ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Youtube hits this week - Sakshi

జీరో– ఈద్‌ టీజర్‌
నిడివి 1 ని. 21 సె. ,హిట్స్‌ 2,28,63,542
ఏమైనా మనోళ్లు చాలా గొప్పోళ్లోయి అన బుద్ధేస్తోంది ఈ టీజర్‌ చూస్తే. దాదాపు 30 ఏళ్ల క్రితమే మరుగుజ్జుగా కమలహాసన్‌ నటించాడు– ‘విచిత్ర సహోదరులు’లో. అప్పట్లో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ లేవు. గ్రాఫిక్స్‌ లేవు. క్రియేటివ్‌ సుప్రమసీతో కమలహాసన్, దర్శకుడు సింగీతం సాధించిన ఫీట్‌ అది. ఇన్నాళ్ల తర్వాత షారుక్‌ అలాంటి ప్రయత్నమే చేశాడు. కాని నిరాశ కలిగించే స్థాయిలో. మరుగుజ్జు కాకుండా పొట్టివాడిగా ఈ సినిమాలో షారూక్‌ నటించినట్టుగా అనిపిస్తోంది.

అయితే పొట్టివాడికి ఒక బాడీ లాంగ్వేజ్‌ ఉంటుంది. అది టీజర్‌లో కనిపించలేదు. పైగా స్వాభావికంగా కాకుండా గ్రాఫిక్స్‌ ద్వారా ఇతన్ని పొట్టివాడిగా చూపించారని అర్థమైపోతోంది. షారుక్‌ ఏకంగా సల్మాన్‌ ఖాన్‌నే రంగంలో దింపి టీజర్‌ విడుదల చేశాడు. సహజంగానే ఈ టీజర్‌ విపరీతమైన రెస్పాన్స్‌ పొందుతోంది. కాని సీరియస్‌ సినీ ప్రేక్షకులు మాత్రం సినిమా విడుదలయ్యేకే షారుక్‌కు మార్కులు వేయాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటారన్నది మాత్రం ఈ టీజర్‌ చూస్తే ఖాయంగా అనిపిస్తున్నది. దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ పాయ్‌ ‘తను వెడ్స్‌ మను’ వంటి హిట్స్‌ ఇచ్చాడు కనుక అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం.

ధడక్‌ – ట్రైలర్‌
నిడివి 3 ని. 3 సె. ,హిట్స్‌ 3,34,21,021
అతి తక్కువ బడ్జెట్‌తో మరాఠీలో సంచలనం సృష్టించిన ప్రేమకథ– ‘సైరట్‌’ (గట్టిగా చెప్పు)కు రీమేక్‌ ఇది. ‘సైరట్‌’ పరువు హత్యల ఆధారంగా తీసిన సినిమా. డబ్బు, కులం ఉన్న అమ్మాయి పేదరికం, ‘తక్కువ కులం’ ఉన్న అబ్బాయిని ప్రేమిస్తే ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి, చివరకు ఆ ప్రేమ ఏమైందనేది సహజమైన ప్రవర్తనల ద్వారా గుర్తుపట్టే సమాజ పోకడల ద్వారా దర్శకుడు కథను అల్లి విజయం సాధించాడు. రీమేక్‌లో శ్రీదేవి కుమార్తె జాహ్నవి నటించింది.

శ్రీదేవి తన కుమార్తెను లాంచ్‌ చేయడానికి చాలా కాలం ఆలోచించి ఎంచుకున్న సినిమా ఇది. ట్రైలర్‌లో శ్రీదేవి నిర్ణయం సరైందిగా అనిపించే సంకేతాలు ఉన్నాయి. కళ్లతో నటిస్తూ తల్లిని గుర్తు చేసే ప్రయత్నం చేసింది జాహ్నవి. ఇక హీరోగా చేసిన కుర్రాడు ఇషాన్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఇతను హీరో షాహిద్‌ కపూర్‌ సవతి సోదరుడు. ధర్మ ప్రొడక్షన్స్‌ కింద కరణ్‌జొహర్‌ ఈ సినిమాను నిర్మించాడు. ‘బదరీనాథ్‌ కీ దుల్హనియా’ వంటి హిట్‌ ఇచ్చిన యువ దర్శకుడు శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తే శ్రీదేవి కోసం సంతోషము.. ఇంత ఘన విజయం సాధిస్తే చూడటానికి శ్రీదేవి లేదన్న బాధ ఆమె అభిమానులకు తప్పదు.

ఈ నగరానికి ఏమైంది – ట్రైలర్‌
నిడివి 1 ని. 56 సె.,హిట్స్‌ 13,61,067
వెబ్‌ సిరీస్‌లో ‘టీవీఎఫ్‌’ (ది వైరల్‌ ఫీవర్‌) చానల్‌ హిందీలో ఫన్‌ సిరీస్‌ చేసింది. నలుగురైదుగురు స్నేహితులు కలిసి ఒక ప్రహసనాన్ని చాలా సహజమైన స్వభావాలతో డ్రామా లేకుండా ఈ కాలపు వ్యవహారికాలతో ఆకట్టుకోవడం ఈ సిరీస్‌ లక్ష్యం. వీటికి భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. ‘పెళ్లిచూపులు’తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఆ ప్రభావంలో ఉన్నాడా అనిపిస్తుంది ఈ ట్రైలర్‌ చూస్తే.

నలుగురు స్నేహితుల జీవితాలలో అతలాకుతలమూ లేదా గందరగోళమూ లేదా కలగాపులగమూ జరిగిన కొన్ని ఘటనల సమాహారమే ‘ఈ నగరానికి ఏమైంది’ కథ కావచ్చు. తమిళంలో ‘వా క్వార్టర్‌ కటింగ్‌’ అనే సినిమా ఉంది. ఆ తెల్లవారి గల్ఫ్‌ వెళ్లాలనుకున్న స్నేహితుడు ఆ రాత్రి నలుగురు మిత్రులతో మందు కొట్టాలనుకుంటాడు. కాని ఆ రాత్రి మందు దొరకదు. మందు కోసం ఆ నలుగురు ఎటువంటి ఘనకార్యాలకు పాల్పడ్డారనేది కథ. దాని ప్రభావం దీని మీద ఉన్నట్టుంది. ఏమైనా కుతూహలం రేపుతున్న ట్రైలర్‌. నటీనటులంతా కొత్తవాళ్లే. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top