కునప జలానికి కేరళ పెద్దపీట

Vrikshayurveda Organic Farming - Sakshi

‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్న కునపజలం ద్రావణాన్ని సేంద్రియ సాగులో వినియోగించమని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సిఫారసు చేస్తున్నది. గత ఏడాదిన్నర కాలంగా దీనిపై అధ్యయనం చేసి, సంతృప్తికరమైన ఫలితాలు పొందిన తర్వాత కేరళ శాస్త్రవేత్తలు దీని వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల గ్రేటర్‌ నోయిడాలో ముగిసిన ప్రపంచ సేంద్రియ మహాసభలో ఏర్పాటైన కేరళ ప్రభుత్వ స్టాల్‌ను సందర్శించిన వారికి కునపజలం గురించి ప్రత్యేకంగా వివరించడం విశేషం. కునప జలాన్ని రెండు పద్ధతుల్లో తయారు చేయవచ్చు. మాంసం/గుడ్లతో ‘నాన్‌ హెర్బల్‌ కునపజలం’.. పశువులు తినని కలుపు మొక్కల ఆకులతో ‘హెర్బల్‌ కునపజలం’ తయారు చేసి వాడుకోవచ్చని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది...

నాన్‌ హెర్బల్‌ కునపజలం
కావలసిన పదార్థాలు: మాంసం/చేపలు : 2 కిలోలు లేదా 25 కోడిగుడ్లు; ఎముకల పొడి : 1 కిలో; వరి పొట్టు : 1 కిలో; కొబ్బరి చెక్క : 1 కిలో; మొలకెత్తిన మినుములు: అర కిలో (మినుముల మొలకలు దొరక్కపోతే పెసల మొలకలు వాడొచ్చు); నీరు : 85 లీటర్లు; తాజా ఆవు పేడ (దేశీ ఆవు పేడ శ్రేష్టం) : 10 కిలోలు; దేశీ ఆవు మూత్రం : 15 లీటర్లు; తేనె : పావు కిలో; నెయ్యి : పావు కిలో ; బెల్లం : 2 కిలోలు; పాలు : 1 లీటరు

తయారీ పద్ధతి : ఐదు లీటర్ల నీటిలో మాంసం లేదా చేపలు లేదా కోడిగుడ్లు + ఎముకల పొడి + వరి పొట్టు + కొబ్బరి చెక్క + మొలకెత్తిన మినుములను వేసి ఉడకబెట్టాలి. ఇనప పాత్రను, ఇనప గంటెను వాడాలి. నీరు సగానికి తగ్గే వరకు ఉడకబెట్టాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దింపి, చల్లారబెట్టాలి. చల్లారిన ద్రావణాన్ని ఒక ప్లాస్టిక్‌ డ్రమ్ములోకి పోయాలి. తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం, తేనె, బెల్లం, నెయ్యి, పాలతోపాటు మిగిలిన 80 లీటర్ల నీటిని కూడా ప్లాస్టిక్‌ డ్రమ్ములో పోయాలి. ఈ ద్రావణాన్ని వెదురు కర్రతో రోజుకు మూడు సార్లు మూడేసి నిమిషాల పాటు కలియతిప్పండి. సవ్యదిశలో కొంత సేపు, వ్యతిరేక దిశలో మరికొంత సేపు తిప్పాలి. ఇలా 15 రోజులు ఇలా కలియతిప్పిన తర్వాత ‘నాన్‌ హెర్బల్‌ కునపజలం’ వాడకానికి సిద్ధమవుతుంది. లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల కునపజలాన్ని కలిపి.. ఆ ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేయాలి.

ప్రయోజనాలు: దీన్ని చల్లిన తర్వాత పంట మొక్కలకు, చెట్లకు వేరు వ్యవస్థ పటిష్టమవుతుంది. కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఆడ పూల సంఖ్య పెరుగుతుంది. పండ్ల చెట్లపై పిచికారీ చేస్తే పండ్ల రుచి పెరుగుతుంది. పండ్లు, కూరగాయల రుచి, వాసన, నాణ్యత మెరుగుపడతాయి. పూల రంగు మెరుగై, ఆకర్షణీయంగా అవుతాయి.
ఉపయోగించేదెలా? : పంటలు పిలక దశలో, పూత దశలో లీటరు నీటికి 50 ఎం.ఎల్‌. కునపజలాన్ని కలిపి పిచికారీ చేయాలి. తోటలపై ఇదే మోతాదులో ఏడాదికి ఆరుసార్లు పిచికారీ చేయాలి.

హెర్బల్‌ కునపజలం
పశువులు తినని జాతి మొక్కల ఆకులతో హెర్బల్‌ కునపజలం తయారు చేసుకోవాలి. ఆకులు తుంచినప్పుడు పాలు కారని జాతులు, గడ్డి జాతికి చెందని మొక్కల ఆకులు వాడాలి. వావిలి, రేల, కానుగ, అడ్డసరం, టక్కలి, కుక్క తులసి (అడవి తులసి), గాలి గోరింత, గిరిపుష్టం (గ్లైరిసీడియా) తదితర జాతుల మొక్కల ఆకులు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు : ఆకులు  : 20 కిలోలు; దేశీ ఆవు తాజా పేడ : 10 కిలోలు; మొలకెత్తిన మినుములు : 2 కిలోలు; బెల్లం : 2 కిలోలు; దేశీ ఆవు మూత్రం : 15 లీటర్లు ; నీరు : 180 లీటర్లు

తయారీ పద్ధతి : సేకరించిన ఆకులను కత్తిరించి ఈనెలను తీసేయండి. ఆకుల ముక్కలను, పైన చెప్పుకున్న పదార్థాలను ఒక డ్రమ్ములో నాలుగు, ఐదు పొరలుగా వేయండి. 180 లీటర్ల నీరు డ్రమ్ములో పోయండి. వెదురు కర్రతో రోజుకు రెండు సార్లు 3 నిమిషాల పాటు.. సవ్యదిశలో కొంత సేపు, అపసవ్య దిశలో మరికొంత సేపు కలియతిప్పండి.  15 రోజుల తర్వాత వాడకానికి హెర్బల్‌ కునపజలం సిద్ధమవుతుంది.

పిచికారీ పద్ధతి :  వార్షిక పంటలు పిలక దశలో, పూత దశలో లీటరు నీటికి 50 ఎం.ఎల్‌. చొప్పున కునపజలాన్ని కలిపి పిచికారీ చేయాలి. తోటలపై ఇదే మోతాదులో ఏడాదికి ఆరుసార్లు పిచికారీ చేయాలి.

గమనిక: కేరళ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, యువ రైతు అయిన సూరజ్‌ పప్పుధాన్యాల పిండితో తయారు చేసిన కునప జలాన్ని వాడుతున్నారు. మాంసం, గుడ్లు లేదా ఆకులకు బదులు పప్పుధాన్యాల పిండిని ఆయన వాడుతున్నారు. సూరజ్‌ను 085475 70865 నంబరులో సంప్రదించవచ్చు.

సేంద్రియ పంటలు..నిర్ధారిత సాగు పద్ధతులు!
సంపూర్ణ సేంద్రియ సేద్య రాష్ట్రంగా కేరళను తీర్చిదిద్దాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ దిశగా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మాణాత్మక కృషి చేపట్టింది. వివిధ పంటల సేంద్రియ సాగు పద్ధతులపై విస్తృత పరిశోధనల అనంతరం ‘ప్యాకేజ్‌ ఆఫ్‌ ప్రాక్టీసెస్‌ రికమెండేషన్స్‌ (ఆర్గానిక్‌) క్రాప్స్‌ –2017’ పేరిట 328 పేజీల సమగ్ర సంపుటిని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసింది. వరి, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలు, కలప పంటలు, పత్తి సహా అనేక పంటల సేంద్రియ సాగుకు అనుసరించాల్సిన పద్ధతులు.. కషాయాలు, ద్రావణాల తయారీ, మోతాదు, వాడే పద్ధతులు.. సేంద్రియ పద్ధతుల్లో పశువుల పెంపకం.. మేడలు మిద్దెలపై సేంద్రియ ఇంటిపంటల సాగు తదితర అంశాలను సమగ్రంగా ఇందులో పొందుపరిచారు. గ్రేటర్‌ నోయిడాలో ఇటీవల జరిగిన ప్రపంచ సేంద్రియ మహాసభలో ఏర్పాటైన కేరళ ప్రభుత్వ స్టాల్‌లో ‘ప్యాకేజ్‌ ఆఫ్‌ ప్రాక్టీసెస్‌ రికమెండేషన్స్‌ (ఆర్గానిక్‌) క్రాప్స్‌ –2017’ పుస్తకాన్ని విక్రయించారు. ధర రూ. 300 (పోస్టేజీ అదనం). పోస్టు ద్వారా తెప్పించుకోదలచిన వారు సంప్రదించాల్సిన చిరునామా:

Director of Extention,
Kerala Agricultural University,
KAU Main Campus,
KAU P.O., Vellanikkara, NH- 47
Thrissur, Kerala - 680656  
Phone No: 0487-2438011.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top