడి ఆలోచింపజేసే నైపుణ్యం గల కథావస్తువు కనిపిస్తుంది. కథలు కాలక్షేపం కోసం కాదు, ఆలోచనా చైతన్యాన్ని పెంచేందుకనే దృక్పథం గలవారు రచయిత. కథల్లో వస్తు వైవిధ్యం ఉంది. ఎత్తి పొడుపులు, చమత్కారాలు కలగలిపిన సునిశితమైన సూచనలు సమాజానికి అందించడంలో కథకుడు సఫలీకృతుడయ్యాడనే చెప్పొచ్చును.
 
 ‘అమ్మ కథ’లో రెండు తరాల మూఢ విశ్వాసాల్ని కళ్లకు కట్టించాడు రచయిత. సుగంధ్, అనఘ భార్యాభర్తలు. సుగంధ్ తల్లి అనసూయ. అనఘ తండ్రి కృష్ణకాంత్, తల్లి సరస్వతి. సుగంధ్, అనఘలకు 40 సంవత్సరాల వయసు వచ్చినా పిల్లలు కలగలేదు. అనఘ తల్లిదండ్రులు ఆందోళన చెంది కారణం అడుగుతారు. అనఘ తన అత్తయ్య ‘అనసూయ’ మూఢ విశ్వాసాలను నమ్మి, ఆత్మహత్య చేసుకున్న విషయం తల్లిదండ్రులకు చెప్తుంది. ఎవరో సాధువు అనసూయ హస్తరేఖలు చూసి త్వరలో మీ కుటుంబంలో ఒక చావు ఉంటుందని చెప్పాడు. అది కుమారుడైన సుగంధ్ కాకూడదని అనసూయ ఉరిపోసుకొని చనిపోతుంది.
 
 తల్లిది షరతులు లేని ప్రేమనీ, అవధులు లేని ఆప్యాయతనీ, ఏ త్యాగానికైనా సిద్ధం చేస్తుందనీ నమ్మిన సుగంధ్, తన భార్య ‘అనఘ’ తల్లి కావడానికి ఇష్టపడడు. అందుకే కుటుంబ నియంత్రణ పాటిస్తూ పిల్లలు లేకుండా ఉంటారు. ఒక తరంలో ‘అనసూయ’ జాతకాల మూఢ విశ్వాసంతో ప్రాణత్యాగం చేస్తే, కుమారుడు ‘సుగంధ్’ తల్లి అయితే భార్య కూడా ఏదైనా ప్రాణత్యాగానికి సిద్ధపడుతుందని ఆమె తల్లి కావడానికి ఇష్టపడడు. మూఢ విశ్వాసాలు ఏ విధంగా జీవితపు విలువల్ని కాలరాస్తాయో ‘అమ్మ కథ’ తెలుపుతుంది. కథలన్నీ ఆలోచనలను రేకెత్తించేవే!
 - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
 
 పరుచుకుంటున్న ‘తోవలు’
 పుస్తకం    :    తెలంగాణ తోవలు
 సంపాదకుడు    :    కాసుల ప్రతాపరెడ్డి
 
 విషయం    :    అస్తిత్వం, ఉనికి వంటి అంశాలకు పదును పెట్టే పని కొత్త దృష్టితో మొదలవుతుంది. ఒక ప్రాంత సాహిత్య, సాంస్కృతిక అంశాల మీద అప్పటిదాకా ఉన్న ‘అజమాయిషీ’ని గుర్తించేటట్టు చేసేది ఈ దృష్టే. ఆపై ప్రయాణం సంఘర్షణాత్మకమే. అప్పుడు ఈ దృష్టి మరింత విశాలం కావాలి. ఇందుకు జరిగిన ఒక పెద్ద ప్రయత్నమే ‘తెలంగాణ తోవలు’ వ్యాస సంక లనం. కాసుల ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ సంకలనంలో తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య ధోరణులకు సంబంధించి పద్దెనిమిది వ్యాసాలు ఉన్నాయి.
 
 ఈ సంకలనం ఎంత ఆదరణకు నోచుకున్నదో రెండో ముద్రణతోనే తెలుస్తుంది. పి. వేణుగోపాల్, కె. శ్రీనివాస్, గూడ అంజయ్య, కాలువ మల్లయ్య, లోకేశ్వర్ వంటి లబ్ధ ప్రతిష్టులు రాసిన ఈ వ్యాసాలు ‘తోవలు’ చూపిస్తాయనడంలో సందేహం అక్కరలేదు. సంకలనం ఉద్దేశం మేరకు  ప్రయాణం ఎక్కడ మొదలయిందో పాఠకుడు సులభంగానే గ్రహిస్తాడు. కానీ ఎటు, ఎలా వెళ్లాలి అన్న అంశం దగ్గర ఇంకొంచె నిర్దేశం, స్పష్టత కోరుకుంటాడని అనిపిస్తుంది.
 - కల్హణ
 
 కొత్త పుస్తకాలు
 జ్ఞానయజ్ఞం
 సేకరణ: రామిరెడ్డి శ్రీమాలతి
 పేజీలు: 462; వెల: 750
 ముద్రణ: క్రియేటివ్ లైన్స్, చిక్కడపల్లి, హైదరాబాద్-20.
 ఫోన్: 040-27616699
 
 నీరాజనం (కథలు)
 రచన: సి ఎన్ చంద్రశేఖర్
 పేజీలు: 100; వెల: 80
 ప్రతులకు: ఎస్ వి కృష్ణజయంతి, 19-90, పి అండ్ టి కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-60.
 ఫోన్: 9247302882
 
 ఊహలు గుసగుసలాడే (కవిత్వం)
 రచన: ములుగు లక్ష్మీమైథిలి
 పేజీలు: 80; వెల: 100
 ప్రతులకు: రచయిత్రి, 26-3-2050, చంద్రమౌళి నగర్, పోస్టాఫీస్ ఎదురుగా, వేదాయపాలెం, నెల్లూరు-4. ఫోన్: 9441685293
 
 అలజడి (కవిత్వం)
 రచన: గొట్టిపర్తి యాదగిరిరావు
 పేజీలు: 58; వెల: 50
 ప్రతులకు: రచయిత, 203, తిరుమల అపార్ట్‌మెంట్స్, 16-11-771, ఆండాల్ ప్లాజా, మూసారాంబాగ్, మలక్‌పేట, హైదరాబాద్-36.
 ఫోన్: 08297277795
 
 గడ్డిపరక (కవిత్వం)
 రచన: పి.లక్ష్మణ్‌రావ్
 పేజీలు: 120; వెల: 25
 ప్రతులకు:కవి, 304, రామకృప టవర్స్, ఫేజ్-3, ఉడా కోలనీ, కంటోన్మెంట్, విజయనగరం-535003. ఫోన్: 9441215989
 
 పేజీలు: 112; వెల: 60; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్. ఫోన్: 040 27678430
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement