అన్నిటికీ కన్నీళ్లే... ఏం చేయను?! | Life story | Sakshi
Sakshi News home page

అన్నిటికీ కన్నీళ్లే... ఏం చేయను?!

Aug 30 2015 12:43 AM | Updated on Sep 3 2017 8:21 AM

అన్నిటికీ కన్నీళ్లే... ఏం చేయను?!

అన్నిటికీ కన్నీళ్లే... ఏం చేయను?!

నా భార్య చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తూ ఉంటుంది. కొడుకు స్కూల్ నుంచి రావటం ఆలస్యమైనా, ఇంట్లో శవం లేచి నంతగా ఏడుస్తుంది.

 నా భార్య చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తూ ఉంటుంది. కొడుకు స్కూల్ నుంచి రావటం ఆలస్యమైనా, ఇంట్లో శవం లేచి నంతగా ఏడుస్తుంది. మీరు నమ్మకపోయినా ఇది నిజం. ఏమి చేయాలి?
 - రామ్‌ప్రసాద్, కాకినాడ
 
 ఆదిమధ్యమ్మకి మూడు నెలల్నుంచీ కంటిమీద కునుకు లేదు. మొదటి కారణం... కొడుకు అమెరికా వెళ్లిపోవడం. రెండోది సుబ్రహ్మణ్యం మరణం. ఇదే పరిస్థితి కొనసాగితే ఆమె కూడా సుబ్రహ్మణ్యాన్ని చేరుకోవడం ఖాయమని, మిత్రుడైన వైద్యుణ్ని సంప్రదించాడు ఆమె భర్త.‘‘మీరు రెండుపూటలా బాగా తినాలి’’ అని చెప్పాడు వైద్యుడు. ‘‘నేను బతికినా చచ్చినా ఒకటే. కొడుకు పరాయి దేశం పోయాడు. పెంచిన కుక్కా పోయింది. నా సుబ్రహ్మణ్యం ఈ లోకమే వదిలేశాక, నేను బతికి ఏం లాభం?’’ అని ఏడ్చింది.
 
 ‘‘నేను మీ మానసిక స్థితి గురించి చెప్పడం లేదు. మీకు బొల్లి రాబోతోంది. సంవత్సర కాలంలో శరీరం తెల్లబడి, వికృతంగా తయారవబోతున్నారు’’ అన్నాడు వైద్యుడు. భార్యాభర్తలిద్దరూ షాకయ్యారు.‘‘ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి తగ్గించవచ్చు. బొల్లి వేళ్ల మధ్యలోంచి మొదలవుతుంది. అక్కడే తుంచేస్తే శరీరం అంతా పాకదు. చేతివేళ్ల మధ్యలో రోజూ తులసిరసం రాసుకోండి. ఆర్నెల్లపాటు మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగితే, ఆ వ్యాధి మిమ్మల్ని చేరదు. వేళ్ల మధ్య చర్మం ఏమాత్రం తెల్లగా మారినా వెంటనే నా దగ్గరకు రండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు వైద్యుడు.
 
 ఆ రోజు నుంచీ ఆమె రోజుకు పదిసార్లు తులసి ఆకులు పిండి, రసం రాసుకోసాగింది. రెండు మూడు నెలలు గడిచాయి. బొల్లి రాలేదు. గొప్ప విజయం సాధించిన సంతృప్తి ఆమె కళ్లలో కనబడింది. ఆర్నెల్ల తరువాత తన మిత్రుడిని ‘‘కొడుకు గురించీ, కుక్క గురించీ నీ భార్య మర్చిపోయిందా?’’ అని అడిగాడు వైద్యుడు.
 ‘‘మర్చిపోయింది. ప్రస్తుతం ఆమె ధ్యాసంతా చేతివేళ్ల మీదే ఉంది. అదృష్టవశాత్తూ బొల్లి రాలేదు.’’
 
 ‘‘అసలామెకు ఆ వ్యాధి లేదు’’ అన్నాడు వైద్యుడు.
 ‘‘పెద్ద బాధని మరింత పెద్ద బాధ చిన్నది చేస్తుంది. కష్టం ఒక రిలెటివ్ టర్మ్ అని అల్లిన కథ ఇది. ఈ సందర్భంగా ‘‘మానసిక ప్రశాంతత లభించటానికి ఏమి చేయాలో అది చెయ్యక, అల్పమైన విషయాల గురించి ఆలోచిస్తూ మనం మనసు పాడుచేసుకుంటాం’’ అని ‘‘ద 3 వెహికిల్స్ ఆఫ్ బుద్ధిజం’ అనే పుస్తకంలో ఒక సూత్రం ఉన్నది.
 చిన్న చిన్న కారణాలకి బాధపడేవారు ఆ దుఃఖం నుంచి బయటపడే అత్యంత సులభమైన మార్గం... ఆస్పత్రులకి వెళ్లి, టెర్మినల్ పేషెంట్లకి పూలూ పళ్లూ ఇచ్చి కొంచెంసేపు సంభాషించటమే. ఫలితం అద్భుతంగా ఉంటుంది. కాళ్లకి చెప్పులు లేవని ఏడ్చేవాడు, కాళ్లులేని వాడిని చూసి సంతోషించాలన్న సామెత అందులోంచి వచ్చిందే.
 
   సాక్షాత్తూ భగవంతులైన శ్రీకృష్ణునికి, శివుడికి, వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఉన్నారు. కానీ నేను ‘రెండో నంబరు’ మాట ఎత్తితే మాత్రం నా భార్య ఒప్పుకోవడం లేదు. పైగా నాకు విడాకులు ఇస్తానంటోంది. ఏమిటి కారణం? భగవంతునికి ఓ రూలు, భక్తుడికి ఓ రూలా?
 - బి.చంద్రశేఖర్, జడ్చర్ల
 ఈ శీర్షిక నిజంగా సమస్యల్లో ఉన్నవారి కోసం నిర్వహిస్తున్నది. మీరేదో సరదాగా ఈ ప్రశ్న అడిగినట్టుంది. కృష్ణుడికీ, శివుడికీ ఇద్దరు భార్యలు. కానీ ద్రౌపదికి ఐదుగురు భర్తలు. మీ భార్య కూడా ఈ విధంగా ఆలోచిస్తే మీరు ఏమవుతారు? ఉన్నాడో లేడో తెలీని భగవంతుణ్ని ఆదర్శంగా తీసుకోకుండా, ఒకవేళ తీసుకోవలసి వస్తే, ఇటువంటి విషయాల్లో భగీరథుడు, కర్ణుడు, ఏకలవ్యుడు లాంటివారిని ప్రామాణికంగా తీసుకుంటే మంచిది.
 
   మీరు ఇన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాశారు కదా సర్. అసలు మీ దృష్టిలో విజయం అంటే ఏమిటి?
 - రామబ్రహ్మం, హైదరాబాద్
 రేపు నవ్వుతూ ఉండటానికి, ఈ రోజు నవ్వుతూ పనిచెయ్యటం. ఇది కూడా రాశాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement