ఆధునిక మహాభారతం

Review Of Adhunika Mahabharatam Book - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

కదిలించే శక్తి పద్యానికి ఉండాలని, అప్పుడే కవిత్వానికి సార్థకత ఉంటుందని గుంటూరు శేషేంద్రశర్మ అభిప్రాయం. ఆయన రాసిన ‘ఆధునిక మహాభారతం’లో– ఒక అందమైన పోయెం అంటే/ దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ పీడితుల పక్షం వహించాలి/... పద్యం మనిషి విజయానికి/ ఒక జెండా అయ్‌ ఎగరాలి’’ అని తన కవితాలక్ష్యం గూర్చి స్పష్టం చేశారు. పాటలుగా, పద్యాలుగా, గేయాలుగా, వచన కవిత్వంగా విభిన్న ధోరణులుగా సాగిన కవిత్వ సందర్భాల సమాహారమే ఆధునిక మహాభారతం. తాను రాసిన అన్ని కవితా సంపుటాలనూ కలిపి ‘ఆధునిక మహాభారతం’గా వెలయించారు. శేషేంద్ర కవితాభివ్యక్తిలో కొంత నెత్తురు, కాసింత అత్తరు మిళితమై ప్రవహిస్తుంటాయి. నెత్తురు ప్రగతి భావాలకు ప్రతీకగా, అత్తరు సౌందర్యానికి ప్రతిబింబంగా పరిమళిస్తుంది. ఆధునిక మహాభారతం చదివితే గులాం మనస్తత్వం కారణంగా వంగిపోయిన మోకాళ్లలో బలం వచ్చి మనిషి కాళ్లు నిటారుగా నిలుస్తాయి. ఈ కల నెరవేరడానికి ఆధునిక మహాభారతాన్ని ప్రజా పర్వం, సూర్య పర్వం, పశు పర్వం, ప్రవాహ పర్వం, ఆదర్శ పర్వం, ప్రేమ పర్వం, సముద్ర పర్వం, జోత్సా్న పర్వం, మౌక్తిక పర్వం, మయూర పర్వం అని విభజించారు.

‘జయం’ భారత కథకు మూలపదార్థం. అలాగే ఆధునిక మహాభారతానికి ప్రజా పర్వంలోని (ఖండ కావ్యం) ‘నా దేశం – నా ప్రజలు’ నూక్లియస్‌లాంటిది. రైతు జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని రాసిన ఈ కావ్యంలో పొలాలు, పర్వతాలు, కొడవళ్లు, నాగళ్లు, కాలువలు, వృక్షాలు, పక్షులు పాత్రలు. విభిన్న రూపాల్లో శ్రమ చేస్తున్న అన్ని వర్గాలకు సంకేతంగా నిలుస్తుంది. ఎత్తుగడలో, దృక్పథంలో, నిర్మాణ సౌష్టవంలో విలక్షణమైన నూతన సృష్టి, ఈ కావ్యంతో తెలుగు కవిత్వం ఓ మలుపు తిరిగిందని చెప్పడం తొందరపాటు కాదనుకుంటాను అంటారు శేషేంద్ర.

‘‘లేస్తోంది ఉషః కాంతుల్లో ఒక హస్తం – ఆ హస్తం కాలం అనే నిరంతర శ్రామికుడి హస్తం. మనిషి పొలాల్లో ప్రవహించే చెమటతో రక్తంతో మునిగి లేస్తోంది. దూరదూరాలకు సిందూర కాంతులు చిందుతూ ఉందంటారు. ‘‘చూడు స్వేద బిందువులు తాగి సూర్యుడు మరింత తేజస్వి అవుతున్నాడు. సుత్తులు, కొడవళ్లు లాంటి కిరణాలు మిలియన్లు, మిలియన్లు ప్రదానం చేస్తున్నాడు.’’ సూర్యుడు తేజస్విలా ఉండటానికి శ్రమజీవుల స్వేద బిందువుల్ని ఆస్వాదించడమే కారణమని గ్రహించాలి. ‘‘పిట్టయితే ఎగిరిపోతుంది. చెట్టు ఎక్కడికి పోతుంది. తుపానులు చుట్టుముట్టినా ఆ నేలకే అంకితమై ఉంటుంది వేళ్లతో ధరిత్రిని పట్టుకొని, సెంటు భూమి లేకపోయినా అంటిపెట్టుకొని ఉన్న నాలాగే’’ అంటాడు శేషేంద్ర. రైతు శ్రమించి ఒళ్లు చందనపు చెక్కలా అరిగి జీర్ణించిపోయి, అస్తమించే అంతిమ దశ విషాద స్వరపూరితంగా మయూర పర్వంలో కనిపిస్తుంది. ఎలాంటి ఇజాలకు తావివ్వకుండా ఈ గ్రంథంలో హ్యూమనిజానికే రచయిత పెద్దపీట వేశాడు.

-వాండ్రంగి కొండలరావు

మిమ్మల్ని బాగా కదిలించి, మీలో ప్రతిధ్వనించే పుస్తకం గురించి మాతో పంచుకోండి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top