మన భూమి... జన సినిమా...

మన భూమి...  జన సినిమా... - Sakshi


మూడున్నర దశాబ్దాల క్రితం సంగతి... తెలుగు సినిమా ఒక బాక్సాఫీస్ గిరి గీసుకొని, ఆ బరిలోనే ఆడాలని వెండితెరను నిర్దేశించడం మొదలైన రోజులవి. తెలుగు హీరో ‘అడవి రాముడై’, కలెక్షన్ల ‘వేటగాడు’గా మారాక, 3 ఫైట్లు... 6 పాటల ఫార్ములాతో ప్రేక్షకుల్ని పంచరంగుల్లో ఊహాలోక విహారం చేయిస్తున్న సమయం. అప్పుడు ఎవరైనా లక్షలు ఖర్చుపెట్టి, నిజజీవితాన్నీ, మన చరిత్రనూ బ్లాక్ అండ్ వైట్‌లో చూపే సాహసం చేస్తారా? గౌతవ్‌ు ఘోష్ దర్శకత్వంలో ‘మాభూమి’ చిత్రం ద్వారా నిర్మాతలు జి. రవీంద్రనాథ్, బి. నరసింగరావు ఆ పనే చేశారు.



తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో 1980 మార్చి 23న రిలీజైన ఆ సినిమా స్థల, కాలాల పరిధులను దాటి గుండెను మండించిన సినిమా... మనసును బరువెక్కించిన సినిమా... ఇప్పటికీ తెరపై... తడి ఆరని నెత్తుటి గాయం.  సినిమా నెగటివ్ పాడై, అందుబాటులో లేకుండా పోవడంతో, ఈ చిత్రాన్ని ఇటీవలే డిజిటలైజ్ చేశారు. సినిమా రిలీజై రేపు సోమవారంతో 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, చాలాకాలంగా అందుబాటులో లేని ‘మా భూమి’ని తొలిసారిగా బ్లూరే డి.వి.డి.గా ఇవాళ జనానికి అందుబాటులోకి తెస్తున్నారు నిర్మాతలు. ఆ సందర్భంగా విశ్వజనీన విప్లవ పోరాట చిత్రం ‘మా భూమి’ నిర్మాణ యజ్ఞంపై ఒక విహంగ వీక్షణం...

- రెంటాల జయదేవ



దర్శక ప్రముఖుడు మృణాల్‌సేన్‌ను ఒప్పించి, నవయుగ ఫిలిమ్స్ వారు తీసిన ‘ఒక ఊరి కథ’ (1977) తెలుగుతెరపై నవ్యచిత్రాల ధోరణికి నాంది అనవచ్చు. ఆ తర్వాత శ్యామ్‌బెనెగల్ దర్శకత్వంలో ‘అనుగ్రహం’ వచ్చింది. ఆ కాలఘట్టంలోనే దాశరథి రంగాచార్య నవల ‘చిల్లర దేవుళ్ళు’ ఆధారంగా అదే పేరుతో సినిమా (1975) వచ్చింది. తెలంగాణ భాషతో స్థానికతను ప్రతిబింబిస్తూ తయారైన తొలి చిత్రంగా దీన్ని పేర్కొంటారు. అయితే, ఇవేవీ వాణిజ్య విజయం సాధించలేదు. ఆ పరిస్థితుల్లో ‘మా భూమి’ చిత్ర నిర్మాణ ప్రయత్నం మొదలైంది. అప్పటికి పాతికేళ్ళ క్రితపుసమకాలీన చరిత్రను ప్రతిఫలిస్తూ, రైతాంగ పోరాటాన్ని సినిమాగా తీయడం సాహసమే!

 కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన బెంగాలీయుడు గౌతమ్ ఘోష్ పక్కా తెలుగు వాతావరణంలోని ఈ చిత్రాన్ని రూపొందించడం విచిత్రం. మూడేళ్ళు నిర్మాణంలో ఉన్న ‘మా భూమి’ని పూర్తి చేసేనాటికి స్వతహాగా మార్కిస్టు భావాలున్న ఘోష్ వయసు 29 ఏళ్ళే.



