పాటపాడే సుషుమ్న

Special Story By Suryanarayana Sharma On 29/12/2019 In Funday - Sakshi

నేతి సూర్యనారాయణ శర్మ

‘‘శంకరుడంటే మూర్తీభవించిన జ్ఞానం’’ అన్నాడు వరరుచి.
‘‘నిజమే! జ్ఞానులైన మహర్షులు, ఋషితుల్యులు మన జ్ఞానాన్ని పాలించడమే మానవ చరిత్ర సారాంశం. శంకరుడు ఆ కోవలోనివాడు’’ అన్నాడు కాళిదాసు వత్తాసుగా.
అది గురుపౌర్ణమి నాటి సాయంత్రం. క్షిప్రాతీరం వెంట భూమి పుత్రుడైన కుజుడు పుట్టిన చోటు దిక్కుగా వారి వ్యాహ్యాళి సాగుతోంది. 
‘‘ఆ లేత వయస్సులోనే ఎన్నెన్నో కఠినమైన ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పాడు కదా! ఆ ఒక్క అంశమూ తెలుసుకోకపోతే శంకరుని చరిత్రకు లోపం వస్తుందంటారా? నాకు దానితో పనిలేదు అని శంకరుడు తిరస్కరించి ఉంటే ఆయనను సర్వజ్ఞుడు కాదని ఎవడైనా అంటాడా? ఏ ఒక్కడైనా ఆయనను తక్కువగా చూస్తాడా?’’  
‘‘ఆ... ఏ ఒక్కడికైనా ఎన్ని గుండెలు కావాలి?’’
‘‘మరి ఏదో విధంగా నిషేధం చెప్పి తప్పించుకోకుండా శంకరుడు గడువెందుకు కోరినట్లు? కోరి ఏం చేయబోతున్నట్లు?’’ ఆపుకోలేని ఉత్సాహాన్ని సందేహరూపంగా బయట పెట్టాడు వరరుచి.
‘‘శంకరుడు జగదాచార్యుడు కావాలి. జాతి భేదాలకు అతీతంగా సర్వులకూ ఆయన ఏకైక గురువుగా నిలవాలి. శంకరుని ఆయుర్దాయం పదహారేళ్లు మాత్రమే అని ఒకనాడు మహర్షులు చెప్పారట. వ్యాసభగవానుని అనుగ్రహంతో ఆయుష్షు రెట్టింపు అయింది. పదహారు ముప్పై రెండయింది. అయితే గండాన్ని దాటితే తప్ప యోగం కలగదని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. యోగాన్ని అనుభూతించడానికి వివేచన ఉంటే చాలు. కానీ వివేచన లేని అనుభూతి స్థితి ఉంటే తప్ప గండం దాటినట్లు కాదు. బహుశా అటువంటిదేదో జరిగి శంకరుడు ఆ గండాన్ని తనంత తానుగానే తప్పించుకోవాలన్నదే మహర్షుల సంకల్పము, ఉభయ భారతీదేవి ప్రయత్నమూ కాబోలు’’ అన్నాడు కాళిదాసు.
వరరుచి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ‘‘వాళ్ల ఉద్దేశాలు నా బోటివారికి అర్థం కావు. కానీ ఆ ప్రశ్నలు వింటే సామాన్యులకు మతిపోవడం ఖాయం కదండీ. శుక్ల, కృష్ణ పక్షాలలో పెరిగి తరిగే చంద్రకళలు యువతీ యువకుల మనస్సులపై చూపించే ప్రభావాలు ఏమిటో చెప్పాలా? జన్మంతా ప్రేమించినా ఒక్క ఆడదాని మనసేమిటో మగవాడు చెప్పగలడా? మగవాడి అంతరంగమేదో అతడి స్త్రీ పూర్తిగా కనిపెట్టగలదా? ఏ ఒక్కరో కాకుండా ఆ ఇద్దరి భావాలనూ కనిపెట్టాలా? పైగా ఆ పని ఓ సన్యాసి చేయాలా? ఇది వింతకాక మరేమిటి?’’ అని ఆగాడు వరరుచి. ‘‘ఆవిడ అడిగిన ప్రశ్నలకు మీరు చేసే వ్యాఖ్యానం మరీ వింతగా ఉంది. అసాధ్యాలను అంటుకట్టి దుస్సాధ్య పుష్పాలను పూయించినట్లుంది.’’ అన్నాడు. 
‘‘గురుపుత్రా! శంకర చరిత్రలో అనితర సాధ్యాలే కానీ, అసాధ్యాలంటూ లేనేలేవు. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు... అనేకమంది స్త్రీలతో పొత్తు కలిగినప్పటికీ, అందరి పట్ల సమభావాన్ని ప్రకటించగలిగే దక్షిణ నాయకునిగా మారితే....’’
‘‘అయ్యో... అయ్యో... సన్యాసి దక్షిణ నాయకుడు కావడమేమిటి? ఇదెక్కడి విపరీతం?!’’ వరరుచి తహతహ పడ్డాడు. ‘‘నిస్సంగులై పరతత్త్వాన్ని అన్వేషించవలసిన వారు స్త్రీ సాంగత్యంలో పడితే ఇంకేమన్నా ఉందా?’’ అని ముక్కున వేలేసుకున్నాడు.
సజాతీయ ప్రవాహశ్చ విజాతీయ తిరస్కృతిః
నియమో హి పరానందో నియమా త్క్రియతే బుధైః
‘‘వివేకులైనవారు పరానందాన్ని మాత్రమే కోరుకుంటారు. అనాత్మను విజాతిగా భావిస్తారు. మనస్సు చేత, వాక్కుల చేత తెలుసుకోవడానికి శక్యం కాని పరబ్రహ్మను మూకీభావంతో దర్శిస్తారు. ద్రష్ట, దర్శనము, దృశ్యమనే త్రిపుటి లయమైపోయిన యోగులకు సర్వమూ బ్రహ్మమే. సమాధి నిష్ఠను చెడగొట్టే అలసత, భోగేచ్ఛ, నిద్ర, చిత్తవిక్షేపం, రసలోలత, శూన్యత్వాలను వారు అధిగమిస్తారు. చివరకు సాధనాపేక్షను కూడా విసర్జించి సిద్ధులవుతారు అంటాడు శంకరుడు అపరోక్షానుభూతిలో. శంకరుడంటే కేవలం శబ్దవాది కాదు... బ్రహ్మవృత్తిని సాధించిన సత్పురుషుడు’’ ఖంగుమంటూ మోగుతున్న గళమెత్తి  కాళిదాసు పలుకుతుంటే క్షిప్రా నది కాసేపు ప్రవహించడం మర్చిపోయినట్లుంది. 
ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ‘‘మహాకవీ!’’ అన్న పిలుపు వినవచ్చింది. యుద్ధంలో ఉన్న విక్రమార్కుని సందేశం వినిపించడానికి ఒక వేగు వచ్చాడు.
భారతయుద్ధంలో పాశుపతానికి నేలకూలిన కాముకుడు భగవంతుని మీద పగపట్టాడు. జన్మలు మారుతున్నా ఆ పగను కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రస్తుత కథ జరుగుతున్న కాలానికి వాడు కటకటయోగిగా అవతరించాడు. సింహపుర రాజ్య పౌరుడైన వరాహమిహిరుని కుమార్తె వేదవతిని అపహరించాడు.
సుస్వరమైన వేదనాదాన్ని మాత్రమే అన్నపానాలుగా స్వీకరించే అరుదైన వ్యక్తి వేదవతి. వరాహమిహిరుని ఖగోళ విజ్ఞానమంతా ఆమెలో మూర్తీభవించింది. అటువంటి వేదవతిని నిర్బంధించి, కటకటయోగి ఆమెకు అపస్వరాలతో కూడిన నాదాన్ని వినిపించి బలహీనపరచడం మొదలు పెట్టాడు. ఆమె నుంచి వేదమయమైన ఖగోళ విజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. 
‘‘కవిగారూ! మన చక్రవర్తి ఆ కపట యోగిని నిర్బంధించారు’’ చెప్పాడు వేగు. ‘‘వాడు చచ్చాడు. కానీ చక్రవర్తి తన చేతులతో మాత్రం వాడిని వధించలేదు’’ అన్నాడు.
‘‘వరాహమిహిరుల వారికి క్షేమమేనా?’’ కాళిదాసు ప్రశ్నించాడు.
‘‘దూరమైన కూతురిని మళ్లీ కలుసుకున్న ఆనందంలో ఉన్నారు. బహుశా తొందరలోనే చక్రవర్తితో కలిసి వారు మన ఉజ్జయినికి తరలి వస్తారు’’ అని వార్తను నివేదించి వేగు సెలవు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. 
‘‘ఇక చక్రవర్తి కలగన్నట్లుగా మన నగరంలో వేధశాలా నిర్మాణం త్వరలోనే పూర్తవుతుంది’’ అన్నాడు కాళిదాసు సంతృప్తి నిండిన కళ్లతో.
‘‘ఇంతకూ వాడు పూర్తిగా చచ్చినట్లేనా?’’ అనుమానం వ్యక్తం చేశాడు వరరుచి.
‘‘అక్కడ పట్టుబడగానే ప్రాణం పోయే ముందుగానే వాడో క్రూరజంతువుగా రూపం మార్చుకుంటాడని శంకరులు చెప్పనే చెప్పారు కదా’’ గుర్తు చేశాడు కాళిదాసు.    
‘‘ఏ రూపం?’’ ఆసక్తిగా అడిగాడు వరరుచి.
నది ఒడ్డున చెట్టుకింద ఎవరో పులిజూదం ఆడుతున్నారు.  అటువైపే అడుగులు వేస్తూ, ‘‘ఆ మాయావికి ఇష్టమైన క్రీడ పులిమ్రుగ్గు’’ అన్నాడు కాళిదాసు సాలోచనగా. 
ఆటలో పడుతున్న ఎత్తులు, పై ఎత్తులను గమనిస్తూనే కాళిదాసు మాట్లాడుతున్నాడు. ఆ సంకేతభాష బహుశా వరరుచికి మాత్రమే అర్థమవుతుంది కాబోలు. ‘‘చైత్ర వైశాఖాల్లో రెండు పులులు ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నాయి. ఆ రెండూ నాలుగు గళ్లలో కాళ్లుపెట్టి నిల్చున్నాయి. కనబడుతున్నాయా?’’ 
వరరుచికి కనబడడం ఏమో కానీ, కాళిదాసు మాటలకు ఆటగాళ్లకు మాత్రం నవ్వొచ్చింది. ‘‘రెండు జంతువులు నాలుగు గళ్లలో ఎలా నించుంటాయండీ. అయినా ఇది మూడు పులులాట’’ అన్నాడు వారిలో ఒకడు. 
‘‘ఇది మీ ఆట కాదులే నాయనా?!’’ అన్నాడు వారితో కాళిదాసు. వరరుచితో తన సంభాషణ కొనసాగిస్తూ, ‘‘ఆ పులులకు ఒకవైపు మహిషాల గుంపు, మరోవైపు లేళ్ల గుంపు’’ అన్నాడు.
‘‘అబ్బో! అన్ని జంతువులుండవండీ. ఈ ఆటలో మూడు పులులు, పదిహేను మేకలు మాత్రమే’’ అన్నారు ఆటగాళ్లు.
కాళిదాసు వారివంక చూసి నవ్వుతూనే వరరుచితో చెబుతున్నాడు. ‘‘ఆర్ద్రాపరాధి అయిన మన్మథుడు విజృంభించిన వేళలో ఆ పులులు రెండూ సందు చూసుకుని, ఉత్తర దక్షిణ గోగ్రహణాలకు పాల్పడుతూ ఉంటాయి. శ్రీమహావిష్ణువు యోగనిద్రా పరవశుడైన దక్షిణాయనంలో శక్తిపాలన సాగిస్తుంటుంది కనుక పులివేట ఉత్తరంగా సాగుతుంది. ఎప్పుడైనా పుత్రస్థానమైన పంచమాన్ని వశం చేసుకోవడమే ఈ వేట పరమార్థం. తద్వారా ప్రపంచనాశాన్ని తెచ్చిపెట్టే దుష్టులను ఉదయింప చేస్తారు. దాంతో  ప్రజలలో వైమనస్యాలు కలిగి యుద్ధాలు, అలజడులు పెరుగుతాయి. దీనిని ఆపడానికి దేవతలతో పాటు సిద్ధయోగులు కూడా నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు.’’ 
ఆట ఆడుతున్న ఇద్దరు కుర్రాళ్లలో ఒకడికి ఏమనిపించిందో కానీ, రొంటిన దాచుకున్న రెండు పళ్లు తీసి కాళిదాసు చేతిలో పెట్టాడు. ఆయన తీసుకునే లోపలే, ‘‘తమరు కొంచెం మా అత్తకేదైనా మంత్రం పెట్టాలండీ అయ్యగారూ!’’ అన్నాడు వినయం ఉట్టిపడేలా.
‘‘ఎందుకు రా?’’ అన్నాడాయన నవ్వుతూ.
‘‘పదేను రోజులైందండీ. నానా అవస్థా పడుతున్నాను. పొద్దోయి ఇంటికి పోతే పక్క కుదరడం లేదు. ఇట్లా కాపరానికి వచ్చిందో లేదో మా ఇంటిదాన్ని అట్లా తీసుకుపోయింది. మా అత్తకేదో మంత్రం పెట్టి, నా కాపరం నిలబెట్టారా మీ మేలు మరిచిపోను’’ బతిమాలుతున్నట్లుగా అడిగాడు.
వాడి స్థితి చూస్తుంటే కాళిదాసుకు నవ్వాగడం లేదు. ‘‘అబ్బీ! నేనేదో చేసి నీ పెళ్లాన్ని నీకు అప్పగిస్తాననుకో. నీ కోరిక తీరుతుంది కానీ, మనువుకు అర్థం చెడుతుందిరా? మంచిపిల్లలు పుట్టేందుకు కావలసిన లగ్గాలేవీ ఈ ఆషాఢరాత్రుల్లో ఉండవు. ఈ రాత్రులన్నీ మగవాణ్ణి నీరస పరిచేవే. కాబట్టి కాస్త ఓపిక పట్టు’’ అన్నాడు.
‘‘అయితే నెలపొడుపు దాటాక వెళ్లి తెచ్చుకోనా?’’
‘‘వద్దు. శ్రావణ పౌర్ణమి దాకా ప్రయాసపడి లాభం లేదు. ఋతుసంధ్యలో తొలి పదహారు రోజులూ యోగ్యకాలం కాదు’’ అన్నాడు కాళిదాసు.... వరరుచితో కలిసి అక్కడినుంచి కదిలిపోతూ.
కాళిదాసు, వరరుచి ఇద్దరూ నదికి కుడివైపుగా నగరం వైపుకి తిరిగి నడక ఆరంభించారు. 
‘‘కటపయాది సూత్రాన్ని అనుసరించి శంకరుడంటే వైశాఖ శుద్ధ పంచమినాడు ఉదయించిన పుణ్యమూర్తి అని అర్థమవుతోంది. కానీ ఈయన ఎప్పటివాడు? ఏ మహాకార్యాన్ని మానవజాతి పక్షాన సిద్ధింప చేయడానికి వచ్చినవాడు?’’ ప్రశ్నించాడు వరరుచి.
‘‘గురుపుత్రా! శంకర శబ్దమే మహామంత్రం. ఆయన వాఙ్మయమంతా జగదుద్ధారణ తంత్రం. దేవాసుర సంగ్రామంలో ఒకప్పుడు నపుంసకులను పుట్టించడానికి భండాసురుడు పన్నిన యంత్రాన్ని విచ్ఛేదనం చేయడానికి కామేశ్వరీ దేవి విఘ్నేశ్వర యంత్రాన్ని కల్పించిందట. అలా ఏ కలిరాక్షస శక్తులను నిరోధించడానికి శంకరుడు అవతరించాడో, ఏ మహాయంత్రాన్ని అడ్డుపెట్టి మానవులను ఉద్ధరించడానికి ఈ మహోద్యమాన్ని చేపట్టాడో... ఇంతకు ముందు ఈ ఆదిశంకరుడు ఎక్కడివాడో, ఇకముందు ఎప్పుడెప్పుడు తనంత తానుగా ఏరూపంలో దిగివస్తాడో...’’ ఏమో చెప్పలేం అన్నట్లుగా పెదవులతో సంకేతించాడు కాళిదాసు. 
