నాడుల పెరుగుదలకు  కొత్త పద్ధతి

New method of nerve growth - Sakshi

ప్రమాదాలు.. గాయాలు.. ఆ మాటకొస్తే స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లపై ఎక్కువగా టైపింగ్‌ చేసినా సరే.. శరీరంలోని కొన్ని నరాలు దెబ్బతింటాయి. ఫలితంగా చేతులు, కాళ్లలో తిమ్మిరి, బలహీనత, స్పర్శ తెలియకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటివరకూ ఈ పెరిఫరల్‌ న్యూరోపతికి చికిత్స కొన్ని నెలలపాటు మందులు వాడటమే. అయితే వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని సమీప భవిష్యత్తులో దెబ్బతిన్న నాడులను వేగంగా నయం చేసే వీలుంది. శరీరంలోకి జొప్పించగల చిన్న పరికరం ద్వారా నాడులకు క్రమంగా విద్యుత్‌ ప్రచోదనాలు అందించడం ద్వారా ఎలుకల్లో తాము నాడీ గాయాలు వేగంగా మానిపోయేలా చేయగలిగామని విల్సన్‌ జాక్‌ రే అనే శాస్త్రవేత్త తెలిపారు.

పావలా కాసంత ఉండే ఈ పరికరం రెండు వారాల్లోపు నిరపాయకరంగా శరీరంలో కరిగిపోతుందని అన్నారు. విద్యుత్‌ ప్రచోదనాలతో నాడులు మళ్లీ పెరిగేలా చేయవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ ఎలా దీన్ని సాధ్యం చేయాలన్నది ఇప్పటివరకూ సమస్యగా ఉండిందని, కొత్త పరికరంతో ఈ సమస్య తీరినట్లేనని జాక్‌ రే తెలిపారు. మెదడులోని న్యూరాన్లు, వెన్నెముక నాడులను మినహాయిస్తే మిగిలినవి మళ్లీ పెరిగేలా చేయవచ్చు. విద్యుత్తు ప్రచోదనాల ఫలతంగా కొన్ని ప్రొటీన్లు విడుదలై గాయం వేగంగా మానుతుందని అంచనా.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top