కథ వెనుక కథ ఇదీ!



హైదరాబాద్ సంస్థానం నిజామ్ ఏలుబడిలో ఉంటూ, భారత యూనియన్‌లో విలీనం కాక ముందు 1948 పూర్వపు తెలంగాణ జీవిత దృశ్యాన్ని ‘మా భూమి’ తెరపై చూపింది. ప్రసిద్ధ అభ్యుదయ రచయిత కిషన్ చందర్ రాసిన ‘జబ్ ఖేత్ జాగే’ అనే చిన్న నవల ఈ చిత్రానికి మూలం. సినిమా తీయాల్సిందిగా కోరిన బి. నరసింగరావు, జి. రవీంద్రనాథ్‌లకు ఘోష్ ఆ నవలికను సూచించారు. వాళ్ళూ సరిగ్గా ఈ నవలిక దగ్గరే ఆగారు. అప్పటికే ఆ ఉర్దూ రచన తెలుగులో ‘జైత్రయాత్ర’ (‘పొలాలు మేల్కొన్నప్పుడు’ అనేది ఉప శీర్షిక, అనువాదకుడు పోలు శేషగిరిరావు)గా వచ్చింది. పోరుతో ప్రత్యక్ష పరిచయం లేనప్పటికీ, మిత్రుల ద్వారా సేకరించిన సమాచారంతో కిషన్ చందర్ ఆ నవలిక రాశారు. ఆ రచన ఆధారంగా ఘోష్ స్క్రిప్టు చేశారు. అయితే, జనజీవితానికీ, చరిత్రకూ దగ్గరగా ఉండేలా చారిత్రక విషయాల్ని జోడించారు. స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేయడంలో బి. నరసింగరావు, రచయిత ప్రాణ్‌రావు, పార్థూ బెనర్జీలు ఘోష్‌కు వెన్నుదన్నయ్యారు. అలా చివరకు వచ్చేసరికి, ‘మా భూమి’ స్క్రిప్టులో నవలా మాతృకలోని మూల కథ తప్ప, మిగిలినదంతా జనజీవిత ఘటనలకు అద్దం పట్టిన కొత్త అల్లికే.



నిర్మాణం... ఒక యజ్ఞం



స్క్రిప్టు స్థల కాలాల ప్రకారం విద్యుత్ సౌకర్యం కూడా లేని పల్లెలో కథ జరిగినట్లు చూపాలి. అందుకోసం మంగల్‌పర్తి గ్రామాన్ని ఎంచుకున్నారు. అది నరసింగరావు అత్తగారి ఊరే. అక్కడ కరెంట్ కాదు కదా, కనీస వసతులు కూడా కరవే. యూనిట్ మొత్తం చిన్న బడిలో బస చేసింది. బాత్‌రూమ్ వసతైనా లేని ఆ ఊళ్ళో బావి దగ్గరే స్నానాదికాలు! రాత్రయితే, దోమలతో కుస్తీ. మహిళల కోసం మాత్రం ఊళ్ళో పెద్దల ఇళ్ళను వినియోగించుకున్నారు. షూటింగ్‌లో అయ్యే గాయాలకు రోజుకో టించర్ సీసా ఖాళీ అయ్యేదంటే, ఎన్ని కష్టాలు పడ్డారో ఊహించుకోవచ్చు.



‘మా భూమి’లో ఎక్కువమంది ఔత్సాహికులైన కొత్తవాళ్లు... రంగస్థల నటులే. పోరాట సన్నివేశాల కోసం పెద్ద సంఖ్యలో జనం కావాలి కాబట్టి, గ్రామంలోని స్థానికులను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. వర్షాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చిత్రీకరణకు చాలా ఇబ్బందులే వచ్చాయి. అయినా సరే, నిర్మాతలు ఆస్తులు తాకట్టుపెట్టి మరీ, పట్టుదలగా నడిచారు.



 సినిమా అంతా పూర్తయినా, చిత్ర నిర్మాణం, విడుదలలో భాగస్వాములుగా పంపిణీదారుల మాటే చెల్లిన ఆ రోజుల్లో సినిమా విడుదలకూ ఎవరూ ముందుకు రాలేదు. అయితే, సారథీ స్టూడియోతో, ‘మృగయా’, మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’ చిత్రాల నిర్మాణంతో అనుబంధమున్న నిర్మాత జి. రవీంద్రనాథ్‌కు ఉన్న పరిచయాలు ఒక మేరకు ఉపయోగపడ్డాయి.

 

కెరీర్‌లో ఒక కొండగుర్తు



ఎన్ని కష్టాలు పడినా, ఎందరో కళాకారులకు ఈ సినిమా ఎనలేని తృప్తినిచ్చింది. ‘‘నటజీవితంలో చాలాపాత్రలు పోషించినా, నా వరకు నాకు ఈ సినిమా ప్రత్యేకమైంది. విప్లవ సిద్ధాంతం పట్ల ఇష్టమున్న నాకు ఈ చిత్రం వృత్తిగతంగానే కాక, సైద్ధాంతికపరంగా వ్యక్తిగతంగా కూడా ఎనలేని సంతృప్తినిచ్చింది’’ అని నటుడు కాకరాల చెప్పారు.



గౌతమ్ ఘోష్‌కు పెళ్ళయిన కొత్త రోజులవి. ఆయన భార్య నీలాంజనా ఘోష్ ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్. నటుడు జగ్గయ్య కంచుకంఠంతో చెప్పిన వ్యాఖ్యానం మరో హైలైట్. ఈ సినిమాతోనే సాయిచంద్, ‘తెలంగాణ’ శకుంతల, భూపాల్ రెడ్డి (‘కొమరం భీమ్’ ఫేమ్) పరిచయమయ్యారు.  తెలుగువారు గర్వించే చిత్రకారుడు తోట వైకుంఠం కళాదర్శకత్వం వహించారు. ఆయనకూ ఇదే తొలి సినిమా అనుభవం. ప్రముఖ కవి దేవీప్రియ ‘మా భూమి’కి పబ్లిసిటీ ఇన్‌ఛార్జ్. ప్రముఖ చిత్రకారుడు గోపి డిజైన్లు చేశారు.

 

బండెనక బండ్లు కట్టి.. వచ్చిన జనం



అయితే, చిత్ర నిర్మాణంలో, విడుదలలో అష్టకష్టాలు పడిన ‘మా భూమి’ రిలీజ్‌కు ముందే మన దేశంలోని ప్రతిష్ఠాత్మక ‘ఫిల్మోత్సవ్’లో ప్రీమియర్ జరుపుకొని, వార్తల్లో నిలిచింది. సినిమా రిలీజయ్యాక మునుపటి ఇబ్బందులన్నీ నిర్మాతలు మర్చిపోయేలా ఊహించని స్పందనొచ్చింది. జనాదరణతో పాటు ప్రింట్లు, కేంద్రాలు పెరిగాయి. కేవలం ఉదయం ఆటలుగా ప్రదర్శించిన ఈ చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎం.ఎంలో ఏడాది పాటు ఆడింది.



నిత్య చైతన్యదీప్తి... నిరంతర పోరాటస్ఫూర్తి



చిత్రం ఏమిటంటే, స్థానికత నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆ హద్దును చెరిపేసి, విశ్వజనీనతను సంతరించుకుంది. కమ్యూనిస్టు భావజాలానికి కేంద్రంగా వెలిగిన విజయవాడలో సైతం అప్సర థియేటర్‌లో ఈ చిత్రం 100 రోజుల పైగా ప్రదర్శితమైంది. ఖమ్మం నుంచి జనం విజయవాడ వచ్చి, సినిమా చూసివెళ్ళేవారు. విశాఖలోనూ అదే ఆదరణ. ‘బండెనక బండి గట్టి...’ పాట వస్తే, హాలులో జనం లేచి నృత్యం చేసేవారు.



అప్పుడే కాదు... ఇటీవల కూడా ‘సి.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్’ టీవీ చానల్ జరిపిన ఓ సర్వేలో దేశంలోని 100 అత్యుత్తమ సినిమాల్లో ‘మాభూమి’కి చోటు దక్కింది. ఒక్కమాటలో... తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని నక్సల్బరీ అందుకొని, కొనసాగుతున్నప్పుడు వచ్చిన ఈ సినిమా 1948 నాటి గతచరిత్రతో పాటు, చిత్రనిర్మాణం జరిగిన 1970ల నాటి సమకాలీన చరిత్రకూ సెల్యులాయిడ్ సింబల్! కాకరాల అన్నట్లు, ‘‘సాయుధ పోరు దన్ను లేకుండా కింది తరగతి జీవితాలకు న్యాయం జరగదని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే, సమూలమైన మార్పు కోరుకొనే సందర్భం వచ్చినప్పుడల్లా ‘మాభూమి’కి ప్రాధాన్యం, ప్రాసంగికత ఉంటూనే ఉంటాయి.’’ అలా పీడితులందరికీ ఇది ‘మన సినిమా... జన సినిమా’.

 

 

నల్గొండ జిల్లా సిరిపురం గ్రామం. పేద రైతు వీరయ్య (కాకరాల). అతని కొడుకు రామయ్య (సాయిచంద్). భూస్వామి జగన్నాథరెడ్డి (ప్రసాదరావు), కొడుకు ప్రతాపరెడ్డి (ప్రదీప్‌శక్తి) అకృత్యాలకు అంతుండదు. యుక్తవయస్కుడైన రామయ్య, చంద్రిని (హంస)ను ప్రేమిస్తాడు. భూస్వాముల చేతుల్లో చంద్రి అత్యాచారానికి గురవుతుంది. మరోపక్క గ్రామంలో ‘సంఘం’ ఏర్పడి, భూస్వామిపై తిరుగుబాటు చేస్తుంది. రామయ్య సాయుధ పోరాటంలో పాల్గొంటాడు. ఇంతలో దేశానికి స్వాతంత్య్రం వస్తుంది. కానీ, గ్రామజీవితంలో మార్పు లేదు. నిజామ్‌కు తొత్తులుగా పనిచేసిన దొరలు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. సైనికుల దాడిలో చివరకు రామయ్య సహా చాలామంది వీరమరణం పొందుతారు. పీడకులే కొత్త వేషాల్లో పెత్తనం చేసే స్థితిని వెండితెరపై వెక్కిరిస్తుందీ చిత్రం. భూమి కోసం, భుక్తి కోసం, పీడన నుంచి విముక్తి కోసం జనంలో కాకున్నా, వనంలో నుంచైనా పోరు సాగుతూనే ఉంటుందని విప్లవ చైతన్యదృష్టితో ముగుస్తుంది.

 

ప్రజాగీతాల  ప్రతిధ్వని

 

ప్రజాపోరాట చిత్రమైన ‘మా భూమి’ పాటలూ జనజీవితంలోవే.   ‘బండెనక బండికట్టి..’ అనే పాట నిజామ్ వ్యతిరేక పోరాటంలో బండి యాదగిరి చేసిన రచన. ఆ పాటను ఈ సినిమాలో వాడారు. నిజజీవితంలో ఆ పాటను విస్తృతంగా పాడుతూ వచ్చిన విప్లవ వీరుడు గద్దర్‌తోనే సినిమాలోనూ ఆ పాట పాడించారు. గద్దర్ మీదే చిత్రీకరించారు. అలా గద్దర్ తొలిసారి తెరపై కనిపించారు.

 ‘పల్లెటూరి పిల్లగాడ... పసులగాసే మొనగాడా...’ అనే పాట ప్రజాకవి సుద్దాల హనుమంతు (సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ తండ్రి) రచన. ‘జననాట్యమండలి’ సంధ్య గొంతులో వింటే గుండె బరువెక్కుతుంది.‘పొడల పొడల గట్ల నడుమ...’ నిజామాబాద్ నుంచి సేకరించిన పాట. కె.బి.కె. మోహన్‌రాజు పాడారు.

     

సందర్భానుసారంగా తెలంగాణ ప్రాంత స్థానిక ఉత్సవాలనూ, అక్కడ పాడే పాటలనూ తెరపై చూపించారు. జానపద గాయని సీత (వింజమూరి సిస్టర్స్‌లో ఒకరు) సంగీతం అందించిన ఈ సినిమా పాటల్ని సారథీ స్టూడియో దొరక్క, మ్యాక్స్‌ముల్లర్ భవన్ లైబ్రరీలో ఒకే రోజులో రికార్డు చేశారట. ఇక, నేపథ్య సంగీతం దర్శకుడే చేసుకున్నారు. మద్రాస్‌లో రీరికార్డింగ్‌కు సినీసంగీత దర్శకుడు బి. గోపాలం వాద్యగోష్ఠి నిర్వహించారు.      

 

‘‘హీరో పాత్రకు నా కన్నా ముందు పలువురిని అనుకున్నా, చివరకు కొత్తవాడినైన నన్ను తీసుకున్నారు. నేను షాకయ్యా. కానీ,‘‘నువ్వు చెయ్యగలనని నమ్మకంగా ఉండు. నీతో ఆ పాత్రను నేను చేయించుకుంటా’’ అని గౌతమ్‌ఘోష్ ఉత్సాహపరిచారు. నరసింగరావు కూడా నన్నెంతో గైడ్ చేశారు. ఈ చిత్రంలో నేను, నా తండ్రి పాత్రతో ‘ప్రజల కోసం పాటుపడే దాని కన్నా మంచి బతుకేముంటుందయ్యా?’ అంటా. ఆ డైలాగ్ నా జీవితంపై బలంగా ముద్ర వేసింది.’’

 - సాయిచంద్, ‘మా భూమి’ చిత్ర కథానాయకుడు

 

‘‘జననాట్యమండలి’ స్థాపకుల్లో ఒకడిగా నాది మొదటి నుంచి విప్లవ పోరాట పంథా. దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేశాక బయటకొచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనివేళ మిత్రుడు రవీంద్రనాథ్ ద్వారా సినిమా వైపొచ్చా. అక్కడా విప్లవ పంథాలోనే వెళ్ళాలనీ, తెలంగాణ పోరాట నేపథ్యాన్ని చూపాలనీ భావించా. అలా ‘మాభూమి’ తీశాం. లక్ష అనుకున్న బడ్జెట్ రూ.5.3 లక్షలైంది. మా ఇల్లు, బంగారం తాకట్టు పెట్టా. సెన్సార్‌కు డబ్బుల్లేకపోతే, సహ నిర్మాత రవీంద్రనాథ్ పెళ్ళి ఉంగరం తాకట్టు పెట్టారు. ఆ కష్టాల్ని మరపిస్తూ, సినిమా రిలీజయ్యాక ప్రతిచోట జనం పాటలకి  డ్యాన్‌‌స చేయడం మర్చిపోలేను.’’

 - బి. నరసింగరావు, ‘మా భూమి’ నిర్మాతల్లో ఒకరు

 

‘‘ప్రపంచ విప్లవాల చరిత్రలోనే ప్రత్యేకస్థానం తెలంగాణ రైతాంగ పోరాటానిది. ఆ నేపథ్యంలో చేసిన ‘మాభూమి’ సినిమా చిత్రీకరణ రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికీ నాకు నరాలు ఉప్పొంగుతాయి. సినిమాగా అదే నాకు తొలి ప్రయత్నం. భారీ పోరాట సన్నివేశాలున్నప్పటికీ, వీలైనంత పరిమిత బడ్జెట్‌లో చిత్రీకరించాం. షూటింగ్ చేసిన పల్లెల్లోని గ్రామస్థులు ఎంతో సహకరించారు. వారి కట్టుబొట్టు అంతా తెలుసుకొని చేశాం. ఆ సినిమా చరిత్రలో మిగలడం వెనక ఎంతో మంది శ్రమ ఉంది.’’

     - గౌతవ్‌ు ఘోష్, ‘మా భూమి’ చిత్ర దర్శకుడ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top