జగన్మాతకు పుష్పాభిషేకం | vijayawada kanakadurga durgamma temple special darshan | Sakshi
Sakshi News home page

జగన్మాతకు పుష్పాభిషేకం

Oct 18 2018 12:18 AM | Updated on Oct 18 2018 12:18 AM

vijayawada kanakadurga durgamma temple special darshan  - Sakshi

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆర్జిత సేవలకు సుగంధ పరిమణాలు వెదజల్లే ఉత్తమజాతి పుష్పాలను ఉపయోగిస్తారు. నిత్యపూజలతో పాటు, చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాలు, దసరా మహోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలలో సైతం అమ్మవారికి  పూలు అలంకరిస్తారు. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు రెండు గులాబీ దండలు, మల్లెమాలతో పాటు, చేమంతులతో తయారుచేసిన చిన్న గజమాల, మల్లెల జడను అలంకరిస్తారు. ఆర్జిత సేవలు జరిగే ఉత్సవమూర్తులను కూడా మల్లె, గులాబీల దండలతో అలంకరిస్తారు. 

చైత్రమాసంలో కోటి పుష్పార్చన
చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం నుంచి విశేషంగా లభించే ఉత్తమజాతి పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో ఆయా తిథులను బట్టి అమ్మవారికి 9 రోజుల పాటు  గులాబీ, మల్లె, చామంతి, మందార, లిల్లీ, మరువం, కలువ,  కనకాంబరం వంటి 9 రకాల పుష్పాలతో అర్చన జరుగుతుంది. గతంలో ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జరిగేది. పుష్పార్చనకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే భావనతో రెండేళ్లుగా రాజగోపురం ఎదుట ప్రత్యేకంగా వేదిక నిర్మించి అక్కడ ఉత్సవమూర్తికి పూజ నిర్వహిస్తున్నారు.  అమ్మవారిని  విశేషంగా పూజిస్తే, దేశం సుభిక్షంగా ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. ఆశ్వయుజ మాసం తొలి తొమ్మిది రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆయా తిథులను బట్టి  తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ వారు తొమ్మిది అలంకారాలలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారికి గులాబీ, మల్లె, చామంతి, కాగడా పూలను వినియోగిస్తారు. అమ్మవారికి అలంకరణకు అవసరమైన పుష్పాలను విజయవాడ, కడియం, బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటారు. దసరా ఉత్సవాలలో తొమ్మిది రోజులు అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరిస్తారు. ఇందుకు రోజుకు రూ. లక్ష వరకు దాతలు కానుకగా సమర్పించుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తమ పేరిట అమ్మవారి ఆలయ అలంకరణ జరిపించుకునేందుకు సైతం దాతలు ముందుకు వస్తారు. దేశవిదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పుష్పాలతో తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. సాధారణ రోజులలో ప్రతి మంగళవారం 108  తెలుపు, గులాబీ రంగుల కలువలను తెనాలికి చెందిన ఓ భక్తుడు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. 

మల్లెలతో అమ్మవారికి చీర
చైత్రమాసంలో జరిగే కోటి పుష్పార్చన రోజులలో అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెలతో చీరను తయారు చేయించి అలంకరిస్తారు. ఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా మల్లె పూలను తీసుకువస్తారు. కడియం నుంచి విచ్చేసే నిపుణులు ఈ చీరను తయారు చేస్తారు.  

శాకంభరీదేవి ఉత్సవాలు 
ఆషాఢ మాసంలో శాకంభరీదేవి ఉత్సవాలలో పూలకు బదులుగా వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, శుష్క ఫలాల (డ్రైప్రూట్స్‌) తో విశేషంగా అలంకరిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారితో పాటు ఉత్సవ మూర్తులను, ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో తయారు చేసిన కదంబం ప్రసాదం భక్తులకు పంపిణీ చేస్తారు.  విలువైన పండ్లను సైతం వ్యాపారులు స్వచ్ఛందంగా అమ్మవారికి విరాళాలుగా అందచేస్తారు. 

గిరి ప్రదక్షణతో సర్వ పాపహరణం...
భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి  గిరి ప్రదక్షణ చేస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే దీక్ష విరమణ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. దీక్షల విరమణ చివరి రోజు రాత్రి  9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు లక్షలాది మంది భవానీలు గిరి ప్రదక్షణ చేస్తుంటారు. ఈ సమయంలో కొండ చుట్టూ ఉన్న అమ్మవారి భక్తులు అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో పాటు గిరి ప్రదక్షణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, టీ, కాఫీలతో పాటు పండ్లు, విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.  
– ఎస్‌.కె. సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడదద 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement