ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Jan 22 2018 1:51 AM | Updated on Jan 22 2018 1:51 AM

YouTube hits this week - Sakshi

సమ్మక్క–సారక్క పాట
నిడివి : 1 ని. 2 సె.
హిట్స్‌: 6,38,767

తలవంచని మేడరాజు తనయి జాతర అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర మూడొద్దుల ముత్తయిదువుల కోయ జాతర ఏడువందల ఏండ్ల జానపదుల జాతర భూమిని చీల్చిన పచ్చని చెట్టు జాతర రాజును ఎదిరించిన ధిక్కార జాతర...

సమ్మక్క–సారక్క జాతర (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3) పురస్కరించుకుని డిజిటల్‌ చానల్‌ అయిన మైక్‌ టీవీ విడుదల చేసిన పాట ప్రోమో ప్రేక్షకులకు ఊపుతో పాటు జాతర పట్ల ఉద్వేగం కలిగించేలా ఉంది.  గీత రచయిత కందికొండ రచించిన ఈపాటని యాంకర్‌ మంగ్లీ అభినయించగా మేడారం చుట్టుపక్కల చిత్రీకరించిన విజువల్స్‌తో పాట ఆకట్టుకుంటోంది.

టీజర్‌కే ఐదు లక్షల హిట్స్‌ దాటిపోతే పూర్తి పాటకు ఇంకా ఆదరణ లభించే అవకాశం ఉంది. సమ్కక్క–సారలమ్మలకు తెలంగాణలో అందునా ముఖ్యంగా గిరిజన సంప్రదాయంలో ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. దాదాపు కోటిమందికి పైగా భక్తులు ఈ జాతరకు హాజరవుతారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరిస్తారు. విందు జరుపుకుంటారు. రెండేళ్లకొకసారి వచ్చే ఈ జాతర కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఛోటే ఛోటే పెగ్‌
నిడివి : 2 ని. 49 సె.
హిట్స్‌: 1,37,50,785

ఇద్దరబ్బాయిలు ఒకమ్మాయి కలిసి మందు మీద పాట పాడుకుంటే పార్టీకి ఇంతకుమించి డాన్స్‌ నంబర్‌ ఏం ఉంటుంది. యోయో హనీ సింగ్‌ మళ్లీ ప్రతాపం చూపాడు. ‘సోను కె టీటూ కే స్వీటీ’ సినిమా కోసం అతడు పాడిన ‘ఛోటే ఛోటే పెగ్‌’ పాట కోటి హిట్స్‌ను దాటేసింది. మందేద్దాం చిందేద్దాం అనే అర్థంలో సాగే ఈ పాటకు ఆదరణ జోరుగా ఉంది. టి–సిరిస్‌ నిర్మాణంలో తయారైన ఈ సినిమాకు ‘లవ్‌ రంజన్‌’ దర్శకుడు. కొత్త కుర్రాళ్లు నటించిన ఈ సినిమాలో ఇద్దరు స్నేహితులు ఉంటారు.

ఒకతను ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. కాని ఆ అమ్మాయి అతడికి సరి కాదని రెండో స్నేహితుడు ఆ పెళ్లిని చెడకొట్టడానికి నిశ్చయించుకుంటాడు. పెళ్లికూతురికి ఈ సంగతి తెలిసి ఎలా చెడగొడతావో చూద్దాం అని తనూ రంగంలో దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా పాటలన్నింటికీ యూ ట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తుంది. చాలామంది తలా ఒక పాటకు సంగీతం అందించారు. వీటిలో యోయో హనీ సింగ్‌ చేసిన ‘ఛోటే ఛోటే పెగ్‌’కు మంచి ఫాలోయింగ్‌ వచ్చింది.


హజ్బెండ్‌ కీ హౌస్‌ పార్టీ (భర్త గారి హోమ్‌ ఎలోన్‌)
నిడివి : 8 ని. 10 సె.
హిట్స్‌: 9,21,978

భార్య ఊరికెళితే భర్తకు స్వాతంత్య్రం వచ్చినట్టు– అతడు అండమాన్‌ జైల్లో ఉన్నా సరే. భార్య ఊరికెళితే పార్టీ చేసుకుందామనుకున్న భర్త చివరికి ఏమయ్యాడనేది ఈ ప్రహసనం. హాస్య, వ్యంగ్య వీడియోలు తయారు చేసే ‘టివిఎఫ్‌’ సంస్థ తయారు చేసిన మరో షార్ట్‌ ఫన్నీ వీడియో ‘హజ్బెండ్‌ కి హౌస్‌ పార్టీ’. ఈ షార్ట్‌ వీడియోలో భార్య ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళితే భర్త ఫ్రెండ్స్‌ని పార్టీకి పిలుస్తాడు. ఫోన్‌ చేసి విషయం కూపీ లాగిన భార్య భర్తకు ఆ పార్టీ చేసుకోవడానికి రకరకాల షరతులు పెడుతుంది. వచ్చిన వాళ్లే వంట పాత్రలు కడగాలంటుంది. సోఫాలు వాడకుండా కార్పెట్‌ మీద కూచోవాలంటుంది.

బెడ్‌రూమ్‌లో అడుగుపెట్టడానికి వీల్లేదంటుంది. తీరా పార్టీకి ఫ్రెండ్స్‌ వచ్చే సమయానికి అత్తగారు ఊడిపడుతుంది. హాయిగా మందు కొడుతూ ఎంజాయ్‌ చేయాల్సిన ఫ్రెండ్స్‌ అత్తగారి ఎదుట కూచుని బుద్ధిగా బోజనం చేయడంతో ఈ షార్ట్‌ వీడియో ముగుస్తుంది. నిధి బిష్త్, బిస్వపతి సర్కార్‌ నటించిన ఈ వీడియో ఆరు రోజుల్లోనే దాదాపు తొమ్మిది లక్షల హిట్స్‌కు చేరుకుంది. ఇది డైలాగ్‌ ఆధారిత హాస్యం. సరదాగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement