రికాడ్డేన్స్‌

రికాడ్డేన్స్‌ - Sakshi


అన్ని రికాడ్డేన్స్‌ల గురించీ మనం చెప్పలేపోవొచ్చునేమో గానీ, అంభేరుపురం రికాడ్డేన్స్‌ మటికి చాలా ఆరోగ్యకరమైంది. మనసుని నిండుగా చేసీసీది. పిల్లాపాపల్తో కలిసి చూడబుల్‌గా ఉండీది. బాగుండీది. మా చోడవరం కంటే అంభేపురవేంటీ పెద్ద పొడిచీసిన ఊరుగాదు. చిన్నూరే. కాపోతే, అక్కడ పందార ఫేట్రీ ఉంది. భూషణం రికార్డింగ్‌ డేన్స్‌ ట్రూపూ ఉంది. కాబట్టికే ఆ ఊరికి కొంత గర్రా. గొప్పున్నోడు ఫోజులు కొడతాడు. భరించాలి. జుత్తున్నమ్మ ముడేసుకుంటుంది. మాటాడగూడదు.



అంభేరుపురం డేన్స్‌ ట్రూపు ఎలాంటిదంటే, అదంతా ఒక కుటుంబం కిందే లెక్క. అక్కినేని నాగేశ్వరరావుగా భూషణంబాబు స్టెప్పులు దంచీవాడు. కిశోర్‌కుమారయితే నందమూరి తారక రామారావుని స్టేజీమీద దింపీసీవాడు. వాళ్ల  చుట్టాలమ్మాయిలే వాళ్ల పక్కన హీరోయిన్లు. ఫీమేల్‌ ఆర్టిస్టుల కోసం వెతుక్కోనక్కర్లేదన్నమాట. వరాలని ఒక పిల్ల ఉండీది. ఆ పిల్లా భూషణం దూరపు బంధువే. క్లబ్‌డ్యాన్సులు గట్రా చేసీది. బాబ్జీ అని ఉండీవాడు. అతగాడేమో హిందీ పాటలు, పవర్‌ స్టార్‌ క్రిష్ణ డేన్సులు వేసీవాడు. ‘తనే రాజబాబు.. రాజబాబే తను..’ అని తల్లితోడుగా నమ్మీసీ ఎండు నరం లాంటి వాడొకడు ఎప్పుడూ రడీరడీచ్చే. వీడు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి లాంటివాడు. ఒక ట్రూపులో పెరమనెంటుగా ఉండడు. ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరికి పోతాడు. ఆ రాత్రికి డేన్సేస్సి డబ్బులు పట్టూ పోతాడు. సరుకున్నవాడు. అందుకే వీడికి డిమేండెక్కువ.



రాజమండ్రి అనకాపల్లి కేంద్రాలుగా చాలా రికార్డింగ్‌ డేన్స్‌ బృందాలుండీవి. కాదన్లేదు. వేల్పుల వీర్రాజు, ఉదయ్‌ కుమార్, అశోక్‌ కుమార్‌లాంటి వాళ్లు ఆ రోజుల్నాడు బాగానే ఏలీవారు. వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ కాదు మా భూషణం. చోడవరం వినాయకుడి నవరాత్రులప్పుడు బాలగణపతి సంఘం తొలీతా బుక్‌ చేసీది ఇతగాణ్ణే. తనూ కాదనీవాడు కాడు. పొయ్యికాడ ఆకుమడి పోగ్రాం కాదనీసి ఎక్కడెక్కడో తిరిగితే ఏం లాభం.. డబ్బు మిగలొచ్చునేమో గానీ నలిగిపోతాం.. సుఖవుండదు.. అనుకునీవాడు. వెంటనే బాలగణపతి సంఘానికి మాటిచ్చీసీవాడు.



భూషణం ట్రూపు డ్రస్సులు భలే ఉండీవి. ఆయన స్వయానా టైలరు. నలభైయ్యేళ్ల కిందట టీవీలెక్కడివి. గూగుల్లూ, యూ ట్యూబులూ ఎక్కడని చచ్చేయి. అయినా భూషణానికి లోటు లేదు. ఒకసారి సినిమా చూస్తే చాలు. హీరో హీరోయిన్ల స్టెప్పులు, డ్రస్సులు అన్నీ గుర్తుపెట్టీసుకునీవాడు. తనేసుకుని ఏఎన్నార్‌ బట్టలు కుట్టుకునీవాడు. తన హీరోయిన్‌ రత్నావళికి వాణిశ్రీ దుస్తులు సిద్ధపరిచీవాడు. ఎన్టీఆర్‌గా చేసీ కిశోర్‌కి పెద్ద కాలర్‌ చొక్కాలు, బెల్‌బాటమ్‌ ఫేంట్లు క్షణాల మీద తయారుపెట్టీవాడు. అతని పక్కన కథానాయికకీ బట్టలు రైట్‌ చేసీవాడు. మిగతా డ్యాన్సర్లకి కూడాని చాలా శ్రద్ధగా మేకప్‌ సామాన్లు, డ్రస్సులు కొనిచ్చీవాడు. చోడవరం ఎంతో దూరం కాదు గనక రిక్షాల మీద బయలుదేరిపోయీవాడు. ప్రోగ్రాం జరిగీ గణపతి గుడికి చవితినాటి సాయంత్రం ట్రూపుని తీసుకొచ్చీసీవాడు.



వీళ్ల బృందం ఊళ్లో దిగిందని తెలిస్తే చాలు. కుర్రనాగన్నలు రెచ్చిపోయీవారు. ‘ఎన్టీఆర్‌ వచ్చేడట్ట. ఏఎన్నార్‌ దిగీసేడట్ట..’ ఇకను ఇవే మాట. గుంటసావాదిగాళ్లందరూ పొలోమని ఆలయానికే పోయీవారు. వద్దంటున్నా వినకుండా రిక్షాలమీంచి డేన్సర్ల ఇనప రేకుపెట్టెలు లైటింగ్‌ సామాన్లు దింపీసి మోస్సీవారు. స్టేజీ వెనకాల తాటి కమ్మల్తో కట్టిన మేకప్‌ దడిలోకి చేరబెట్టీవారు. అలాంటప్పుడే కొందరు కుర్రాళ్లు మాచెడ్డ నీరసపడిపోయీవారు. ఎన్టీఆర్‌ వేషం కట్టీ కిశోర్, నాగేశ్వర్రావు యేక్షన్‌ చేసీ భూషణం ఆ క్షణాన హీరోల్లా వాళ్ల కళ్లకి కనిపించీవారే కాదు. ‘‘స్టేజీ మీదున్నట్టు గాని బయటలేరేట్రా..’’ అంటూ ఆ కురాళ్లు బితుకుబితుకుమంటూ దెబ్బతినీసినట్టు అయిపోయీవారు.‘‘అదేటీ గాదు. మేకప్పేసేక, రంగునైట్లు ఎలిగేక, ఆల్లు హీరోల్నాగే ఉంతార్లేరా’’ ఇంకో గుంటకక్కగట్టెవడో సరిదీవాడు.



రాత్రి ఎనిమిదయ్యేసరికి తిళ్లు తిని మేకప్పులకి కూర్చునీవారు భూషణం బ్యాచీ సభ్యులు. ముఖం మీద జుత్తులు పడకుండా నెత్తికి రుమాలు గుడ్డలు కట్టుకునీవారు మగడేన్సర్లు. నేత్రాలమీద పెద్ద పెద్ద కనుబొమలు దిద్దికునీవారు. ముఖానికి తెల్ల కోటాలు దిట్టంగా కొట్టుకునీవారు. ఆడవాళ్లు మాత్రం పొడవైన కొప్పులు నెత్తిమీద పెట్టుకునీవారు. వాటికి వరసావాయీ లేకుండా చెంపపిన్నులు గుచ్చుకునీవారు. సన్నటి కనుబొమల్ని పెన్సిళ్లతో గీసుకునీవారు. మొహాలకి గులాబీరంగు దట్టంగా రాసుకునీవారు. కళ్ల పైరెప్పల మీద చెమ్కీ అద్దుకునీవారు. పెదాలకి ఎర్రరంగు పట్టించీవారు. అది బాగా అంటుకోడానికి  మూసుకున్న మూతుల్ని ముప్ఫయిచుట్లు తిప్పీవారు.



ఇదంతాను తాటాకుదడి కన్నాల్లోంచి ఊరి కుర్రగాళ్లు చూసీవారు. పక్కనున్న పాతచెర్లోంచి పీక్కొచ్చిన తూటికాడ కర్రల్తోటి బాలగణపతి సంఘం కార్యకర్త వీళ్లని ఆట్టే దెబ్బతగలకుండా కొడుతుండీవారు. దూరంగా తోలుతుండీవారు.క్లబ్‌డ్యాన్సులేసీ వరాలు మొగుడు రాజులని ఉండీవాడు. వాడు ఆటకి పనికిరాడు. వాడితో ఆడిస్తే ఏనుగు చేత గానుగాడించినట్టే. మొత్తం బొక్కడిపోద్ది. వాడు తిండికి తిమ్మరాజు. పనికి పోతురాజు. అంచేత, వాణ్ని స్టేజీ ముందరుండీ ఫోకస్‌ లైటు దగ్గిర కూచోబెట్టి రంగుల ముచ్చికాయితాల చక్రం తిప్పమనీవాడు భూషణం. పాటకి తగ్గట్టుగా స్టేజీని రంగుల కాంతిలో ముంచమనీవాడు. డేన్సెంతో ఫోకసింగూ అంతే ముఖ్యమని చిలక్కి చెప్పినట్టు చెప్పీవాడు. పిచిక్కి మప్పినట్టు మప్పీవాడు.



రాజులుగాడు తక్కువేంటీ కాదు. వాడికీ, వాడి పెళ్లాం వరాలకీ ఇచ్చీ కిరాయి ముందే భూషణాన్ని అడిగి తీసీస్కునీవాడు. కాదంటే అల్లరి పెట్టీవాడు. వరాలు ఆడకుండా అడ్డీసీవాడు. అందుకే ఆ డబ్బేదే వాడికి పారీమని చెప్పీది ఆ పిల్ల. రోజూ బీడీలు కాల్చీ రాజులుగాడు సొమ్ము చేతిలో పడగానే రెడ్‌విల్స్‌ అంటించీవాడు. అస్తమానూ సారా తాగీవోడు ఆరారా సేంపిలేసీవాడు. ముష్టి చెక్కపొట్లాం నమిలీవాడల్లా రత్నా జరదాకిల్లీ బిగించీవాడు. ఎవడేంటి చెప్పినా చివరికి వాడికి పుట్టిన బుద్ధే వాడిది. వాడి పెళ్లాం పాటప్పుడు సక్రంగా చక్రం తిప్పి భలే రంగులు చూపించీవాడు. వాడికిష్టం లేని పాటలొచ్చినప్పుడు మటికి చెత్త రంగులు ఫోకస్‌ చేసీసి కంపు కొట్టించీసీవాడు.



 డేన్స్‌లన్నీ అయిపోయేక ఉస్సురుమంటూ ‘అలా సేసేవేటి రాజులూ’ అని భూషణం కొద్దిగా కోప్పడితే, ‘అదేటి మాయ్యా. బాగానే తిప్పినా గదేటి సెక్రం’ అని అన్నీ చేసీసి ఏవీ ఎరగనట్టు ఎర్రిపప్పలా మాటాడీవాడు. మెత్తని కక్కలా గునిసీవాడు. భూషణవూ అటు తిరగ్గానే ‘దురత్తీరిందా’ అన్నట్టుగా ఓరగా ఓ వెకిలి నవ్వు విసిరీవాడు.



రాత్రి పదికి రికాడ్డేన్స్‌ మొదలయిపోయీది. అప్పటికే ఊళ్లోని ఇల్లుపిల్లాద్రీ స్టేజీ ముందు వారసరిగా చేరీసీవారు. మరీ ముఖ్యంగా అగ్రజాతి పురుష పుంగవుల భార్యామణులయితే నిలుచున్న చోటు నుంచి బెత్తెడు దూరమూ కదిలీవారు కారు. తమ దిక్కుమాలిన మొగుళ్లు ఏడాదికోమారు చూపించీ మహావినోదం ఇదేనని వాళ్లంతా గట్టిగా భావించీవారు. రోజూ వంటింట్లో పడి చచ్చీ తమకి ఈ రోజే స్వేచ్ఛాదినమన్నట్టుగా ప్రవర్తించీవారు.



 ఆసక్తిగా డేన్స్‌ల మీదనే మనసు లగ్నం చేసీవారు. వీళ్లకి వెనకాల సకల రకాల జనావళీ పోగుబడిపోయీవారు.ముందుగుండా ‘శుక్లాం బరధరం విష్ణూం.. శశివర్ణం చతుర్భుజం..’ ఘంటసాల రికార్డు పాడించీవాడు భూషణం. స్టేజీ మీద తెర వెనుకే డేన్సర్లందరూ నిలబడి ప్రార్థన చేసీవారు. ఆ వెంటనే ఫస్టు ఫస్టు ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది..’ పాట వేస్తున్నట్టుగా మైకులో హిందీపాటల డేన్సరు బాబ్జీ ప్రకటించీవాడు. ప్లేటును ప్లేయర్‌ మీద వేసీవాడు. తెర తొలిగీది.



పాట మొదలవగానే కిశోర్‌కుమార్‌ స్టేజీ మీది దీపకాంతుల మధ్య ఎన్టీవోడిలాగానే వెలిగిపోయీవాడు. ‘తల్లా పెళ్లామా’ సినిమా అతగాడు ఎన్ని సార్లు చూసేడో మనకి తెలీదు.  

‘‘పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవదు, నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు’’ అన్నచోట స్టేజీ దిగిపోయి అచ్చం సినీమాలో రామారావు బాధపడున్నట్టుగానే రెండు చేతులూ అడ్డంగా గాల్లో ఊపీసీవాడు. జనంలోకొచ్చీసి చాలా ఇదయిపోయీవాడు. ప్రేక్షకులు ప్చ్‌..ప్చ్‌.. కొట్టీసి, హాహాకారాలు చేసీసి ఆయన చుట్టూ చేరిపోయీవారు. ఆ పాట మైకంలోంచి వాళ్లు చప్పున తేరుకోలేపోయీవారు. ఈ వ్యవహారాన్ని సరిచేయడానికన్నట్టుగా..



‘‘నెక్స్ట్‌ అయిటమ్‌ ‘దత్తపుత్రుడు’ చిత్రంలో ‘పిల్లోయ్‌ జాగత్త’, జూనియర్‌ ఏఎన్నార్‌ భూషణం జూనియర్‌ వాణిశ్రీ రత్నావళి’’ అనే ఎనౌన్స్‌మెంటు వెలువడీది. ఈలలు మిన్నుముట్టీసీవి.

‘‘ఆడదిలే అని వదిలేస్తుంటే అడ్డుతగులుతున్నావా, నా దెబ్బ చూపమంటావా’’ పంచె కట్టుకుని భూషణం రెచ్చిపోతూ నోరు కదిపీవాడు.‘‘పాపం పోనీ పసివాడంటే, పైకి పైకి వస్తావా, ఒక పట్టు పట్టమంటావా’’ రత్నావళీ తక్కువ తినీది కాదు. చదివింపుల మీద చదివింపులు వచ్చిపడిపోయీవి.



ఎన్టీఆర్, ఏఎన్నార్‌ పాటలయిపోయేక ‘హమ్‌ కిసీసే కమ్‌నహీ’ హిందీ సినిమాలోని ‘‘బచ్‌నా ఏ హసీనోం లోమై ఆగయా’’ మోగీది. రికార్డు ప్లేయర్‌  నడిపించీ బాబ్జీ చకచకా స్టేజీ ఎక్కీసీవాడు. రిషీకపూర్లా విరగబడిపోయీవాడు.ఆ తర్వాత ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోని ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల..’ వర్ర వర్రగా వరాలు ఆడీది. వినాయకచవితినాడు తిన్న ఉండ్రాళ్లు, జిల్లేడుగాయల కంటే ఈ డేన్సులే బాగున్నట్టుగా పందిరి కింద చేరిన ప్రజానీకం పరవశించీది.



అనంతరం ‘సెక్రటరీ’ సినిమాలోని ‘మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు’, ‘అడవిరాముడు’ చిత్రంలోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’, ‘అమ్మ మాట’లోని ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు’, ‘ఇదాలోకం’లోని ‘‘గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు’ పాట మోతెక్కిపోయీవి. చప్పట్లే చప్పట్లు. ఈలలే ఈలలు.



అవునట్టు, రాజబాబు విషయం చెప్పనే లేదు కదూ. ఆమ్మో వాడి డేన్స్‌ సామాన్యమైన డేన్స్‌ కాదు. ‘‘చిలకలాంటి చిన్నదానా.. రావే వయ్యారి జాణ..’’ మొదటగా రుచి చూపించీవాడు. ఆనక ‘‘వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను’’ పాటలో కలగలిసిపోయి నానా దీర్ఘాలు తీసీవాడు. పందిరి మొత్తం నవ్వుల పువ్వులు పూస్సీది.



రికాడ్డేన్స్‌ చివర్నజేసి కిశోరేమో ‘దేవత’ లోని ‘బొమ్మపే చేసి ప్రాణము పోసి’ పాట వేసీవాడు. ఆ వెంటనే, ‘ప్రేమనగర్‌’లోని ‘ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్య నందనం’ సాంగుని భూషణం లాగించీవాడు. మూడు గంటలకు పైగా సాగే రికాడ్డేన్స్‌లో అశ్లీలం పాలు చిన్నమెత్తు కూడా భూతద్దం పెట్టి వెదికినా కనిపించీది కాదు. ఆఖరికి, వరాలు వేసే క్లబ్‌ డేన్స్‌లప్పుడూ సుబ్బరవైన గుడ్డలు కట్టుకునే ఆడీది.



ఈ విధంగా, మూడు పువ్వు ఆరు కాయలుగా సాగిపోతున్న భూషణం రికార్డింగ్‌ డేన్స్‌ ట్రూపు ఉన్నట్టుండి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది. హఠాత్తుగా చిక్కుల్లో చిక్కుబడిపోయింది. చివికి చీకాకుపడిపోయింది. పోలీసు బాబుల నుంచి ఎదురయిన ఆంక్షలతో రొడ్డ రొడ్డగా నానా బాధలూ పడిపోయింది. ఎక్కడో ఎవరో రికాడ్డేన్స్‌ ట్రూపులవాళ్లు ఏవో అభ్యంతకర నృత్యాలు చేస్తున్నారని చెప్పీసీ విశాఖపట్నం జిల్లా ఖాకీ అధికారులు వీటి మీద నిషేధం పెట్టీసేరు. ఇవి ఆడితే కటకటాల వెనక్కేనని నిబంధన విధించీసేరు. తుంటి కొడితే పళ్లు రాలినట్టుగా ఎక్కడో ఏదో జరిగితే భూషణం రికాడ్డేన్స్‌కి ముంచుకొచ్చీసింది.



