వియ్‌ ది విమెన్‌

We are the women - Sakshi

నేప్‌క్వీన్‌
వయసుకు తగిన పనే అయినప్పటికీ, పదిహేడేళ్ల అమికా జార్జి తన వయసుకు మించిన కార్యాన్నే భుజాన వేసుకున్నారు! లండన్‌లో చదువుకుంటున్న ఈ కేరళ అమ్మాయిని.. టీవీలో యథాలాపంగా కనిపించిన వార్త ఒకటి ‘ఫ్రీ పీరియడ్స్‌’ అనే ఉద్యమానికి పురికొల్పేలా చేసింది! ఇంగ్లండ్‌కు ఉత్తరాన ఉన్న లీడ్స్‌ నగరంలోని అనేక నిరుపేద కుటుంబాలలో శానిటరీ నేప్‌కిన్స్‌ కొనే స్తోమత లేక, నెలకు కనీసం నాలుగైదు రోజులు స్కూలు మానేస్తున్న పదీ, ఆపై వయసుగల బాలికలపై వచ్చిన ప్రత్యేక వార్తాకథనం అది.

 అంతగా ఆ వార్త తనను కదిలించిన కొన్నాళ్ల తర్వాత అమికా జార్జి ‘ఫ్రీ పీరియడ్స్‌’ ఉద్యమాన్ని ప్రారంభించి, లక్షా ముప్పైవేల సంతకాలు సేకరించి గత నెలలో బ్రిటన్‌ ప్రభుత్వ దృష్టికి ఈ ‘నెలసరి పేదరికాన్ని’ తీసుకెళ్లారు. త్వరలోనే ఆమె బ్రిటన్‌ విద్యాశాఖ మంత్రి జస్టీన్‌ గ్రీనింగ్‌ని కూడా కలిసి, బాలికల చదువుకు ఆటంకం కలిగిస్తున్న ‘పీరియడ్‌ పావర్టీ’ని నిర్మూలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించబోతున్నారు! స్త్రీల అసౌకర్యాలను గుర్తించడం కూడా స్త్రీల సదుపాయాల కల్పనలో ఒక భాగమేనని అంత పెద్ద ప్రభుత్వానికి ఇంత చిన్న పిల్ల గుర్తుచేయవలసి వచ్చింది!

జ్ఞాపకాల రచయిత్రి
బెర్లిన్‌లోని పార్లమెంటు భవనం ‘రీచ్‌స్టాగ్‌’ గోడలపై రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రష్యా సైనికుల భావోద్వేగ లేఖనాలు ఇంకా అలాగే పదిలంగా ఉన్నాయి. జర్మనీని ఓడించే క్రమంలో రీచ్‌స్టాగ్‌లో భవనంలోకి ప్రవేశించిన రష్యా సైనికులు అక్కడి గోడల నిండా జర్మనీ దురహంకారంపై నిప్పులు చెరుగుతూ ఆగ్రహావేశాలతో కూడిన వ్యాఖ్యలను లిఖించారు. 

‘నీకు జరగవలసిందే జరిగింది’, ‘ఏ విత్తనాలైతే నువ్వు వేశావో, అవే విత్తనాలు నీకోసం మొలకెత్తాయి’, ‘లక్షల కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన జర్మనీ ఇప్పుడు తన కుటుంబాన్ని కోల్పోయి దిగాలుగా కూర్చోబోతోంది’.. ఇలా వివిధ ఉద్వేగాలు అక్షరాలుగా గోడలకెక్కాయి. యుద్ధం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు రీచ్‌స్టాగ్‌ భవనానికి ఎన్ని మెరుగులు దిద్దినప్పటికీ గోడలపై రాతల రూపంలో ఉన్న ఆనాటి జ్ఞాపకాలు చెరిగిపోకుండా జాగ్రత్త పడ్డాయి. 

ఇప్పుడు వీటన్నిటినీ కెరిన్‌ ఫెలిక్స్‌ అనే 68 ఏళ్ల జర్మన్‌ మహిళ పుస్తక రూపంలోకి తేబోతున్నారు! ఆ కుడ్య లేఖనాలన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి, అనువదించి, వాటికి ఓ ముప్పై వరకు రష్యన్‌ సైనికుల కథలను ఆమె జోడిస్తోంది. ఈ గెలుపు ఓటముల ప్రపంచంలో జ్ఞాపకాలు, గుణపాఠాలు మిగిలేది ఎప్పటికైనా మహిళల వల్లనే. 

ఏం చదివారు?
ఆడపిల్లలు చదువుకు వ్యాల్యూ ఇస్తారు. శ్రద్ధగా చదువుతారు.  మంచి మార్కులు సంపాదిస్తారు. ఇంకా చదివిస్తే మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంటారు. మనమే చదివించం! మన బాధ్యతలు మనకు ఉంటాయి కదా, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయాలని! మన భయాలు మనకు ఉంటాయి కదా, ఆడపిల్లను ఎక్కువ చదివిస్తే, అబ్బాయి దొరకడం కష్టమౌతుందని! (మన బాధ్యతలు నిజమే కానీ, మన భయాలు నిజమైనవి కావు. అమ్మాయిలను చక్కగా చదివించి చూడండి.. భయాలు ఎగిరిపోయి, బాధ్యతలు తేలికైపోతాయి).

 మన అమ్మాయిలే కాదు, బాగా డబ్బు, అందం, సొసైటీలో పలుకుబడి ఉన్న సినీ సెలబ్రిటీ కుటుంబాలలోని ఆడపిల్లలు కూడా చదువునే ఎక్కువగా ఇష్టపడతారు. కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చాన్స్‌ వస్తే, ముందు స్టడీస్‌ ఫినిష్‌ అవ్వాలి అంటారు. సొసైటీలో కూడా చదువుకున్న అమ్మాయిలంటే రెస్పెక్ట్‌ ఉంది. అందుకే చూడండి, సినిమాల్లో ఎంత పెద్ద స్టార్‌ అయినా, ఏదో ఒక ఇంటర్వ్యూలో ‘ఏం చదువుకున్నారు?’ అని ప్రశ్న వచ్చేస్తుంది. ప్రస్తుతం నయనతార మన తెలుగు స్క్రీన్‌ మీద ఉన్నారు. ఆమెతో పాటు, మరికొందరు సినీ తారలు ఏం చదువుకుని, వెండితెరపైకి వచ్చారో ఒక లుక్కేద్దాం. వాళ్ల బుక్కుల్ని తిరగేద్దాం. 

నయనతార బి.ఎ. ఇంగ్లిష్‌ లిటరేచర్, అనుష్క బి.సి.ఎ. (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), సమంత బి.కాం., తమన్నా  బి.ఎ., త్రిష బి.బి.ఎ. (బ్యాచిలర్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌), కాజల్‌ మాస్‌ మీడియాలో బ్యాచిలర్స్‌ డిగ్రీ , రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాస్‌ మీడియాలో బ్యాచిలర్స్‌ డిగ్రీ , శ్రియ బి.ఎ. (లిటరేచర్‌), తాప్సీ బి.టెక్‌. కంప్యూటర్‌ సైన్స్, అమలా పాల్‌ బి.ఎ. (కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌), నిత్యా మీనన్‌ జర్నలిజంలో గ్రాడ్యుయేషన్, సాయి పల్లవి ఎం.బి.బి.ఎస్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top