వరుడి వేట.. అమ్మకు పెళ్లి

Woman Posts Matrimonial Ad For 56 Year Old Mom Inspired By Aastha Varma - Sakshi

పెద్దవాళ్లకు పిల్లలు పెళ్లి చేయడం అనే కాన్సెప్ట్‌ని ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో చూశాం. ఆ రీల్‌ లైఫ్‌లో కొడుకు తన తండ్రి కోసం వధువును వెతుకుతాడు. ఈ రియల్‌ లైఫ్‌లో పిల్లలు కుదిర్చిన పెళ్లిళ్లన్నీ అమ్మల కోసమే.

‘‘మా అమ్మకు అందమైన యాభై ఏళ్ల వరుడి కోసం అన్వేషిస్తున్నాం. వరుడు శాకాహారి అయి ఉండాలి. మద్యం అలవాటు ఉండకూడదు. జీవితంలో చక్కగా ఎదిగిన వ్యక్తి అయి ఉండాలి’’ – ఇది ఆస్థా వర్మ అనే ఢిల్లీకి చెందిన లా స్టూడెంట్‌ పెట్టిన ట్వీట్‌. ఈ ట్వీట్‌ తోపాటు తల్లితో తానున్న ఫొటో కూడా పెట్టింది ఆస్థా వర్మ. ఈ ట్వీట్‌కి 33 వేల లైక్‌లు వచ్చాయి. ఏడు వేల రీ ట్వీట్‌లు వచ్చాయి. వారిలో ఎక్కువ మంది ఆమె ప్రయత్నాన్ని హర్షించారు. కొద్దిమంది మాత్రం ‘ఇదేం పని’ అని అన్నారు. మరికొందరైతే ఏకంగా ట్రోలింగ్‌కి దిగారు. ట్విట్టర్‌లో తనకు వ్యతిరేకంగా వచ్చిన రెస్పాన్స్‌కు ఆస్థా వర్మ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ‘‘మా అమ్మ టీచర్‌. ఉన్నత విద్యావంతురాలు. ఎక్కువమంది నా ప్రయత్నాన్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. మా అమ్మకు దూరమైన ప్రేమను ఆమెకు తిరిగి అందివ్వాలనుకుంటున్నాను’’ అని తిరిగి ట్వీట్‌ చేసింది.

గోకుల్‌ శ్రీధర్‌ది కేరళ, కొల్లాం జిల్లా. గోకుల్‌ తల్లి మినీ అయ్యప్పన్‌ది విషాదభరితమైన వైవాహిక జీవితం. గోకుల్‌ పదవ తరగతికి వచ్చే వరకు తన తండ్రి తరచూ తల్లిని కొట్టడం, తల్లి మౌనంగా భరించడం చూస్తూనే ఉన్నాడు. ఓ రోజు తండ్రి కొట్టిన దెబ్బలకు తల్లి నుదురు చిట్లి రక్తం కారడం చూసిన గోకుల్‌ ‘‘ఎందుకమ్మా మౌనంగా భరిస్తున్నావ్‌’’ అని అడిగాడు. ‘‘నీ కోసమే’’ అంటూ కొడుకును దగ్గరకు తీసుకుంది ఆమె. ‘‘మనిద్దరం మన కష్టంతో బతుకుదాం రామ్మా’’ అని తల్లిని ఇంటి నుంచి తీసుకొచ్చేశాడు గోకుల్‌. మినీ కొల్లాంలో లైబ్రేరియన్‌గా చేరింది. కొన్నేళ్లకు గోకుల్‌ పైచదువుల కోసం తల్లిని వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు ‘‘అమ్మా! కష్టాల కడలి నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాను. ఇప్పుడు నిన్ను ఒంటరిగా వదిలి దూరంగా వెళ్తున్నాను. నా చదువు పూర్తయ్యే వరకు నాకు టైమివ్వు. జీవితంలో నువ్వు కోల్పోయిన ప్రేమను, నిన్ను ప్రేమించే వ్యక్తిని నీ కోసం వెదకి తెస్తాను’’ అని మాటిచ్చాడు. కొడుకు మాటలకు నవ్వి ఊరుకుంది మినీ.ఆ సంగతి మర్చిపోయింది కూడా. అయితే గోకుల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయిన తరవాత తన పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి అయోమయంలో పడిందామె.

ఒంటరి జీవితానికి అలవాటు పడుతున్నానని, తనను ఇలాగే జీవించనివ్వమని చెప్పింది. తల్లిని కన్విన్స్‌ చేయడంతోపాటు ఆమె పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తిని వెతికి పెట్టాడు గోకుల్‌. తల్లి కోసం వెతికిన పెళ్లి కొడుకు పేరు కె. వేణు. ఆర్మీలో కల్నల్‌గా రిటైరయ్యారు. భార్య మరణించింది. ఒక కొడుకు, కూతురు. వాళ్లు జీవితాల్లో స్థిరపడ్డారు. గోకుల్‌ చేసిన ఈ పెళ్లిని సోషల్‌ మీడియాలో 43 వేల మంది లైక్‌ చేశారు. గుర్‌గావ్‌కి చెందిన సంహిత అగర్వాల్‌ తన తల్లి గీతకు రెండేళ్ల కిందట ఇలాగే పెళ్లి చేసింది. నాలుగు వందల మంది అతిథులతో వైభవంగా పెళ్లి వేడుక నిర్వహించింది సంహిత. అలాగే భర్తను కోల్పోయిన తారకు ఆమె కొడుకు సుశాంత్, కోడలు నేహ కలిసి పెళ్లి ఖాయం చేశారు. ‘‘యాభై ఏళ్ల వయసులో ఒంటరితనాన్ని భరించడం చాలా కష్టమని, స్నేహం, ప్రేమ లేకుండా రోజు గడపడం దుర్భరంగా ఉంటుందని’ ఆమెకు నచ్చచెప్పి ఒప్పించారు. సుశాంత్‌ తన తల్లి కోసం ఓఎన్‌జీసీలో ఉద్యోగం చేస్తున్న 57 ఏళ్ల నాథూభాయ్‌ పటేల్‌తో ఇటీవలే పెళ్లి కుదిర్చాడు. గోకుల్, సుశాంత్, సంహిత అమ్మ కోసం వరుణ్ని వెతికారు. ఇప్పుడు తాజాగా ఆస్థావర్మ కూడా వాళ్ల అమ్మ కోసం వరుణ్ని వెతికే పనిలో పడింది. జీవితం విలువ తెలిసిన ఈ పిల్లలు కొత్త ట్రెండ్‌ని సెట్‌ చేస్తున్నారు. సమాజానికి కొత్త విలువల పాఠాలు చెబుతున్నారు.

– మను

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top