సిస్టర్‌... అమ్మను మరిపించింది

Special Story About Pheroja From Afghanistan - Sakshi

బిడ్డను కన్న తల్లి కూడా అప్పుడే పుట్టినట్లుగా ఉండే చోటు ప్రసూతి వార్డు! రెండు ప్రాణాలు ఒత్తిగిలే పొత్తిలి. ప్రశాంత వనం. దేవదూతల మందిరం. అకస్మాత్తుగా తుపాకీ చప్పుళ్లు! ఎవరు మీరు?! ఎవరు కావాలి? ‘తల్లీ బిడ్డా.. ఇద్దరూ’!!!!

కరోనా కాలమైనా, కారుణ్య మాసమైనా ఉగ్రవాదుల పని ఉగ్రవాదులకు ఉంటుంది. అందుకే చొరబాట్లు, మారణహోమాలు ఆగడంలేదు. ఈ నెల 12 మంగళవారం ఉదయం ఆప్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని బార్చి నేషనల్‌ ఆసుపత్రి లోపలికి ప్రవేశించిన ముగ్గురు సాయుధులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 24 మంది మరణించారు. చనిపోయిన వారిలో అప్పుడే పుట్టిన పసికందులు ఇద్దరు, పద్దెనిమిది మంది బాలింతలు, నర్సులు ఉన్నారు. ఆ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులతో పాటు ‘డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ అనే అంతర్జాతీయ చారిటీ సంస్థ ఒక ప్రసూతి వార్డును నిర్వహిస్తోంది. ఆ వార్డుతో కలిపి మొత్తం 26 మంది బిడ్డ తల్లులు.. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆసుపత్రి లోపల ఉన్నారు. ఆఫ్ఘన్‌ భద్రతా దళాలుగా చెప్పుకున్న ఆ ముగ్గురు సాయుధులు సరాసరి ఆసుపత్రి లోపలికి వెళ్లి తల్లుల్ని వెదకి వెదకి కాల్పులు జరిపారు. వారిని నుంచి కొందరినైనా కాపాడేందుకు ఆసుపత్రి సిబ్బంది తల్లీ బిడ్డల్ని ‘డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ ప్రసూతి వార్డులోకి తరలించి తలుపులు బిగించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి. 

‘‘ఆ క్షణంలో నాకు చాలా భయం వేసింది. పురుటి నొప్పుల అరుపులు బయటికి వినిపించకూడదు. బిడ్డ భూమి మీదకు వచ్చాక బిడ్డ ఏడుపూ వినిపించకూడదు. వినిపిస్తే ఆ దుండగులు లోపలికి వచ్చి చంపేయడం ఖాయం. వాళ్లు ప్రసూతి వార్డులను మాత్రమే లక్ష్యం చేసుకుని, పడకల మీద ఉన్న తల్లీబిడ్డలను చంపుతున్నట్లు మాకు వెంటనే అర్థమైంది. కొందరిని ‘సేఫ్‌ రూమ్‌’ల లోనికి, కొందరిని డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ వాళ్ల ప్రసూతి వార్డులోకి తీసుకురాగలిగాం. ఆ క్రమంలోనే మాలో ఒక నర్సు తూటాలకు ఒరిగిపోయింది. నేను తప్పించుకోగలిగాను’’ అని శుక్రవారం ఫోన్‌ ద్వారా ఎ.ఎఫ్‌.పి. (ఏజెన్స్‌ ఫ్రాన్స్‌ ప్రెస్‌) వార్తా సంస్థ ప్రతినిధికి అందుబాటులోకి వచ్చిన మిడ్‌వైఫ్‌ ఒకరు ఆనాటి దారుణాన్ని గుర్తుకొస్తున్నంత వరకు చెప్పగలిగారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కూడా ఆమె గొంతు వణుకుతుండటాన్ని ఆ ప్రతినిధి గమనించారు. 

‘‘బయటి నుంచి వాళ్లు తలుపులు బాదుతూనే ఉన్నారు. నొప్పులు పడుతున్న తల్లి పక్కన నేను, ఇంకో నర్సు ఉన్నాం. డెలివరీకి అవసరమైన సామగ్రి ఉండే లేబర్‌ రూము కాదది. అరుపులు వినిపించకుండా నొప్పుల్ని భరించమని ఆ తల్లిని వేడుకున్నాం. ఆమె తన ప్రాణాల్ని బిగబట్టుకుని శిశువును ప్రసవించింది. అప్పుడు మాకు రెండు సమస్యలు వచ్చాయి. బిడ్డ ఏడుపు బయటికి వినిపించకూడదు. బొడ్డు తాడు కత్తిరించడానికి బ్లేడు లేదు. వట్టి చేతులతోనే నేను బొడ్డతాడు తెంపగలిగాను. బిడ్డ ఏడుపును ఆపలేకున్నా, నా వేలిని బిడ్డ పెదవులపై ఆన్చి కొంత శబ్దాన్ని తగ్గించగలిగాను.

గదిలో టాయ్‌లెట్‌ పేపర్‌లు తప్ప వేరే ఏమీ లేవు. బిడ్డను, తల్లిని చుట్టడానికి నేను, నాతో ఉన్న నర్సు మా హెడ్‌ స్కార్ఫ్‌లను ఉపయోగించాం’’ అని చెప్పారు మిడ్‌ వైఫ్‌. కరోనాతో సతమతమౌతున్న ప్రపంచం మంగళవారం నాటి ఉగ్రదాడితో ఒక్కసారిగా నివ్వెరపోయింది. తల్లీబిడ్డల్ని లక్ష్యంగా చేసుకుని మారణహోమాన్ని సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ చరిత్రలో ఎన్నడూ జరగని అమానుష ఘటన ఇది.  భద్రతాదళాలు వచ్చి ముగ్గురు దుండగుల్ని మట్టుపెట్టాక, గట్టి రక్షణ మధ్య తల్లుల్ని కోల్పోయిన పద్దెనిమిది మంది శిశువుల్ని చికిత్స కోసం అక్కడికి దగ్గరల్లోని అటాటుర్క్‌ ఆసుపత్రికి తరలించారు.

అమృతం పట్టిన అమ్మ
కాల్పుల అనంతరం బార్చి నేషనల్‌ ఆసుపత్రి నుంచి అటాటుర్క్‌ ఆసుపత్రికి తరలించిన పద్దెనిమిది మంది శిశువులకు తల్లులు లేకపోవడంతో పాలు దొరకడం కష్టమైపోయింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న ఫెరోజా ఒమర్‌ అనే 27 ఏళ్ల కాబూల్‌ మహిళ.. ఆకలితో అలమటిస్తున్న శిశువులకు తన స్తన్యం పట్టారు! మూడు గంటల వ్యవధిలో ఆమె తన పాలచుక్కలతో నలుగురు పసికందుల ప్రాణాలు నిలబెట్టారు. తల్లులపై ఉగ్రవాదులు దాడి చేశారన్న వార్త చూస్తున్న సమయంలో ఇంట్లో తన నాలుగు నెలల బిడ్డకు పాలు పడుతూ ఉన్నారు ఫెరోజా. 

ఆసుపత్రిలో ఆనాథ శిశువుకు పాలు పడుతున్న ఫెరోజా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top