భూషణం బాబు వేదనకు అంతూదరీలేదు. నోటి దగ్గర కూడుపోవడం ఒక ఎత్తయితే, ఇష్టమైన హీరో డేన్సులు చేయలేకపోవడం అంతకుమించిన ఎత్తు. మనసంతా కల్లోలపడిపోయింది. రోజుల వ్యవధిలోనే టీబీ పేషెంట్లాగ అయిపోయేడు. ఆరు నెలలు కాళ్లరిగేలాగ నాయకుల దగ్గరకీ పోలీసు పెదబాబుల దగ్గరకీ తెగ తిరిగేడు. ‘‘ఆకల్తో సస్తన్నాం’’ అని మొరపెట్టుకున్నాడు. ‘ఆట సూసి, అది మంచో సెడో సెప్పండి’ అంటూ బతిమాలేడు. లాభం లేపోయింది. అంతవరకూ భూషణం ట్రూపు డేన్స్‌ మంచివేనని మెచ్చుకున్న జనమెవ్వరూ కొంచెం కూడా నోరిప్పలేదు. మాట సాయం అస్సలు చెయ్యలేదు. ‘పక్కవాడి తగూ వినవేడుక’ టైపులో లేని జాలి ప్రదర్శించి తప్పుకున్నారు. పెళ్లాలతో సహా పెద్ద పెద్ద కుర్చీలేసుకుని తమ అభిమాన హీరోల పాటల్ని భూషణం, కిశోరు ఆడుతుంటే చూసి తరించీసిన సీఐలు, ఎస్‌ఐలూను కలుగజేసుకోనేలేదు. ఎవడెలా పోయినా అధికారులు చెప్పినట్టు చేసీసీ తమ బతుకులు బాగుండీలా చూసీసుకుంటే సరిపోతుందనుకున్నారు.



ఒల్లక కూచుండిపోయేరు.కొన్నాళ్లిలా గడిచిపోయేయి. డేన్స్‌లేసీ కాళ్లతో పగలూ రాత్రీ భూషణానికి కుట్టుమిషను తొక్కడం తప్పింది కాదు. ఇష్టపడి తొక్కీ తొక్కుడు వేరు. హృదయం లేని తొక్కుడు వల్ల తప్పుడు కుట్లు పడిపోయి గుడ్డలు పాడయిపోయీవి. కస్టమర్లు తిట్టిపోసీవారు. ఇలాగే మరికొంత కాలం పోయాక ఎవరో మనసున్న ఎస్పీ దొరగారు జిల్లాకొచ్చేరు. చార్జి తీసుకున్నారు. రికాడ్డేన్సర్ల బాధ విని కొద్దిగా కరిగేరు. మళ్లీ డేన్సులు మొదలెట్టుకోవచ్చని పెద్దమనసుతో ఆదేశాలిచ్చేరు. కాకపోతే వీటికి ‘భామాకలాపం’ అని పేరు పెట్టుకోమన్నారు. భూషణం ఏం చేయగలడు. అదే పదివేలనుకున్నాడు. పడుతూ లేస్తూ సరుకూ సప్పరా మళ్లీ సమకూర్చుకున్నాడు. రికాడ్డేన్స్‌కి తలపడ్డాడు.



సేన్నాళ్లుగా ప్రోగ్రాము లేకపోడంతోనూ అప్పుల పాలయిపోడంతోనూ మునుపటి ఉత్సాహం అంభేరుపురం బృందంలో లేకపోయింది. ఏదో ఆడేం అంటే ఆడేం అన్నట్టుగా ఉండీవారు. కాలమూ మెల్లగా మారిపోవొచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్లే సినిమాలకు దూరమైపోడం మొదలెట్టేరు. వాళ్ల పిల్లలు తెరమీదికి దిగీసేరు. భూషణం రికాడ్డేన్స్‌ పూర్తిగా మూలకెళ్లిపోడానికి అడ్డులేపోయింది.



కొన్నాళ్లపాటు భూషణం కొడుకు సూర్యం, కిశోర్‌ కొడుకు చంద్రం, నాగార్జున, బాలకృష్ణ డేన్సులు చెయ్యకపోలేదు. కానీ పెద్దగా హిట్టవ్వలేదు. జనాలూను స్పీడు యుగంలో పడిపోయి ముఖం పక్కకి తిప్పీసుకున్నారు. ఆ బెంగతోనేనేమో భూషణం గుండె ఓ నాటి తెల్లవారుఝామున అకస్మాత్తుగా ఆగిపోయింది. అతగాడు వెళ్లిపోడంతో నాథుడు లేక ట్రూపంతా కకావికలమైపోయింది. ఏవో పనులు వేపగించుకోడానికి, కూలిపనులు చేసుకోడానికి డేన్సర్లందరూ ఎటెటో చెదిరిపోయేరు. భూషణం ట్రూపే కాదు. కాలచక్రంలో పడిపోయి ఇలాంటి డేన్స్‌ బృందాలన్నీ చాలామటుకు మొగుమొత్తంగా అయిపు లేకుండా పోయేయి.



