పిండ గండాలు దాటేద్దాం

Special Story on Women Safety in Pregnency Time - Sakshi

గర్భధారణ, ప్రసవాలకు సంబంధించి ఆబ్‌స్టెట్రిక్స్‌; స్త్రీ వ్యాధులకు సంబంధించి గైనకాలజీ విభాగాలు వైద్యశాస్త్రంలో అందరికీ తెలుసు. గర్భిణులకు, గర్భస్థ శిశువులకు సంబంధించి రాబోయే ఎలాంటి ముప్పులనైనా గర్భస్థ స్థాయిలోనే పరిశోధించి, వైద్యం అందించగల అత్యాధునిక వైద్య విభాగంగా ‘‘మెటర్నల్‌ ఫీటల్‌ మెడిసిన్‌’’ ఇటీవల బాగా అభివృద్ధి చెందుతోంది.దీనికి సంబంధించిన ‘ఫీటల్‌ మెడిసిన్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ లండన్‌లో కైపోస్‌ నికొలాయిడ్స్‌ అధ్యక్షతన పరిశోధనలు జరుపుతోంది. క్రోమోజోముల నిర్మాణాత్మక అసాధారణతల స్క్రీనింగ్‌ తదితర ఆధునిక ఫీటల్‌ సర్జరీలను వీరు ప్రవేశపెట్టారు.ఇదే విభాగంలో ‘ఎన్యుప్లోయిడీస్‌’ అంటే క్రోమోజోముల సంఖ్యలో మార్పులు తెలుసుకోవడం కోసం చేసే స్క్రీనింగ్‌  పరీక్షలతోపాటు అధునాతన పరిశోధనల్లో ఎలాంటి విశ్లేషణ చేయాలనే అంశంపై ఈ వ్యాస రచయిత్రి / డాక్టర్‌ ప్రప్రథమంగా భారతదేశంలో చేసిన పరిశోధనలను ఫీటల్‌ మెడిసిన్‌ ఫౌండేషన్, లండన్‌ అంగీకరించింది. గర్భిణులు ముఖ్యంగా చేయించుకోవలసిన టెస్ట్‌లు మౌలికమైన స్కానింగ్‌ల గురించిన అవగాహన కోసం ఈ వ్యాసం.

గర్భిణులకు చేయాల్సిన ముఖ్య పరీక్షలేమిటి?
గర్భం ధరించిన 6 నుంచి 8 వారాల మధ్య మొట్టమొదట పిండపరిమాణం, గుండె కొట్టుకోవడం, గర్భం వయస్సు వంటివి నిర్ధారణ చేయడానికి మొదటి స్కాన్‌ నిర్వహిస్తారు. తరవాత చెయ్యవలసినవి ఎన్‌.టి స్కాన్, ఎనోమలి స్కాన్, పెరుగుదల స్కాన్‌.

ఎన్‌.టి స్కాన్‌ అంటే ఏమిటి?
గర్భస్థ శిశువులో ఎదుగుదలతో పాటు క్రోమోజోముల అసాధారణత వల్ల వచ్చే ప్రమాదమేదైనా ఉందేమో పరిశీలించడానికి చేసే ప్రత్యేక స్కాన్‌ ఈ ఎన్‌.టి. స్కాన్‌. ఇది గర్భస్థ శిశువు వయస్సు 11 నుంచి 13.6 వారాల సమయంలో లేదా శిశువు 45 నుంచి 84 మిల్లి మీటర్ల పొడవు ఉండే సమయంలో నిర్వహిస్తారు. ‘ఎన్యుప్లోయిడీస్‌’ అంటే క్రోమోజోముల సంఖ్యలోని మార్పులు, అవయవలోపాలు ప్రాథమికంగా పరిశీలించడానికి అందరు గర్భిణులు  చేయించుకోవలసిన స్కానింగ్‌ ఇది.

ఎన్యూప్లాయిడ్‌ అంటే ఏమిటి?
గర్భస్థ శిశువులో క్రోమోజోముల సంఖ్య ఉండాల్సిన దాని కన్నా అసాధారణంగా ఉండడమే ఎన్యూప్లాయిడ్‌. శిశువుకు తల్లిదండ్రుల లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయి. తల్లినుంచి 23, తండ్రినుంచి 23, క్రోమోజోముల చొప్పున మొత్తం 46 క్రోమోజోములు బిడ్డకు జన్యుపరంగా బదిలీ అవుతాయి. ఈ విధంగా మానవకణంలో 23 జతలు అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. సాధారణంగా బిడ్డ పెరుగుదల బాగానే ఉంటుంది. కానీ తక్కువ సందర్భాలలో చెప్పకోదగ్గ సమస్యలు ఉంటాయి. ఇవి నిర్మాణాత్మక లోపాలు గానీ, జన్యువులు, క్రోమోజోములలోని అసాధారణత వల్ల కానీ కావచ్చు. అవయవ లోపాలు స్కానింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోములు, జన్యుపరమైన సమస్యలు మామూలు స్కానింగ్‌ ద్వారా మాత్రమే తెలియవు. ఎనోప్లాయిడీస్‌ లోని ఎక్కువ, తక్కువ ప్రమాద సూచికలు స్క్రీనింగ్‌ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. అలా తెలిసేవానిలో ఒకటి ‘డౌన్స్‌ సిండ్రోవ్‌ు’.

డౌన్స్‌ సిండ్రోవ్‌ు అంటే ఏమిటి?
డౌన్స్‌ సిండ్రోమ్‌నే ట్రైసోమి 21 అని అంటారు. ఇది క్రోమోజోముల అసాధారణతకు సంబంధించినది. దీనిలో 21వ నెంబరు క్రోమోజోవ్‌ుపైన ఒక అదనపు క్రోమోజోవ్‌ు ఉంటుంది. దీని వల్ల పిల్లలు ఏ విషయాన్నీ నేర్చుకోలేని మానసిక బలహీనతకు తీవ్రంగా గురవుతారు. ఈ డౌన్స్‌ సిండ్రోవ్‌ు వ్యాధికి చికిత్సలేదు. ఈ డౌన్స్‌ సిండ్రోవ్‌ుతో బిడ్డ పుట్టే ముప్పు తల్లి వయస్సు పెరిగే కొద్ది ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు: 20 సంవత్సరాల వయస్సు స్త్రీలో ఈ అవకాశం 1140 మందిలో ఒకరికి, 30 ఏళ్ళ స్త్రీలలో 720 మందిలో ఒకరికి, 40 ఏళ్ళ వారిలో 65 మందిలో ఒకరికి ఈ ముప్పు ఉంటుంది.
∙డౌన్స్‌ సిండ్రోవ్‌ు ముందుగానే తెలుసుకోవటానికి స్క్రీనింగ్‌ పరీక్షలు, రోగ నిర్ధారణ పరిక్షలు ఏమిటి?
గర్భస్థ శిశువులో డౌన్స్‌ సిండ్రోవ్‌ు, ఇతర క్రోమోజోముల సమస్యలు తెలుసుకునేందుకు, గర్భ ప్రారంభ దశలోనే రెండు రకాల పరీక్షలు చేయవచ్చు. అవి తల్లి రక్తపరీక్ష, స్కానింగ్‌. అందరు గర్భిణులకు ఏదైనా అధికముప్పు (రిస్క్‌) తెలుసుకోవటానికి చేసేది స్క్రీనింగ్‌ పరిక్ష. ఈ స్క్రీనింగ్‌ పరీక్షలో అధిక ముప్పు కనబడితే తదుపరి ఆమ్నియో సెంటసిన్, కోరియోనిక్‌ విల్లస్‌ శాంప్లింగ్‌ వంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.     

కంబైండ్‌ పరీక్ష లేదా మొదటి త్రైమాసిక స్క్రీనింగ్‌ అంటే ఏమిటి?
కంబైండ్‌ పరీక్ష అనే స్క్రీనింగ్‌ పరీక్ష క్రోమోజోవ్‌ుల అసాధారణత ఉంటే చాల వరకు నిర్ధారిస్తుంది. ఎన్‌.టి పరీక్ష చేసే రోజే గర్భవతి రక్తనమూనాలు తీసుకొని అందరు గర్భిణులలోను వుండే పిఎపిపి/ఎ, బేటా.హెచ్‌.సి.జీ అనే రెండు పదార్ధాల పరిశీలన చేయాలి. వీటిలో అసాధారణ స్థాయి కనిపిస్తే బిడ్డలో క్రోమోజోముల సమస్య, ముప్పు వున్నట్టు గుర్తించవచ్చు. ఈ రెండు పరీక్షల ఫలితాలను తల్లి వయస్సుతో సహా కంప్యూటర్‌కు అందజేస్తారు. దాని విశ్లేషణలో బిడ్డకు డౌన్స్‌ సిండ్రోవ్‌ు, ఇతర అసాధారణ ముప్పులైన ట్రైజోమీ 18,13 వంటివి వుంటే తెలుస్తాయి. ఈ టెస్ట్‌ల ఫలితాలు తదుపరి ఎటువంటి పరీక్షలు చెయ్యాలో నిర్ణయించటానికి ఉపయోగపడతాయి. గర్భస్థ దశ ప్రారంభంలో చేసే ఈ కంబైండ్‌ పరీక్ష వలన కడుపులోని బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేకుండా క్రోమోజోముల సమస్య, వాటి వలన ముప్పు గుర్తించవచ్చు.

ఒకవేళ పరీక్షలో హైరిస్క్‌ ఉన్నట్టు తెలిస్తే ఏం చేయాలి?
స్క్రీనింగ్‌ టెస్ట్‌లో హైరిస్క్‌ ఉన్నట్లు తెలిస్తే అది క్రోమోజోముల సమస్య బిడ్డకు ఉందని తెలియ చేసే సూచన మాత్రమే. బిడ్డ మామూలు గానే ఉండే అవకాశం కూడా ఉండవచ్చు.

దీనిని ఎలా నిర్ధారణ చేయగలం?
ఆమ్నియోసెంటసిస్, కోరియోనిక్‌ విల్లస్‌శాంప్లింగ్‌ అనే రెండు పరీక్షల ద్వారా బిడ్డ డి.ఎన్‌.ఎ. ని క్రోమోజోముల సమస్య కోసం పరీక్షించి నిర్ధారించ వచ్చు.

ఆమ్నియోసెంటసిస్‌ అంటే ఏమిటి?
బిడ్డ చుట్టూ ద్రవంగా వుండే ఉమ్మనీరులో (ఆమ్నియోటిక్‌ ప్లూయిడ్‌) డి.ఎన్‌.ఎ. వుంటుంది. అల్ట్రా సౌండ్‌ ద్వారా గమనిస్తూ కడుపు పైనుంచి గర్భంలోకి సూదిని ప్రవేశపెట్టి తద్వారా కొద్దిపాటి ఉమ్మనీరు, సిరెంజ్‌ద్వారా తీసుకుంటారు. దానిని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపుతారు. ఈ పరీక్ష గర్భధారణ తరువాత 15 నుంచి 24 వారాల మధ్య చేయవచ్చు. ఈ పరీక్ష కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. పరగడుపుతో ఉండనక్కరలేదు. రోజులో ఎప్పుడైనా చేయవచ్చు. పరీక్ష అయ్యాక కొన్ని గంటలు పరిశీలనలో ఉంచి ఇంటికి పంపివేస్తారు. దీనివలన ఇన్ఫెక్షన్, గర్భస్రావాలకు అవకాశం ఉండచ్చు ఇదివరకు గర్భస్రావ అవకాశం  ఒకశాతం ఉండేది, కాని ఇప్పుడు అది కూడా 0.1% కి తగ్గిపోయింది. (అంటే ప్రతి వందమందిలో ఒకరి నుంచి ప్రతి 1000 మందిలో ఒకరికి తగ్గిపోయింది).

కోరియోనిక్‌ విల్లస్‌ శాంప్లింగ్‌ (సి.వి.ఎస్‌.) అంటే ఏమిటి?
కోరియోనిక్‌ విల్లస్‌ శాంప్లింగ్‌లో పరీక్ష కోసం మాయ (ప్లాసెంటా) నుంచి చిన్న శాంపిల్‌ని తీసుకుంటారు. గర్భధారణ అనంతరం 11 నుండి 14 వారాల మధ్య ఇది చేయవచ్చు. ఆమ్నియోసెంటసిస్‌లో లానే కొంచెం పెద్దసూది వాడుతూ అల్ట్రాసౌండ్‌ సహాయంతో గర్భంలోని మాయ (ప్లాసెంటా) నుంచి చిన్న శాంపిల్‌ తీసుకొని దానిని పరీక్షకోసం లేబ్‌కు పంపుతారు. గర్భస్ధ దశ ప్రారంభంలోనే ఈ పరీక్ష చేయగలగడం ఇందులోని ఒక ఉపయోగం. కానీ ఆమ్నియోసెంటసిస్‌తో పోలిస్తే ఇది కొంచెం కష్టం. దానితోపాటు గర్భస్రావ ప్రమాదం కేవలం 0.2% ఉంటుంది.

ఒకవేళ ఈ కంబైండ్‌ పరీక్షలు చేయించక పోతే ఎలా?
ఒకవేళ ఎన్‌.టి స్కాన్‌ కానీ, కంబైండ్‌ పరీక్ష కానీ చేయించకుంటే వాటి తదుపరి స్థాయిలో ‘క్వాడ్రుపుల్‌’ పరీక్ష చేయించవచ్చు. ఇది సాధారణంగా 16 నుంచి 22 వారాల వయస్సులో  అంటే బిడ్డ తల కొలత (బై పెరైటల్‌ డయామీటర్‌) స్కానింగ్‌లో 30 నుంచి 52 మి.మీ వున్నట్టు నిర్ధారించుకున్న తర్వాత చేస్తారు.

‘ట్రిపుల్‌ మార్కర్‌’ పరీక్ష అంటే ఏమిటి?
కంబైండ్‌ పరీక్ష, క్వాడ్రుపుల్‌ పరీక్షలతో పోలిస్తే ఈ ట్రిపుల్‌ మార్కర్‌ పరీక్షలో నిర్ధారణ రేటు సరిగా లేనందున దీనిని ప్రస్తుతం చేయడం లేదు. ఈ రెండు పరీక్షలతో పోలిస్తే పాత పరీక్షలలో తప్పుడు పాజిటివ్‌ ఫలితాలు కూడా ఎక్కువ.

