పసి వయసు పరబ్రహ్మ

She has donated her organs according to wishful thinking - Sakshi

స్ఫూర్తి దాత

ప్రాణాలు పంచి వెళ్లిన విద్యార్థిని

గత ఏడాదే తండ్రి మరణం!

ఒకే రోజు వస్తున్న ‘కర్మ’దినాలు

తల్లడిల్లుతున్న తల్లి హృదయం

ఏడాది క్రితం..!
మెట్టుమెట్టుగా భవిష్యత్‌ను నిర్మించుకుంటూ పదో తరగతి చేరింది పద్నాలుగేళ్ల అవులూరి అభినయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామంలో సాధారణ కుటుంబం అభినయది. కొత్తగూడెంలోని గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. సోదరుడు వెంకట్‌ వరుణ్‌ పాల్వంచ కేఎల్‌ఆర్‌ కాలేజీలో మైనింగ్‌లో డిప్లొమా చేస్తున్నాడు. ఆమె తండ్రి శ్రీనివాసరావు ఒక ప్రింట్‌ మీడియాలో సీనియర్‌ జర్నలిస్ట్‌. గతేడాది ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చనిపోయారు. ఆరోజే ఒక్కసారిగా అభినయ కలలసౌధం కుప్పకూలింది. 

చెప్పాలని ఉంది..!
తండ్రి ఎడబాటుతో అభినయ విచలితురాలైంది. ఒక వైపు తల్లి శోకాన్ని పరికిస్తూ, మరోవైపు.. ఆవేదనలో  ఉన్న సోదరుడిని ఓదారుస్తూ, తండ్రినే కలవరిస్తూ, పలవరిస్తూ నీరసపడిపోయింది. పగలంతా తండ్రి జ్ఞాపకాలు. రాత్రి నిద్రలోనూ తండ్రిని కోల్పోయిన పీడకలలే. ఆ క్రమంలోనే రోజురోజుకూ నీరసించిన అభినయను మానసిక నిస్సత్తువ కుంగదీసింది. తీరని ఆ  విషాదంలోనే తలనొప్పి రూపంలో ఆమెను తీవ్రమైన అనారోగ్యం వెంటాడింది. వైద్యులకే అంతుచిక్కని వ్యాధితో కృషించి పోయింది అభినయ. దాంతో కొత్తగూడెంలో వైద్యం అందిస్తున్న స్థానిక వైద్యులు హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రికి రిఫర్‌ చేశారు.

ఇదంతా గమనిస్తున్న అభినయ తన తల్లి కవితకు మనసులో మాటేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపించేది. ఇదేదో ప్రాణాంతక వ్యాధి అని గ్రహించిందో ఏమో ఆ చిట్టి తల్లి.. తను పోయినా నలుగురిలో బతికుండాలని తపన పడింది. తటపటాయిస్తూనే ‘చిరంజీవి’గా ఉండిపోవాలనే తన జీవితేచ్ఛను తల్లి చెవిలో విన్పించింది. అందుకు తల్లి కవిత, సోదరుడు వెంకట్‌ వరుణ్‌  అంగీకరించారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం, విద్యాదానం, నేత్రదానం గొప్పవని మనంచెప్పుకుంటుంటాం. అయితే బాల్యమింకా పూర్తిగా వీడకుండానే అవయవదానం చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాలని అభినయ ఆశించిందని తెలిసి పలువురి కళ్లు చెమర్చాయి.  

ఐదుగురికి పునర్జన్మ 
బ్రెయిన్‌ డెడ్‌ అయిన అభినయ కళ్లు, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం బాగానే పనిచేస్తున్నాయి. వీటిని అవసరమైన ఐదుగురు రోగులకు వైద్యులు అమర్చారు. అలా అభినయ వల్ల ఐదుగురికి పునర్జన్మ లభించింది. కడసారిగా తను సంకల్పించినట్టుగానే ఆ చిన్నారి తన జీవితేచ్ఛను నెరవేర్చుకుంది. పిన్న వయసులోనే పదుగురికి ఆదర్శంగా నిలిచి ఇక వీడ్కోలంటూ మరలిరాని లోకాలకేగినా ఈ భువిపై తరతరాల జ్ఞాపకంగా అందరి మదిలో నిలిచిపోయింది. ∙విషాదమేమిటంటే ఆమె తండ్రి కర్మ ఈనెల 17వ తేదీన వస్తుండగా, అదే తేదీన అభినయ కర్మ కూడా రావడం! ఈ విషయాన్ని చెబుతూ, ‘ఇదేమి కర్మ భగవంతుడా’ అని అభినయ తల్లి కవిత బోరున విలపించింది. 

‘అది నా బిడ్డ చివరి కోరిక’
‘‘నా బిడ్డ లోకం విడిచిపోయినా ఐదుగురికి పునర్జన్మనిచ్చి వెళ్లింది. నా భర్త  జాండీస్‌ సోకి, అనారోగ్యంపాలై ఆకస్మికంగా చనిపోయారు. తండ్రి పోయాక అభినయ బాగా నీరసించిపోయింది. భరించలేని తలనొప్పితో ఈనెల ఐదున అనారోగ్యం పాలైంది. వెంటనే హైదరాబాద్‌ తీసుకెళ్లాం. అక్కడ రెండు రోజుల పాటు వైద్యం అందించారు. ఏడవ తేదీ సాయంత్రం అభినయకు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని చెప్పారు. లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. అభినయ కోరిక ప్రకారం ఆమె అవయవాలు దానం చేశాం’’ అని చెప్పారు కవిత. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top