
ఊరగలసి మనుము... ఊని పనుల గనుము...
మన చుట్టుపక్కల ఉండేవారితో కలసి మెలసి ఉండాలి.
మన చుట్టుపక్కల ఉండేవారితో కలసి మెలసి ఉండాలి... మనంతట మనమే పూనుకుని పనులు చేయాలి... అని అర్థం. మనిషి సంఘజీవి. ఎప్పుడో ఒకప్పుడు సాటి మనిషితో అవసరం ఏర్పడుతుంది. అందువల్ల మన చుట్టుపక్కల వారితో విరోధం పెట్టుకోకుండా, కలసిమెలసి ఉండాలి. అలాగే ఏదైనా పని చేయవలసి వస్తే, ఎవరో వచ్చి చెప్పాలనుకోకుండా, మనంతటగా మనం పూనుకుని పని ప్రారంభించి పూర్తి చేయాలి.
కట్టులేని నోరు... కట్ట తెగిన ఏరు...
నోటికి వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడ కూడదు... అలా మాట్లాడితే అది కట్ట తెగిన ఏరుతో సమానం అని అర్థం. ఆచితూచి మాట్లాడటం వలన మంచి జరుగుతుంది. అలాకాక నోటికి వచ్చినట్లు పరుషంగా, గర్వంగా మాట్లాడితే అనర్థాలు చోటుచేసుకుంటాయి. అందువల్ల నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఏరుకి కట్ట ఉన్నంత వరకు ఆ నీరు నిశ్చలంగా ప్రవహిస్తుంది. ఒకవేళ కట్ట తెగితే... గ్రామాన్నంతటినీ ముంచివేస్తుంది.