‘‘సరే కవిగారూ! దేవాసుర సంగ్రామం అంటే పురాణకాలంలో ఎప్పుడో జరిగిందని అనుకుంటున్నాం. అది ఇప్పటికీ జరుగుతూనే ఉందా? ఎప్పటివరకూ సాగుతుంది?!’’ పై ప్రశ్న అడిగాడు వరరుచి.
‘‘కాంతిమార్గాన్ని ఆశ్రయించి ఖగోళమంతటా ప్రయాణించిన మన మహర్షులకు ధృవమండలం మీద నుంచి చూస్తే శింశుమార చక్రరూపుడై జ్యోతిర్గణాలతో కూడిన నారాయణుడు దర్శనమిచ్చాడు. ఆ రూపం కుమ్మరిచక్రంలా ఉందట. తిరుగుతున్న ఆ చక్రం నుంచే కణాలు అణువులు పరమాణువులుగా జీవచైతన్యం సమస్త భువనాలకూ చేరుతోంది. దానివల్లనే ఈ నేలపై కూడా జీవరాశి మనగలుగుతోంది. ఇదే శంకరుని ఘటభాష్యానికి ప్రాతిపదిక. కుండ చేయడానికి కుమ్మరి మట్టి పోగేయక ముందు ఉన్నదంతా శూన్యమే అంటారు శూన్యవాదులు.

మట్టి పోగేయడం, కుండ తయారు చేయడం అంటూ ఏమీ లేదు... అసలా కుమ్మరికి కుండలు చేయాలనే సంకల్పమే లేదు. నేలపై నుంచి చూసి ఊహించుకుంటూ లేదని నువ్వు వాదిస్తున్న ఆ చక్రంలో అశూన్యమే కానీ శూన్యమంటూ లేదు అంటున్నాడు శంకరుడు. జగత్తు మిథ్య అని వాదిస్తున్నాడు. శింశుమార చక్రం తిరుగుతూ ఉంటే అణువులు పోగు పడుతూ, విచ్ఛేదమవుతూ ఉంటాయి. విచ్ఛేదమైనవి మళ్లీ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతూనే ఉంటాయి. కనుక ఈ భూమండలం వయస్సు నువ్వు అంచనా వేస్తున్న వేలకోట్ల సంవత్సరాల లెక్కల్లో  ఉండదు. ప్రారంభమెప్పుడో తెలియని దీనికి అంతమెప్పుడో నువ్వు అంచనా వేయలేవు అంటాడు శంకరుడు. కాదు ప్రళయం వచ్చేస్తుంది... అంతా త్వరలోనే నాశనమైపోతుంది అంటాడు శూన్యవాది. మొదలైతే కదా ముగిసిపోవడానికి... కనుక ఈ పందెం కొనసాగుతూనే ఉంటుంది. మహాయుగాలు అంతరించి కలియుగాలు వచ్చినప్పుడల్లా పై పందాలు పడుతూనే ఉంటాయి. ఇది ఎప్పటికీ ముగిసిపోని క్రీడ. ఈ క్రీడనే గమనిస్తూ అలిసిపోతున్న మానవుణ్ణి సేదతీర్చి బ్రహ్మసత్యాన్ని దర్శింప చేయడమే శంకరావతార రహస్యం’’ అన్నాడు కాళిదాసు.
విక్రమార్కునితో కలిసి తామంతా ప్రతిరోజూ కూర్చునే స్థానాలలో కాళిదాసు, వరరుచి స్థిరపడ్డారు. ఆ అసురసంధ్య వేళలో మహాకాళేశ్వరుని సన్నిధి నుంచి కాహళీధ్వని వినవస్తోంది. చతుష్షష్టి యోగినులతో నిత్యసేవలందుకునే హరసిద్ధి కాళీమాతకు హారతి పడుతున్న దృశ్యం వారికి కనులవిందు చేస్తోంది. – సశేషం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top