నా నిర్ణయం తప్పా? | women empowerment : Counseling3 | Sakshi
Sakshi News home page

నా నిర్ణయం తప్పా?

Mar 3 2018 12:16 AM | Updated on Mar 3 2018 11:24 AM

women empowerment :  Counseling3 - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పాపాయి పుట్టినప్పుడు ఉద్యోగం మానేశాను. అప్పటికీ తొమ్మిదో నెల వరకు డ్యూటీకి వెళ్లాను. ఇప్పుడు పాపాయికి తొమ్మిది నెలలు. పాప కొంచెం పెద్దయిన తర్వాత మళ్లీ చేరవచ్చని అతడే చెప్పాడు కూడా. ఇప్పుడు నేరుగా ఏమీ అనరు. కానీ ‘ఒక్కడి జీతంతో ఎన్ని ఖర్చులని భరిస్తాడు’ అని అత్తగారు, ‘పాపాయి ఖర్చులు వచ్చాయిగా, అందరికీ అన్నీ అమరాలంటే మీ పుట్టింటిలో పోసిన రాశుల్లో ఒకటి తేవాల్సింది’ అని భర్త సూటిపోటి మాటలంటున్నారు. నా బర్త్‌డేకి డ్రస్‌ కొనడానికే ఇదంతా. తల్లీ కొడుకు ముఖాలు గుర్తుకు వస్తుంటే కొత్త డ్రస్‌ వేసుకోవాలనే కోరిక కూడా చచ్చిపోయింది. ‘నేను ఉద్యోగం మానేసి తప్పు చేశాను’ అనుకోని రోజు ఉండడం లేదు. 
– స్వాతి, చిత్తూరు

ఫ్యామిలీ కోర్టుకు వచ్చే కేసుల్లో కొంతమంది వాదన విచిత్రంగా ఉంటుంది. పిల్లలను పెంచాల్సిన బాధ్యత పూర్తిగా ఆడవాళ్లదే అన్నట్లుంటారు భర్తలు. అదే వారి మధ్య వివాదానికి కారణమవుతుంటుంది. పిల్లల్ని పెంచడంలో ఈక్వల్‌షేరింగ్‌ ఉండాలనే అవగాహనకు తీసుకురావడానికి చాలా ఎక్సర్‌సైజ్‌ చేయాల్సి ఉంటుంది. పిల్లల పెంపకంలో మగవాళ్లు కూడా సమాన బాధ్యతను పంచుకోవాలి.
ఇక ఆడవాళ్లు ఆర్థిక వెసులుబాటును కాపాడుకోవాలి. పిల్లల్ని కని, పెంచడానికి తల్లి ఉద్యోగంలో విరామం తీసుకోవాల్సిందే. అలాంటప్పుడు కొన్ని అన్‌ఆర్గనైజ్‌డ్‌ జాబ్స్‌లో ఆమెకి జీతం రాదు. అలాంటప్పుడు స్వాతి విషయంలో జరిగినట్లే డ్రెస్‌ కొనుక్కోవాలనిపించినా కూడా చేతిలో డబ్బు ఉండదు. తనకు జీతం వస్తున్న రోజుల్లో సొంతానికి సేవ్‌ చేసుకుంటే ఈ సమస్య ఉండదు. ఆర్థిక వెసులుబాటు ఉన్న అమ్మాయి చాలా సమస్యలను గోరంతలు కొండంతలు కాకముందే తనకు తానుగా చక్కదిద్దుకోగలుగుతుంది.

కొన్ని సందర్భాలలో ఆర్థిక స్వావలంబన అవసరానికి మించి ఉండి, స్వీయ క్రమశిక్షణ లేకపోతే ఆ డబ్బే వివాదాలకు కారణమవుతుంటుంది. అలాంటిది ఒక్కటి కనిపిస్తే చాలు... ఇక ఆ అమ్మాయి వైపే వేలెత్తి చూపిస్తూ ‘అమ్మాయిల చేతిలో డబ్బుంటే ఇలాగే ఉంటుంది’ అనేస్తారు. ఆర్థిక స్వావలంబన కారణంగా ఎంత మంది మహిళలు కుటుంబాలను తీర్చి దిద్దుకుంటున్నారనే విషయాలను పట్టించుకోరు. ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు కూడా. 
- నిశ్చల సిద్ధారెడ్డి లాయర్, ఫ్యామిలీ కౌన్సెలర్‌

మాకు పంపండి: ఒక మహిళగా మీరు గృహహింస వంటి వేధింపులకు గానీ, సామాజికంగా వివక్షకుగానీ లేదా సంబంధిత ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యను రాసి మాకు మెయిల్‌ ద్వారా పంపించండి.ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మీకు తగిన సూచనలు / సలహాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు మీ ప్రశ్నలను పంపాల్సిన
మెయిల్‌ ఐడీ :nenusakthiquestions@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement