క్లాస్‌ టీచర్‌

Special Story About Snehil Dixit Mehra - Sakshi

పిల్లల్తో గడిపితే పెద్దవాళ్లూ పిల్లలైపోతారు. ‘బీసీ ఆంటీ’ వీడియోలు చూసినా అంతే! పెద్దల్ని పిల్లలుగా అప్‌లోడ్‌ చేసేస్తుంటారు ఆ ‘ఆంటీ’. అటెండెన్స్‌ తీసుకుంటారు. ‘ప్రెజెంట్‌ మిస్‌’ అనకపోతే క్లాస్‌ తీసుకుంటారు. 
అక్షయ్, ఆయుష్మాన్, సల్మాన్, సోనూ.. బాలీవుడ్‌ హీరోలంతా బీసీ ఆంటీ స్టూడెంట్సే. వాళ్లే కాదు.. 2025 బ్యాచ్‌ పిల్లలు కూడా!!

ఇరవై ఐదేళ్ల తర్వాత.. 2025 సం.లో. ఒక స్కూల్లోని తరగతి గది. 
‘‘గుడ్‌.. మా.. ణింగ్‌... మీస్‌!’’ 
‘‘గుడ్‌ మాణింగ్‌ క్లాస్‌. నౌ అయామ్‌ గోయింగ్‌ టు టేక్‌ యువర్‌ అటెండెన్స్‌. వెన్‌ యు హియర్‌ యువర్‌ నేమ్స్‌ సే ప్రెజెంట్‌ మిస్‌. ఓకే..’’
‘‘క్వారెంటీనా జోషీ’’
‘‘ప్రెజెంట్‌ మిస్‌’’
‘‘లాక్‌డౌన్‌ సింగ్‌ రాథోడ్‌’’
‘‘ప్రెజెంట్‌ మిస్‌’’
‘‘కోవిడ్‌ అవస్థీ’’
(నో ఉలుకు.. నో పలుకు)
‘‘కోవిడ్‌!! బి అటెన్షన్‌ ఇన్‌ ద క్లాస్‌. అదర్‌వైజ్‌ ఐ విల్‌ సెండ్‌ యు బ్యాక్‌ టు చైనా’’.
‘‘కొరోనా పాల్‌ సింగ్‌’’
‘‘ప్రెజెంట్‌ మిస్‌’’
‘‘సోషల్‌ డిస్టాన్‌ సింగ్‌’’
‘‘ప్రెజెంట్‌ మిస్‌’’
‘‘మాస్క్‌ మెహ్‌తో’’
‘‘ప్రెజెంట్‌ మిస్‌’’.
‘‘గ్లౌవ్స్‌ గైక్వాడ్‌’’
‘‘ప్రెజెంట్‌ మిస్‌’’.
‘‘ఊహాన్‌ భదోరియా’’
(నో ఉలుకు.. నో పలుకు)
‘‘ఊహాన్‌! యు అండ్‌ కోవిద్‌ ఆర్‌ వెరీ నాటీ! గెటవుట్‌ ఆఫ్‌ మై క్లాస్‌ రైట్‌ నౌ’’
‘‘అండ్‌.. మై ఫేవరేట్‌ ఆత్మనిర్భర్‌ కేలావాలా..’’ 
‘‘ప్రెజెంట్‌ మిస్‌’’

ఈ వీడియో వాట్సాప్‌లో మీకూ వచ్చే ఉంటుంది. టీచర్‌ అంటెండెన్స్‌ తీసుకుంటూ ఉంటారు. పేరు పిలిస్తే స్పందించని కోవిద్‌ని, ఊహాన్‌ని మందలిస్తారు. తనకెంతో ఇష్టమైన స్టూడెంట్‌.. ఆత్మనిర్భర్‌ కేలావాలా నైతే మురిపెంగా పిలుస్తారు. అక్కడితో వీడియో ముగుస్తుంది. ఆ టీచర్‌ పేరు స్నేహిల్‌ దీక్షిత్‌ మెహ్రా. యాభై సెకన్ల కన్నా తక్కువ నిడివిలో ఉన్న ఈ ‘క్లాస్‌ ఆఫ్‌ 2025’ అనే వీడియోతో స్నేహిల్‌ ఇటీవల బాగా పాపులర్‌ అయ్యారు. ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ‘బీసీ ఆంటీ’గా ఆమెకు లక్షలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. బీసీ అంటే భేరీ క్యూట్‌. భేరీ ఏంటి! ఢంకా, టింఫనీ. ధ్వనివాద్యం. అలాంటి పేరును ఎందుకు పెట్టుకున్నారు? పైగా స్నేహిల్‌ అప్‌లోడ్‌ చేసే తన వీడియోలన్నిటిలోనూ ఆమె సౌమ్యంగా, శ్రావ్యంగా ఉంటారు. ఆమెకు వచ్చే కామెంట్స్‌ కూడా ఆహ్లాదంగా ఉంటాయి. ఉదయం లేవగానే సోషల్‌ మీడియాలో సంచరించడం స్నేహిల్‌కు ఇష్టమైన వ్యాపకం. భర్తతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఈ ‘క్లాస్‌ ఆఫ్‌ 2020’ ఐడియా వచ్చిందట. వెంటనే  నాలుగు మాటలు రాసుకుని టీచర్‌గా తయారైపోయారు. వీడియోలో అటెండెన్స్‌ తీసుకుంటూ స్నేహిల్‌ కనిపిస్తుంటారు. ‘ప్రెజెంట్‌ మిస్‌’ అని పిల్లల గొంతులు మాత్రం వినిపిస్తుంటాయి. కరోనాపై అల్లిన హాస్యం ఇది.

స్నేహిల్‌ ముంబైలో ఉంటారు. ఇంజినీరింగ్‌ చదివారు. పదేళ్ల క్రితం యు.పి.లోని ఘజియాబాద్‌ నుంచి వచ్చారు. వినోదం అంటే ఇష్టం. వెబ్, టీవీ సీరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఒక ప్రైవేటు సంస్థలో క్రియేటివ్‌ డైరెక్టర్‌. ఇటీవల ఆమె విడుదల చేసిన మరొక వీడియో సిరీస్‌.. ‘క్లాస్‌ ఆఫ్‌ హీరోస్‌’. అంతా బాలీవుడ్‌ హీరోలు. వారిలో సోనూ సూద్‌ లేకుండా ఉంటారా? అదీ ఈ కరోనా టైమ్‌లో. ఆయనతో పాటు ఆయుష్మాన్‌ ఖురానా, అక్షయ్‌ కుమార్, అనిల్‌ కపూర్, హృతిక్‌ రోషన్, ట్రైగర్‌ ష్రాఫ్, సల్మాన్‌ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌.. వీళ్లందరూ ఆమె క్లాస్‌లోని స్టూడెంట్సే. ఒక్కొక్కరి పేరూ పిలిచి వాళ్ల కాండక్ట్‌ రిపోర్ట్‌ చెబుతుంటారు, మెచ్చుకుంటుంటారు, మృదువుగా హెచ్చరిస్తుంటారు, సరిచేస్తుంటారు స్నేహిల్‌. ఈ వీడియోలో ఎక్కువ మార్కులు పడింది సోనూ సూద్‌కే! ‘‘సాయం చెయ్యగలిగిన వారు ముందుకు వస్తే.. ‘మనమేం చేయగలం’ అనే ఊగిసలాటలో ఉన్నవారూ చొరవగా ఆసరా ఇచ్చేందుకు వస్తారు’’  ..  అంటారు స్నేహిల్‌. ఆమె అంటున్నది కరోనా గురించి మాత్రమే కాదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top