ఇంతకీ, చిన్నప్పటి రికాడ్డేన్స్‌ ఊసులన్నీ నాకెందుకిప్పుడు ఉన్నపాటున గుర్తుకొచ్చినట్టు. బాల్యంలోకి పాళంగా నేనెందుకు పయనమైపోయినట్టు. ఎందుకంటేను...

ఈ మధ్యనే విశాఖపట్నంలో తోటగరువు దుర్గాలమ్మ పండగ ఘనంగా జరిగింది. ఆ సమయంలో అనుపు సంబరానికి అటుగా వెళ్లవలిసివచ్చింది. అంభేరుపురం రికాడ్డేన్స్‌ బాబ్జీ ఏమో లైటింగ్‌ పనులు చేస్తూ అక్కడ కనిపించేడు. పెద్దవాడయిపోయేడు. బాగా లొంగిపోయేడు. ఒకప్పుడు రిషీకపూర్లా మెరిసినవాడు ఇప్పుడు ముసిలి కపూర్లా ఉప్పూపత్రీ లేనట్టయిపోయేడు. ఒంటికి ప్రాణం తప్ప మరేంటీ లేనట్టుగా అవుపించేడు. నేనెవరో తనకేం ఎరుక. నేనే గుర్తుపట్టేను. ఎలా ఉన్నావన్నాను. ఆశ్చర్యపోయేడు.



‘‘నా పేరు తమరికెలా తెలుసును’’ అనడిగేడు. చోడవరం భోగట్టాలు, రికాడ్డేన్స్‌ ఊసులూ గబాగబా చెప్పీసరికి గొప్పగా సంతోషపడిపోయేడు. ‘హమ్‌ కిసీకే కమ్‌ నహీ’ సినిమా పేరెత్తగానే కొత్త బలం వచ్చీసినట్టుగా అయిపోయేడు. అతని ముఖం అప్పటికప్పుడే వెలిగీసింది. ‘‘వొప్పుడో వొయిజాగొచ్చీసినా నాయినా. సీరియల్‌ సెట్లు బిగించుకుంతన్నాను. బతకాలిగదేటి’’ అన్నాడు.ఒకప్పుడు ఎందరెందరి పొగడ్తలో పొందినవాడు. ఈవేళ ఈకలు తీసిన కోడిలా అయిపోయేడు. నా మనసు బాధతో ఒక్క సిటం మూలిగింది. ఇంతలోనే అన్నాడు కదా..



‘‘వుప్పుడు రికాడ్డేన్సులెక్కడియి బావూ? ఏ ఇనాయికసవితి పండగ సూసినా, ఏ దసరా టెంట్ల కాడ ఎదికినా డేన్స్‌ బేబీ డేన్సింగులే. ఈ డేన్సింగులేసి గుంటల్లో ఒక్కుదానికీ ఒంటిమీద సరీగా గుడ్డముక్కలుండవు. కాలంనాడు మావంతా చెరీరం మొత్తానికీ గుడ్డలు సుట్టుకునీవోల్లం. ఆడీవోల్లం. అయినా గానీ పోలీసోల్లు కుదరదనీవోరు. మరా పోలీసుబావులు వుప్పుడేటయిపోయినారో తెల్దు. ఆల్లు మటికి ఏటి సేత్తార్లెండి. వుప్పుడు ఆడగుంట్లకి దయిద్రుగొట్టు బట్టలు తొడిగించీసీదీ అమ్మాబావులే గదేటి. ఒకనాడు తప్పుకాన్దాన్ని తప్పు అనీనారు. వుప్పుడు రాంగుని రైటంతన్నారు’’ అనీసేడు నిస్త్రాణగా. ఇలా అంనే, తనకిక సెలవిప్పించమన్నట్టుగా నావేపు చూసేడు. నాతో నిమిత్తం లేకుండా అటేపు తిరిగీసి దీపాల తోరణాలు కట్టుకోడంలో మునిగిపోయేడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top