
నేను డిగ్రీ కాకినాడలో చేశాను. హాస్టల్‌లో ఫుడ్ పడక, నలుగురు స్నేహితురాళ్లం కలిసి రూమ్‌లో ఉండేవాళ్లం. మేముండే ఇంటి పక్కనే రింకీ అని ఓ రాజస్తానీ అమ్మాయి అద్దెకుండేది. తనకి తెలుగు సరిగా రాకపోయినా మాతో తెలుగులో మాట్లాడటానికే ప్రయత్నిస్తుండేది. మాకేమో ఇంగ్లిష్ సరిగా రాదు. తనకది తెలియకుండా మ్యానేజ్ చెయ్యాలని, ‘అన్ని భాషలు నేర్చుకోవాలి’ అంటూ తనని తెలుగులో మాట్లాడటానికే ప్రోత్సహించేవాళ్లం. తనేం చెప్పినా తన మాటలకంటే హావభావాలను బట్టి అర్థం చేసుకునేవాళ్లం. మా రూముల మధ్యలో ఓ చిన్న పిట్టగోడ మాత్రమే ఉండేది. అందుకే వీలుచిక్కినప్పుడల్లా ఇంటి ఓనర్లు గమనించకుండా అటూ ఇటూ దూకుతూ బాగా ఎంజాయ్ చేస్తుండేవాళ్లం. రింకీ మాతో ఎంత కలిసినా డబ్బుల విషయంలో కాస్త వ్యత్యాసం చూపిస్తూనే ఉండేది. ఒక్క రూపాయి వేస్టైనా ఫీలైపోయేది. దానికి తగ్గట్లే సిచ్యుయేషన్స్ కూడా వస్తుండేవి.
ఒకరోజు రింకీ వాళ్ల వాష్‌రూమ్‌లో వాటర్ రాకపోతే మా వాష్‌రూమ్‌లో హెడ్‌బాత్ చేసి హెయిర్ కండీషనర్ మరచిపోయింది. మరునాడు వచ్చి ‘నాకీ కండీషనర్’ అంది. ఎక్కడ పెట్టావంటే ‘మీకీ బాత్‌రూమ్‌లో’ అంది. ‘‘చూడుపో.. మార్నింగ్ ఏదో బాటిల్ చూసినట్లు గుర్తు’’ అంది నా స్నేహితురాలు అరుణ. బాటిల్ తెచ్చుకున్న రింకీ ముఖంలో ఒకరకమైన ఆశ్చర్యం కనిపిస్తోంది. ఏమైందని అడిగితే... ‘నాకి బాటిల్ అప్పుడే అయిపోయింది’ అంది షాకింగ్‌గా. చూస్తే అందులో సగానికి పైనే అయిపోయి ఉంది. ‘బాటిల్ ఎప్పుడు ఓపెన్ చేశావ్?’ అడిగింది మరో స్నేహితురాలు శ్రావణి. ‘నిన్నన్నే...(నిన్నే)’ అని చెప్పింది చాలా నిరుత్సాహంగా. మేమెవరం వాడలేదు. ఒకవేళ వాడినా కండీషనర్ ఒక్కరోజులో అంత అయిపోతుందా? ఏం జరిగి ఉంటుందని బాగా ఆలోచించాం. అప్పుడర్థమైంది. మాతో పాటు మా వాష్‌రూమ్‌ని మా ఓనర్ వాళ్ల అమ్మ కూడా వాడుకునేది. ఆమెకు కాస్త చేతివాటం ఉంది. (అప్పుడప్పుడు బయట ఆరవేసిన టవల్స్, కడిగిపెట్టిన ప్లేట్స్ మా దగ్గర మిస్సై, ఆమె రూమ్‌లో కనిపిస్తూ ఉండేవి.) ‘మేబీ.. బామ్మే వాడేసిందంటావా?’ అంది శ్రావణి. ‘ఆమె యూజ్ చేసుకుని వదిలేసే రకం కాదు, దొరికితే మాయం చేసే రకం. అయినా.. ఒకేసారి అంత వాడేసుంటుందా?’ అంది అరుణ. ‘షాంపూ అనుకునుంటుందే, ఎంత రుద్దినా నురుగు రాకపోయేసరికి అలా డబ్బా ఖాళీ చేసినట్లుంది’ అంది ఇంకో స్నేహితురాలు మాధవి. మేమంతా బాగా నవ్వుకున్నాం. అయితే రింకీ బాధ చూడలేక నెల సరుకులతో పాటు కండీషనర్ కూడా తీసుకుని తనకి ఇచ్చేశాం.
ఇంకోరోజు పెద్ద వాన వస్తుంటే ఆఫీస్‌కి వెళ్తూ.. బామ్మగారి(ఓనర్ వాళ్ల అమ్మ) చిరిగిన గొడుగు తీసుకుని వెళ్లిందట రింకీ. పెద్ద గాలికి అది పూర్తిగా పాడైపోయిందట. తిరిగి అదే గొడుగు ఇచ్చి.. ‘సారీ.. బామ్మగారూ’ అందట. రింకీ తెలుగులో ఏం చెప్పిందో.. బామ్మకి ఇంగ్లిష్‌లో ఏం అర్థమయ్యిందో.. మేం కాలేజ్ నుంచి రూమ్‌కి వచ్చేసరికి పెద్ద గొడవ. ‘దటీజ్ హోల్స్ అంబ్రిల్లా..’ అంటుంది రింకీ. ‘అయితే మాత్రం.. పూర్తిగా పోగొట్టింది నువ్వే కదా, కొత్తది కొనివ్వు’ అంటుంది బామ్మ. పిచ్చి లేచి మేమే ఆ గొడుగు కొని బామ్మకు ఇచ్చేశాం.కొన్ని రోజులకి, ఓ ఆదివారం ఉన్నట్టుండి పెద్దపెద్ద అరుపు, కేకలు మొదలయ్యాయి. రింకీ వాళ్ల ఇంటి ఓనర్ రింకీపై కోప్పడుతున్నాడు. ‘వాటర్ అయిపోతున్నాయని, వాటర్ ఎక్కువ వాడుతున్నావని’ ఏదేదో తిడుతూ రెచ్చిపోతున్నాడు. రింకీ కూడా పెద్దగానే అరుస్తోంది. గొడవ పెద్దది కావడంతో మేమంతా ఆ గోడ దగ్గరకు వెళ్లాం. అప్పటికే రింకీని ఇళ్లు ఖాళీ చెయ్యమన్నాడు వాళ్ల ఓనర్. పౌరుషంగా బ్యాగ్స్ సర్దుకుంది రింకీ. మమ్మల్ని చూసి బావురుమంది. ‘సరే కానీ, ఇక నుంచి మాతో ఉందూగానీ’ అంటూ.. తన బ్యాగ్స్ అన్నీ ఆ గోడమీద నుంచే అందుకుని రూమ్‌లో పెట్టేసి, తననీ మా రూమ్‌లోకి తీసుకొచ్చాం. అయితే ఇంటి ఓనర్లు ఇద్దరూ ‘మీది తెనాలే.. మాది తెనాలే..’ సాంగ్ ఏదో పాడుకున్నట్లున్నారు. ఓ మూడు గంటల తర్వాత మా ఇంటి ఓనర్ మా దగ్గరకి వచ్చి.. మేం చెప్పేది వినకుండానే ‘రింకీ గురించి నాకు బాగా తెలుసు, తను మాట వినే రకం కాదు, తను మీ రూమ్‌లో ఉండటానికి వీల్లేదు’ అన్నాడు. తలలు పట్టుకున్నాం. అప్పటికే ఐదైంది. తనని ఎక్కడ ఉంచాలో అర్థం కాలేదు. చాలా ప్రయత్నాలు చేశాం. చివరిగా కాకినాడలో ఎప్పటి నుంచో పరిచయమున్న మధు గుర్తుకొచ్చింది. తనూ నాలానే స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉండేది. మధుకి కాల్ చేసి, విషయం చెబితే.. ‘సరే, తనని మా రూమ్‌కి తీసుకునిరా, ఎన్ని రోజులున్నా నో ప్రాబ్లమ్’ అంది. మధు వాళ్ల రూమ్ మాకు పెద్ద దూరమేంకాదు. సైకిల్ మీద వెళ్తే ఇరవై నిమిషాలంతే!
ముందురోజే నా సైకిల్ పంక్చర్ కావడంతో.. మూడు సైకిల్సే బయటికి తీశాం. నేను.. అరుణ సైకిల్ తీసుకుని, రింకీని ఎక్కించుకోగా, శ్రావణీ సైకిల్ అరుణ ఎక్కింది. మాధవి తన సైకిల్‌కి రింకీ లగేజ్‌నంతా కట్టుకుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. సగం దూరం వెళ్లాక రింకీ ‘నాకీ పర్సూ..’ అని అరిచింది. సైకిల్స్‌కి బ్రేకులు పడ్డాయి. ‘అయ్యో ఎక్కడ పడేశావ్?’ అడిగింది అరుణ. ‘నాకీ గురుతూ లేదు..’ అంది రింకీ ఏడుపు ముఖంతో. ‘ఏం కాదులే.. రూమ్‌లోనే మరిచిపోయి ఉంటావ్, మనం ఇంకెక్కడా ఆగలేదుగా’ అన్నాను నేను. అప్పటికి టైమ్ ఏడవుతోంది. ‘సరే పదా.. మనం వెళ్లి తీసుకొచ్చేద్దాం’ అంది అరుణ. ‘అబ్బా.. ఆ మార్కెట్ మధ్యలోంచి ఇప్పుడు ఈ సైకిల్స్‌తో చాలా కష్టమే తల్లి... మార్నింగ్ తెద్దాంలే..’ అంది మాధవి. ‘ఏదోలా ఇప్పుడు తేవడమే బెస్ట్, పైగా రేపు మనం సెవన్‌కే కాలేజ్‌కి వెళ్లాలి,మర్చిపోయావా?’ అంది అరుణ. రింకీ మళ్లీ ఏడుపు ముఖం పెట్టింది. చేసేది లేక.. వాళ్లని దగ్గరలోని బస్టాప్ దగ్గర వెయిట్ చెయ్యమని చెప్పి, అరుణని ఎక్కించుకుని రూమ్‌కి వెళ్లాను. తాళం చూడగానే ‘కీ’ అనేదొకటి ఉంటుందని, అది మా ఇద్దరి దగ్గర లేదని గుర్తుకొచ్చింది. ‘ఖర్మరా’ అనుకుంటూ ‘కీ’ కోసం మాధవికి కాల్ చేస్తే ‘అయ్యో నా దగ్గరే ఉందే!’ అంది చాలా సింపుల్‌గా. పగలగొడదామంటే అదొక్కటే లాక్, పైగా చాలా పెద్దది. ‘మార్నింగే కాలేజ్‌కి వెళ్లాలి, తాళం లేకపోతే కష్టం కదే’ అంది అరుణ. చచ్చినట్లు ఆ మార్కెట్ దాటుకుంటూ వాళ్లు ఉన్నచోటుకు వెళ్లి ‘కీ’ తెచ్చుకుని, రూమ్ దగ్గర ఆగగానే రింకీ కాల్ చేసింది. సైకిల్ స్టాండ్ వేస్తూనే ‘ఏంటి రింకీ?’ అని అడిగా. ‘పర్సు ఉందీ’ అంది. మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్తున్న అరుణను వెనక్కి పిలిచి ‘పర్స్ ఉందటే, పద వెళ్దాం’ అని, దాన్ని ఎక్కించుకుని, మార్కెట్ దాటుకుని, వాళ్ల దగ్గరకి చేరుకునే సరికి ఎనిమిదిన్నర దాటింది. వెళ్లగానే రింకీ నా దగ్గరకి చాలా ఆతృతగా వచ్చి.. ‘పర్స్ ఉందీ?’ అంటూ వట్టి చెయ్యి చాపింది. ఒక్కసారి నా కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్లనిపించింది. ‘పర్స్ ఉంది అన్నావ్ కదే!’ అన్నాను షాకింగ్‌గా. అప్పటికే సీన్ అందరికీ అర్థమైంది. ‘నీ భాష తగలెట్ట... పర్స్ ఉందీ కాదే.. పర్స్ ఉందా? అని ఏడ్వాలి’ అంటూ అరిచింది అరుణ. సైకిల్ వెనకాల కూర్చున్న దానికే అంత కోపం వస్తే.. మరి నా పరిస్థితి ఏంటి.? మాధవి వైపు చాలా నిరుత్సాహంగా ఓ చూపు చూశాను. ‘పర్స్ నేను తెస్తాలే’ అంది. ఆ రోజైతే కోపమొచ్చింది కానీ ఆ సీన్ గుర్తుకొచ్చిన ప్రతిసారీ మేమంతా భలే నవ్వుకుంటాం. పర్స్ అయితే రూమ్‌లో దొరికేసింది కానీ, ఆ రోజు నుంచి రింకీ పేరు ‘రాజస్తానీ పర్స్’ అయిపోయింది.
– చిన్ని గాలిదేవర, అమలాపురం