ఈ వారం యూట్యూబ్‌ హిట్స్‌ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్‌

Feb 5 2018 12:58 AM | Updated on Feb 5 2018 12:58 AM

YouTube hits this week - Sakshi

సమ్మక్క సారక్క– కామెడీ షో
నిడివి: 6 ని. 37 సె.; హిట్స్‌: 13,11,650

‘మై విలేజ్‌ షో’ యూ ట్యూబ్‌ చానల్‌ ద్వారా ఇద్దరు తెలంగాణ వ్యక్తులు ఫేమ్‌లోకి వచ్చారు. ఒకరు గంగవ్వ. మరొకరు రాజు. వీళ్లిద్దరూ తల్లీకొడుకులుగా చేసే వీడియో షోస్‌కు పెద్ద ఆదరణ ఉంది. శ్రీరామ్‌ శ్రీకాంత్‌ అనే ఔత్సాహికుడు ఈ షోస్‌కు రచన, దర్శకత్వం నిర్వహిస్తుంటాడు. కరీంనగర్‌ సమీపంలోని ‘లంబాడి పల్లి’ అనే ఊరిలో గంగవ్వ, రాజు పాత్రల మధ్య సహజంగా జరిగే హాస్య సంభాషణలు, ప్రహసనాలు ఈ చానెల్‌లో ఉంటాయి.

తాజాగా ‘సమ్మక్క సారక్క జాతర’ పేరున ఒక వీడియో విడుదల చేశారు. అమాయకురాలైన తల్లి, కొంచెం చదివి ఫ్యాషన్‌కు పోయే కొడుకు సమ్మక్క సారక్క జాతర కోసం ఎలా సిద్ధమయ్యారనేది కంటెంట్‌. అచ్చతెనుగు తెలంగాణ భాషలో సాగే ఈ సంభాషణలు వినడానికి చూడటానికి ముచ్చటగా, హాస్యం వచ్చేలా ఉంటాయి. పెట్టిన నాలుగు రోజులకే 11 లక్షల హిట్స్‌ సాధించిన వీడియో ఇది.


బ్రేకప్‌ సైకిల్‌ – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి: 5 ని. 45 సె.; హిట్స్‌: 11,08,100

యూ ట్యూబ్‌ చానెల్స్‌ ద్వారా పాపులర్‌ అయిన ‘ఫన్నీ గర్ల్‌’ ప్రాజక్త కోలి తాజా వీడియో ‘బ్రేకప్‌ సైకిల్‌’. ఇవాళ రేపు కుర్రకారు మధ్య టీ తాగినంత సామాన్యంగా బ్రేకప్స్‌ అయిపోతున్నాయి. బ్రేకప్‌ పార్టీలు కూడా జరుగుతున్నాయి. అలా బ్రేకప్‌ అయిన ఒక కుర్రాడు, బ్రేకప్‌ అయిన మరో అమ్మాయి కలిసి కాసేపు కబుర్లు చెప్పుకోవడం ఈ వీడియో. ‘నా గర్ల్‌ఫ్రెండ్‌ పేరు ఉష. కాని బతుకంతా చీకటి చేసి వెళ్లిపోయింది’ అని అతడంటే ‘నా బోయ్‌ఫ్రెండ్‌ పేరు ప్రకాశ్‌. అతను కూడా అంతే’ అని ఆమె అంటుంది.

నా గర్ల్‌ఫ్రెండ్‌ కోసం అన్ని చేశాను అని ఇతడంటే నా బోయ్‌ఫ్రెండ్‌ కోసం ఇన్ని చేశాను అని ఈ అమ్మాయి అంటుంది. చివరకు  కుర్రాడు బిల్‌ పే చేస్తాడు. కాని మగాడి బుద్ధి ఊరికే ఉండదు కదా. కలిసి టీ తాగిన పాపానికి ఫోన్‌ నంబర్‌ అడుగుతాడు. ఆ అమ్మాయి ఇస్తుంది. అతడు హుషారుగా తిరిగి వచ్చి మరసటి రోజు ఫోన్‌ చేస్తాడు. ట్విస్ట్‌ ఏమిటంటే అది రాంగ్‌ నంబర్‌. సరదాగా ఉన్న ఈ వీడియో పోస్ట్‌ అయిన నాలుగు రోజులకు పది లక్షల హిట్స్‌ దాటిపోయింది.


బియాండ్‌ ది క్లౌడ్స్‌ – ట్రైలర్‌
నిడివి: 2 ని. 15 సె.; హిట్స్‌: 53,05,675

స్లమ్స్‌లో ఉండేవాళ్ల జీవితంపై పారలల్‌ సినిమాలు వచ్చాయి కానీ సీరియస్‌ కమర్షియల్‌ సినిమాలు రాలేదు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ తీసినది మన దర్శకుడు కాదన్న సంగతి మనకు తెలిసిందే. మన స్లమ్స్‌లో ఉన్నవాళ్ల జీవితాలను బిగువుగా చెప్పడానికి మరో పరాయి దర్శకుడు వచ్చాడు. మజిద్‌ మాజిది. సుప్రసిద్ధ ఇరాన్‌ దర్శకుడైన మజిద్‌ మాజిది తన ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవన్‌’, ‘ది సాంగ్‌ ఆఫ్‌ స్పారోస్‌’ వంటి గొప్ప సినిమాలు తీసి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు.

అతడు ఇప్పుడు మొదటిసారిగా హిందీలో ‘బియాండ్‌ ది క్లౌడ్స్‌’ సినిమాతో రానున్నాడు. స్లమ్స్‌లో డ్రగ్స్‌ను చేరవేసే ఒక కుర్రాడి కథ ఇది. అతడు, అతడి ప్రియురాలు, కుటుంబం ఒక క్రైమ్‌లో ఎలా ఇరుక్కున్నారన్నది కథ. ఏ.ఆర్‌. రహెమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందించాడు. విశాల్‌ భరద్వాజ్‌ మాటలు రాశాడు. కొత్త నటీనటులు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ యూ ట్యూబ్‌లో ఈ వారం విడుదలయ్యి కుతూహలం రేపుతోంది.


చమక్‌ చమక్‌ చామ్‌ – రీమిక్స్‌
నిడివి: 5 ని. 58 సె.; హిట్స్‌: 16,08,006

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ తన మేనమామ పాటలకు మెల్లగా హక్కుదారుడవుతున్నాడు. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ కంటే సాయి ధరమ్‌ తేజ్‌ ఎక్కువగా చిరంజీవి పాటలను రీమిక్స్‌ చేసి తన సినిమాలలో వాడుతున్నాడు. గతంలో అతడు ‘అందం హిందోళం’, ‘గువ్వా గోరింకతో’ పాటలను రీమిక్స్‌ చేశాడు. తాజాగా ‘కొండవీటి దొంగ’లోని ‘చమక్‌ చమక్‌చామ్‌’ పాటతో ‘ఇంటిలిజెంట్‌’ సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నాడు.

వివి వినాయక్‌ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నిర్మితమైన ఈ సినిమాలో సాయి ధరమ్‌తేజ్‌ మాస్‌ క్యారెక్టర్‌ చేశాడని వినికిడి. మెగా అభిమానులను ఆకర్షించడంలో భాగంగా ‘చమక్‌ చమక్‌చామ్‌’ పాటను ఇందులో ఉపయోగించి ఉండొచ్చు. ఇళయరాజా చేసిన ఈ పాట గతంలో పెద్ద హిట్‌ అయ్యింది. స్టెప్స్‌ వేయడంలో చిరంజీవి పోలికలున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ పాటనూ పండిస్తాడనే ఆశిద్దాం. యూట్యూబ్‌లో ఈ పాట 14 లక్షల హిట్స్‌కు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement