పొగ రాని పొగాకు అలవాటూ ప్రాణాంతకమే! | Poga deadly habit to smoke, do not fall! | Sakshi
Sakshi News home page

పొగ రాని పొగాకు అలవాటూ ప్రాణాంతకమే!

May 30 2016 10:59 PM | Updated on Sep 4 2017 1:16 AM

పొగ రాని పొగాకు అలవాటూ ప్రాణాంతకమే!

పొగ రాని పొగాకు అలవాటూ ప్రాణాంతకమే!

నేను గతంలో సిగరెట్ తాగేవాణ్ణి. ఆరోగ్యం పాడవుతుందని పొగతాగడం మానేశాను.

ఓరల్ హైజీన్ కౌన్సెలింగ్

 

నేను గతంలో సిగరెట్ తాగేవాణ్ణి. ఆరోగ్యం పాడవుతుందని పొగతాగడం మానేశాను. కానీ గుట్కా తినడం మొదలుపెట్టాను. పొగతాగడం కంటే ఈ అలవాటు సురక్షితమైనదే కదా? - నరేందర్,  కందుకూరు
మీది కేవలం అపోహ మాత్రమే. పొగ వచ్చే సిగరెట్ల కంటే, పొగ రాని పొగాకు వల్లనే హాని ఎక్కువ. పొగాకు అనేక నోటి సమస్యలకు, నోటి దుర్వాసనకు, చిగుర్ల వ్యాధులకు కారణం. పొగాకు వినియోగం రెండు రకాలుగా ఉంటుంది.

 
1. పొగను వెలువరించేలా వాడటం : సిగరెట్లు, పైప్‌లు, సిగార్లు.
2. పొగ రాకుండా వాడటం : గుట్కాల వంటి రూపంలో పొగాకు నలమడం, ముక్కుపొడి (స్నఫ్),  పొగాకును ముందు పెదవి కింద పెట్టుకొని పీలుస్తూ ఉండటం. పొగ వచ్చేలా పొగాకును వాడటం కంటే పొగరాని విధంగా దాన్ని వాడటం అంత హానికరం కాదని చాలా మందిలో ఉండే  అపోహ. అందుకే సిగరెట్ వంటివి మానేసి, పొగరాని పొగాకును అలవాటు చేసుకుంటారు. కానీ నిజానికి పొగవచ్చేలా పొగతాగడం కంటే పొగలేని పొగాకు వాడకంలో క్యాన్సర్ కారకాలు మరో 28 ఎక్కువ.


పొగాకు నమలడం వల్ల పళ్లకు నష్టాలు :  ఈ అలవాటు వల్ల పళ్ల మీద మరకలు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి  నోటి నుంచి దుర్వాసన వస్తుంది  ముక్కుకు వాసనలు, నోటికి రుచి తెలియవు  నోటిలో ఊరే లాలాజలం తగ్గుతుంది. దాంతో దంతక్షయం పెరుగుతుంది  పిప్పిపళ్లు, చిగుర్ల సమస్యలు వస్తాయి  పంటి మీది ఎనామిల్ దెబ్బతింటుంది  వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వాటంతట అవే తగ్గిపోయే సమస్యలు సైతం అపాయకరంగా మారవచ్చు  చిగుర్ల లైన్ కిందికి వెళ్తుంది  పొగాకు వల్ల చిగుర్ల వద్ద పేరుకున్న మృతకణాలు మరింతగా పేరుకుపోయి, దంతక్షయాన్ని మరింతగా పెంచుతాయి  పొగతాగేవారితో పోలిస్తే పొగాకు నమలడం, గుట్కా రూపంలో చప్పరించడం అలవాటు ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. హానికరమైన ద్రవాలు ఎక్కువ కావడం అన్న అంశం చిగుర్లపైన, పెదవులపైన, గొంతులోన దుష్ర్పభావాలు చూపుతుంది. నోటిలోపలి మృదుకణజాలంపై పుండ్లు పడే (ల్యూకోప్లేకియా వచ్చే) అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దీనివల్ల నోరు, గొంతు, ఊపిరితిత్తులకు గాలిని అందించే మార్గం, ఆహారనాళం క్యాన్సర్లు రావచ్చు.

 
పళ్లకు పొగాకు హాని ఇలా :  మనం కోరుకున్న చల్లటి పానీయాలు/వేడి పానీయాలను ఆస్వాదించలేము  పళ్లు పాడైపోవడం వల్ల అందం దెబ్బతినవచ్చు, అందమైన చిరునవ్వూ దూరంకావచ్చు  నోట్లో పుండ్లు పడవచ్చు  పళ్లలో రంధ్రాలు పడవచ్చు (క్యావిటీలు రావచ్చు)  మామూలు వారితో పోలిస్తే పొగాకు దురలవాటు ఉన్నవారికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయాల్సిన అవసరాలు మరింత ఎక్కువ.

 
ఇతర అవయవాలకూ హానికరమే : పొగాకు వల్ల గుండెకు నేరుగా హాని జరుగుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి  కణంలోని జన్యు పదార్థాలు / డీఎన్‌ఏకు హాని జరుగుతుంది.

 
నోటికి హాని జరుగుతుందని గుర్తించేందుకు లక్షణాలు :  నోట్లో చాలాకాలం వరకు తగ్గని పుండ్లు (అల్సర్స్)  నోటిలో ఎక్కడైనా కండ పెరగడం  తెల్లని మచ్చ కనిపించడం  నమలడంలో ఇబ్బంది  నోరు / నాలుక /దవడల  కదలికలు మందగించడం  చాలాకాలం పాటు గొంతు బొంగురుగా ఉండటం  గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించడం... ఇక్కడ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించాలి. మనకు వచ్చే ఎన్నో వ్యాధులను పొగతాగడం మానేసి మనమే నివారింకోచగలం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులనూ రాకుండా చేసుకోగలం. అకాల మృత్యువునూ ఆపగలం.

 

డాక్టర్ ఎం. ప్రత్యూష
కన్సల్టెంట్ డెంటల్ అండ్ కాస్మటిక్ సర్జన్
స్పెషలిస్ట్ ఇన్ డెంటల్ లేజర్స్, ఓరల్ క్యాన్సర్స్ అండ్ ట్రామాకేర్,
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్

 

 

ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
సిగరెట్ పొగ ప్రభావం గర్భధారణపై ఉంటుందా?

 నా భర్త సిగరెట్ తాగుతారు. ఆ అలవాటు నా గర్భధారణపై ఏమైనా ప్రభావం చూపుతుందా? - ఒక సోదరి, హైదరాబాద్
పొగతాగే దురలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దాంతో పాటు మీ భర్తలోని ఆ అలవాటు మీ గర్భధారణ విషయంలోనూ ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. ఈ అలవాటు దంపతులిద్దరిలోనూ దుష్ర్పభావాలు చూపుతుంది. సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యంపై దాని ప్రభావమూ పెరుగుతుంది. భర్తకు సిగరెట్ అలవాటు ఉంటే, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల భార్యపై కూడా దాని దుష్ర్పభావం కనిపిస్తుంది. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి సంతానం కలగడం చాలా ఆలస్యం కావచ్చు. భర్త స్మోకింగ్ కారణంగా భార్యలోని జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య గణనీయంగా తగ్గడం సాధారణంగా కనిపిస్తుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు... సంతాన సాఫల్యం కలిగేలా చూడాల్సి వస్తే ఐవీఎఫ్ ప్రక్రియలో ఆమె ఓవరీ స్టిమ్యులేషన్‌కు మరిన్ని మందులు అవసరమవుతాయి. సాధారణ దంపతులతో పోలిస్తే భర్తకు ఈ దురలవాటు ఉన్న మహిళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మహిళల్లో స్మోకింగ్ వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయి.


గర్భస్రావాలు అయ్యే అవకాశాలూ పెరుగుతాయి. వారికి నెలలు నిండకముందే బిడ్డపుట్టడమూ జరుగుతుంది. అలా పుట్టే పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉంటుంది. వారి పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. పురుషుల్లో స్మోకింగ్ అలవాటు వల్ల వారికి అంగస్తంభన సమస్యలూ రావచ్చు. అంతేగాక... వారి వీర్యంలో శుక్రకణాల సంఖ్య, కదలిక తగ్గుతుంది. దానితో పాటు వీర్యం పనితీరు కూడా తగ్గుతుంది. ఇది సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే మీ భర్తను తక్షణం ఆ అలవాటు మానేసేలా చూడండి. ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా మానలేకపోతే డాక్టర్లు, సపోర్ట్ గ్రూప్ సహాయం తీసుకోండి.

 

 

డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement