సిరి వరాలు

సిరి వరాలు


మనింట్లోనే ఉంది మహాలక్ష్మి!

ముస్తాబైతే అచ్చం వరమహాలక్ష్మియే!

పూజించనక్కర్లేదు.

నైవేద్యం పెట్టనక్కర్లేదు.

మనింటి అమ్మాయి

వరాలు ఇస్తూనే ఉంటుంది.

ఇవాళ వరలక్ష్మీ వ్రతం

మన ఇంటి వరలక్ష్ములకు

అందమైన అలంకరణలు పట్టుచీరలు.




నీలం, బంగారు రంగు కలిసిపోతే వచ్చే మెరుపు ఈ చీర సొంతం. గులాబీ రంగు అంచు మీద అచ్చమైన జరీ జిలుగులు పండగ శోభను పెంచుతున్నాయి. దీనికి డిజైనర్‌ బ్లౌజ్‌ను జత చేయడంతో నవతరాన్ని ‘పట్టు’ అమితంగా ఆకట్టుకుంటుంది.



పట్టు చీరకు నిలువెల్లా అల్లుకున్న జరీ పువ్వుల సొగసు చూపుతిప్పుకోనివ్వడం లేదు. అదే రంగులో ఆకట్టుకునే అంచు లక్ష్మీపూజలో వేయి దీపాల వెలుగులు విరబూయడానికి సిద్ధం అంటుంది.



ఈ తరం వరమహాలక్ష్మి మేనికి లైట్‌వెయిట్‌ పట్టుచీర కొంగొత్త కలలకు ఆహ్వానం పలకడానికి సిద్ధం అంటోంది. సంప్రదాయంలోనూ ఆధునికత తోడైతే అలంకరణ కొత్త రెక్కలు కట్టుకుంటుంది.



అమ్మ పట్టుచీర కొత్తగా రూపుకట్టాలంటే దానికి కొత్త హంగులు జతచేర్చాలి. అందుకు అచ్చమైన పట్టుచీరనే ఓ ఉదాహరణ. ముదురు పసుపు ప్లెయిన్‌ పట్టుచీరకు కళ తెచ్చే అంచు, చీరను మరింత హైలైట్‌ చేసే డిజైనర్‌ జాకెట్టు వేడుకకు వెయ్యింతల వెలుగులు తెస్తుంది.



పండగకళ రావాలంటే ఆకుపచ్చ రంగు ఇంటికి తోరణమవ్వాల్సిందే! శ్రావణలక్ష్మిని ఆహ్వానించాలంటే పచ్చరంగు పట్టుచీర జిలుగులు నలువైపులా పరుచుకోవాల్సిందే! చిన్న చిన్న జరీ బుటీతో సెల్ఫ్‌ బార్డర్‌తో ఆకట్టుకునే ఇలాంటి డిజైన్లు ఎన్నో మనసును కట్టడి చేస్తూనే ఉంటాయి.



నీలాకాశం ఇలకు దిగితే.. ఆ చుక్కలు నట్టింట్లో నడయాడితే.. ఆ అందాన్ని, ఆనందాన్ని వర్ణించడం తరమా! మన ఇంటి వరమహాలక్ష్మి పట్టుచీరలో ఇలా కనువిందు చేస్తే కళ్లూ, మనసూ నిండి... ఆ ఇంట సిరిసంపదలు కొల్లలుగా జల్లులై కురవాల్సిందే!



కంజీవరం పట్టుచీరలో ఆకుపచ్చ, బంగారు రంగులు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. వీటికి ఆభరణాల జిలుగులు, పువ్వుల కళలు తోడై సంప్రదాయ వెలుగులు విరజిమ్ముతున్నాయి. శ్రావణలక్ష్మికి స్వాగతం పలుకుతున్నాయి.



పసుపు, కుంకుమ, పచ్చదనం.. ఈ మూడింటి రూపం శ్రీమహాలక్ష్మి. ఆ కళ కనుల నిండుగా మెరవాలంటే పట్టుచీరతో ముస్తాబు అవ్వాల్సిందే. చీర జరీ జిలుగులు మోములో పువ్వులై విరియాల్సిందే! మేని వెలుగులు ముచ్చటగొలపాలంటే ఆభరణాల కాంతులు అణకువగా ఉండాల్సిందే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top