‘ఫాల్స్‌ పాజిటివ్‌’ అంటే ఏమిటి?
బిడ్డలో ఎలాంటి క్రోమోజోముల సమస్య లేకుండా అంతా సవ్యంగా ఉన్నప్పుడు పరీక్షలలో లోపాలు ఉన్నట్లు ఫలితాలు వస్తే దానిని ‘‘ఫాల్స్‌ పాజిటివ్‌’’ అని అంటారు. సాధారణంగా అన్ని స్క్రీనింగ్‌ టెస్ట్‌లలోను తప్పుడు పాజిటివ్‌ ఫలితాలు అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అవి 5% లోపే ఉండాలి.
కాని ప్రస్తుతం ఈ రచయిత్రి / డాక్టర్‌ చేసిన పరిశోధనలలో తప్పుడు పాజిటివ్‌ ఫలితాల రేటు చాలా ఎక్కువగా వున్నట్టు, చాలా మందికి అధిక ముప్పు ఉన్న రిపోర్ట్‌లు వచ్చినట్లు నమోదయ్యింది. కానీ ఆమ్నియోసెంటసిస్, కోరియోనిక్‌ విల్లస్‌ శాంప్లింగ్‌ పరీక్షల తర్వాత అంతా సవ్యంగానే ఉన్నట్టు తెలిసింది.
ఉదాహరణకు ఈ పరిశోధనలో స్క్రీనింగ్‌ పరీక్షలలో 101 మంది గర్భిణులకు అధిక రిస్క్‌ ఉన్నట్టు వస్తే నిర్ధారణ కోసం చేసిన ఆమ్నియో సెంటసిస్‌లో అన్ని రిపోర్ట్‌లు ఎలాంటి సమస్య లేనట్టు వచ్చింది. వీటిలో సరిగ్గా చేస్తే 85% మంది తల్లులు ఆమ్నియో సెంటసిస్‌కు వెళ్ళాల్సిన అవసరం  ఉండేది కాదు.

దీనిని ఏవిధంగా సరిచేయగలం?
6 నుంచి 8 వారాల మధ్య ప్రాధమికంగా, తొలి గర్భిణి (ఎర్లీప్రెగ్నెన్సీ) స్కానింగ్‌ చేయించాలి. ఎన్‌.టి స్కాన్‌ పరీక్ష చిత్రాల వివరాలను సోనోగ్రాఫర్‌ లేబ్‌కు సమర్పించినప్పుడే లేబ్‌లో వాటిని పరీక్షించి ముప్పు అవకాశాలను లెక్కకట్టాలి. లేబరేటరీలలో ఎప్పటికప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అత్యుత్తమ ప్రమాణాలను పాటించాలి. లేబరేటరీలలో ‘ఫీటల్‌ మెడిసిన్‌ ఫౌండేషన్‌’ ఆమోదించిన సాఫ్ట్‌వేర్‌లనే వాడాలి. తప్పులు ఎక్కువగా వస్తున్న ‘ట్రిపుల్‌ మార్కర్‌’ పరీక్షలు వంటివి చేయకూడదు. స్కానింగ్‌ పరీక్షల కోసం ఇతర వైద్య అవసరాల కోసం గానీ గర్భిణులు, కొందరు ఆధార్‌ కార్డులో వున్నట్టు అధిక వయస్సు ఇవ్వడం వలన తప్పుడు రిపోర్ట్‌లు రావచ్చు.

‘‘ఎన్‌ ఐ ఫి టి’’ అంటే ఏమిటి?
ఎన్‌ ఐ పిటి అంటే నాన్‌ఇన్‌వేజివ్‌ ప్రీనేటల్‌ పరీక్ష. ఇందులో ఆమ్నియోసెంటసిన్, కొరియోనిక్‌ విల్లస్‌ శాంప్లింగ్‌ వంటి వాటి వల్ల ముప్పు లేకుండా కేవలం తల్లినుండి రక్తం మాత్రం తీసి పరీక్షించటం జరుగుతుంది. ఇది 9 వారాల గర్భం నుంచి తక్కువ ముప్పు (రిస్క్‌) గల స్త్రీలలో చేసి చక్కని నిర్ధారణ రేటుతో ఫలితం ఇవ్వవచ్చు. కంబైండ్‌ పరీక్ష, క్యాడ్రుపుల్‌ టెస్ట్‌లతో పోలిస్తే నిర్ధారణ ఖచ్చితత్వం 99.6%. అయితే ఇది చాలా ఖరీదైన పరీక్ష. అందుచేత ముప్పు ఎక్కువ ఉండే వయస్సు గల 35 ఏళ్ళ పైబడినవారికి చేస్తారు. అలాగే స్క్రీనింగ్‌ పరీక్షలో హైరిస్క్‌ కాకుండా లోరిస్క్‌ కాకుండా, మధ్యస్థమైన రిస్క్‌ రావచ్చు. వీళ్ళు కూడా ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవాలంటే అప్పుడు ఎన్‌.ఐ.పి.టి. చేయించుకోవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో అధిక ముప్పు వున్నట్లు తెలిస్తే అధిక నిర్ధారణ కోసం మళ్ళీ, ఆమ్నియో సెంటసిస్‌ లేదా సిబీఎస్‌ చేయించుకుంటారు.

ఎన్‌.ఐ.పి.టి.లో ఫలితం లేకపోవడం అంటే అర్థం ఏమిటి?
ఈ పరీక్షలో ఒక్కొక్కసారి ఫలితం లేదనే రిపోర్ట్‌ రావటం దీనిలోని ఒక ఇబ్బంది. తల్లి మరీ అధిక బరువు ఉన్నా, బిడ్డలో అసాధారణ డిఎన్‌ఎ పద్ధతి వున్నా ఎన్‌.ఐ.పి.టి. ఫలితం రాకపోవచ్చు. దీని తరువాత ఆమ్నియోసెంటసిస్‌ లేదా సీబీఎస్‌ కి వెళ్లాల్సివుంటుంది.

ఎన్‌.ఐ.పి.టిలో ‘నో రిజల్ట్‌ ’ తరువాత నిర్ధారణ పరీక్షలకు ముందు టి.ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎ. / ఎనోమలీ స్కాన్‌లకోసం వేచి ఉండాలా?
అవసరం లేదు. సిబీఎస్, ఆమ్నియాసింటసిస్‌ పరీక్షలకు వెళ్ళవచ్చు. ఎందుకంటే స్కాన్‌ కేవలం నిర్మాణాత్మక తప్పులను మాత్రమే చూపిస్తుంది తప్ప జన్యుపరమైన అసాధారణతలను గమనించలేదు.

ఎనామలీ/ టి.ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎ. స్కాన్‌ అంటే ఏమిటి?
ఎన్‌.టి. తరువాతది ఎనామలీ స్కాన్‌. ఎనామలీ/ టి.ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎ. స్కాన్‌ చాలామందికి తెలుసు. ఇది 18 నుండి 20 వారాల మధ్యలో చేస్తారు. ఈ స్క్రీనింగ్‌ పరీక్ష ఫలితాలను అల్ట్రా సౌండ్‌లో చూసిన ఎన్యూఫ్లాయిడ్‌ మార్కర్స్‌తో సరిపోల్చి చూస్తారు.
ఉదాహరణకు చాలామంది స్త్రీల స్కానింగ్‌లో శిశువులో కనుగొన్నదేమిటంటే గుండెలో ‘ఎకోజనిక్‌ ఇన్‌ట్రా కార్డియాక్‌ ఫోకస్‌’ డౌన్స్‌ సిండ్రోవ్‌ుకు ఒక చిన్న సూచికగా చూస్తారు. అప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలలో డౌన్స్‌ సిండ్రోవ్‌ుకు తక్కువ ముప్పు ఉన్నప్పుడు మిగతా పరీక్షల అవసరం వుండదు.
అదేవిధంగా ‘కోరాయిడ్‌ ప్లక్‌సెస్‌ సిస్ట్‌గానీ’, ‘సింగిల్‌ అంబ్లికల్‌ ఆర్టరీ’ గానీ అల్టాస్రౌండ్‌లో కనిపిస్తే ట్రై సోమీ 18 కి అదొక గుర్తు. స్క్రీనింగ్‌ పరీక్షలలో ట్రైసోమీ 18కి తక్కువ ముప్పు సూచిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. బిడ్డ మెడ వెనుక వాపు ఎక్కువగా కనిపిస్తే డౌన్స్‌ సిండ్రోవ్‌ుకి ఒక సూచన. బిడ్డ క్రోమోజోవ్‌ులు సవ్యంగానే ఉన్నాయని నిర్ధారించుకోవటానికి ఆమ్నియోసెంటసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అవయవ లోపాలు ఏవైనా అల్ట్రాసౌండ్‌లో కనిపిస్తే, జన్యుపరమైన అసాధారణతలు ఉన్నాయేమో అని తెలుసుకోవటానికి ఆమ్నియోసెంటసిస్‌ చేయించాలి. ఒక వేళ జన్యుపరమైన అసాధారణతలు కనుగొంటే భవిష్యత్తులో గర్భధారణకు అవసరమైన సలహాలను ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. జన్యుపరమైన అసాధారణతలు ఏవీ లేకుండా తరువాత సరిచేయటానికి వీలైన నిర్మాణాత్మక లోపాలు ఉన్నా గర్భాన్ని కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చు.
ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్‌ లిప్‌) వున్నట్లు ముందే స్కానింగ్‌లో తెలిసినా బిడ్డ పుట్టిన తరువాత ఆపరేషన్‌ ద్వారా సరిచేయవచ్చు. ఏది ఏమైనా జన్యుపరమైన లోపాలు లేవని నిర్ధారణ చేసుకోడానికి ఆమ్నియోసెంటసిస్‌ చేయించుకోవటం మంచిది.

ఎనామలీ స్కాన్‌ తర్వాతి స్కాన్‌ ఏమిటి?
24 వారాలకు శిశువు గుండెను పరిశీలించటం మంచిది. కొన్నిసార్లు గుండె లోపాలు ఆలస్యంగా రావడం వల్ల వాటిని మొదట్లోనే కనిపెట్టడం కష్టం అవుతుంది.

ఎదుగుదల, డాఫ్లర్‌ స్టడీ అంటే ఏమిటి?
అన్నీ సవ్యంగా ఉంటే 32 వారాలకు ఎదుగుదల, డాఫ్లర్‌ స్కాన్‌ చేయాలి. దీనివల్ల శిశువు ఎదుగుదల, రక్త సరఫరా విషయాలు గమనించవచ్చు.

ఐయుజిఆర్‌ అంటే ఏమిటి?
‘ఇంట్రా యుటెరైన్‌ గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌’ అంటే బిడ్డ కావల్సిన సైజ్‌కి చేరకపోవటం. ఈ బిడ్డలను డాఫ్లర్‌ స్టడీ ద్వారా గమనిస్తూ ఉండాలి.

ఐయుజిఆర్‌లో ప్రస్తుత పరిశోధనలు...
ప్రపంచవ్యాప్తంగా ఐయుజిఆర్‌ను అధ్యయనం చేస్తూ ప్రతి రోజు కొత్త విషయాలు కనుగొంటున్నారు. ఐ.యు.జి.ఆర్‌. సంఘటనలు భారతదేశంలో చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడే పరిశోధనలు జరిగితే వాటిని మనకనుగుణంగా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. దీనివల్ల మన దేశ సొంత విధానాలు (ప్రోటోకాల్స్‌) రూపొందించుకొని తదనుగుణంగా ఇక్కడి గర్భిణులకు సరిపడేట్టు వైద్యం చేసుకోవచ్చు. దాంతో ఈ వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. శిశుమరణాల రేటు తగ్గించే వీలు ఉంటుంది. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2016లో 1000 జననాలకు 34 శిశు మరణాలు ఉన్నట్లు నమోదయ్యింది. ఇతర దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అందువల్ల ఐ.యు.జి.ఆర్‌. మీద పరిశోధన చెయ్యవలసిన అవసరం ఉంది.-డాక్టర్‌ సౌఖ్య కర్రి,ఎంబిబిఎస్, ఎంఎస్‌ (ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌గైనకాలజీ),ఫెలోషిప్‌ ఇన్‌ మెటర్నల్‌ ఫీటల్‌ మెడిసిన్‌ద టీమ్‌ హాస్పిటల్, కాకినాడ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top