సహగమపదని..!

 First Female Kanyakumari to Receive the Musical Award from Madras - Sakshi

మహిళాష్టమి

వాకా మంజులారెడ్డి
సంగీత కచేరీ వేదిక మీద సహవాయిద్యాలతో అలరించే వాళ్లలో ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తుంటారు. ఈ తరం మహిళలు ఆ భేదాన్ని తుడిచేస్తున్నారు. రేపు (మే 11, శనివారం) హైదరాబాద్, రవీంద్ర భారతిలో జరుగుతున్న సంగీత విభావరిలో పాల్గొంటున్న వాద్యకారులంతా మహిళలే. వయోలిన్, సహ వయోలిన్, మాండలిన్, ఫ్లూట్, మృదంగం, తబలా, ఘటం, మోర్చింగ్‌వాద్యాలను మహిళలే వాయిస్తారు. మొత్తం ఎనిమిది మంది మహిళలు పంచుకోనున్న ఈ వేదిక దక్షిణ భారతమంతటికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. 

వయోలిన్‌ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారి సంగీత ప్రపంచ వైతాళికుల్లో ఒకరు. మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం అందుకున్న తొలి మహిళా వయోలిన్‌ వాద్యకారిణి ఆమె. దాదాపుగా యాభై ఐదేళ్ల సంగీత సాధనలో ఆమె  దేశ విదేశాల్లో వేలాది కచేరీలు నిర్వహించి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలందుకున్నారు. ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విభాగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి మహిళ కన్యాకుమారి. పదేళ్ల కిందట తమిళనాడులో తీవ్రమైన దుర్భిక్షం నెలకొన్న తరుణంలో పద్మనాభస్వామి కోవెలలో స్వరజతి నిర్వహించారు.

అప్పుడు వర్షం కురిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘అది మా సంగీతకారుల గొప్పతనం కాదు, స్వరం– సాహిత్యం కలయికల గొప్పతనం’’ అన్నారామె. ఆమె కీర్తికిరీటంలో మరో కలికితురాయి అఖండం. ఎనభై మంది సంగీతకారులతో ఒక్కొక్కరు అరగంట చొప్పున ఇరవై నాలుగ్గంటల సేపు నిరంతరాయంగా సంగీత కచేరీ నిర్వహించారామె. విజయనగరంలో పుట్టిన తాను చెన్నైలో స్థిరపడడానికి కారణం అక్కడ సంగీతానికి ఉన్న ఆదరణేనన్నారు. ‘‘తమిళనాడులో సంగీతానికి ప్రత్యేక ఆదరణ ఉంది, ఆ కారణంగానే మన తెలుగు కళాకారులు అనేక మంది చెన్నైలో స్థిరపడుతున్నారు.

ద్వారం వెంకటస్వామి నాయుడు, బాల మురళీకృష్ణ, సుశీల వంటి సంగీతఖనులు తమిళనాడుకి వెళ్లడానికి కారణం తమిళుల సంగీతారాధన, కళకు లభిస్తున్న గౌరవాలే. నా యాభై ఐదేళ్ల సంగీత ప్రయాణంలో పాతిక సంగీత సాధనాలతో జుగల్‌బందీ ప్రయోగాలు చేశాను. వాయిద్యకారులుగా మహిళలు తక్కువగానే ఉన్నారు. ఫ్లూటు, మాండలిన్, ఘటం, మోర్చింగ్‌లో అయితే మరీ తక్కువ. ప్రస్తుతం వోకల్‌ మ్యూజిక్‌తో పోలిస్తే ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌కి ఆదరణ తగ్గుతోంది. వోకల్‌ రాణించాలంటే ఇన్‌స్ట్రుమెంట్స్‌ సహకారం తప్పని సరి. అన్ని రకాల సంగీతరీతులనూ గౌరవించగలిగినప్పుడే కళ సమతుల్యంగా ఉంటుంది’’ అన్నారు కన్యాకుమారి.

కావేరి తీరాన గోదావరి సంగీతం
మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఐదేళ్లకు చెన్నైలో ఉన్న తాతగారి దగ్గరకు వెళ్లిపోయాను. నాకు మాండలిన్‌ నేర్పించాలనేది ఆయన కోరికే. ఆరేళ్ల నుంచి ప్రాక్టీస్‌ చేసి, ఎనిమిదేళ్లకు తొలి కచేరీ ఇచ్చాను. త్యాగరాజు ఆరాధన ఉత్సవాల సందర్భంగా తమిళనాడులో కావేరీ నది తీరాన తిరువాయూర్‌లో తొలి ప్రదర్శన ఇచ్చే భాగ్యం కలిగింది. అది త్యాగరాజు పుట్టిన ఊరు. అప్పట్లో నన్ను చైల్డ్‌ ప్రాడిజీ బేబీ నాగమణి అనేవారు.

చెన్నైలో చిన్మయ విద్యాలయలో చదువుకున్నాను. ఆ స్కూలు సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. తొమ్మిదేళ్లకే సౌత్‌ ఆఫ్రికాలో పదిహేను కచేరీలు చేయగలిగాను. కాశ్మీర్‌ తప్ప దేశంలోని అన్ని  రాష్ట్రాల్లో కచేరీలు చేశాను. నా తొలి గురువు, మామయ్య అయిన యు.పి రాజుగారితో వివాహమైంది. చెన్నైలో స్థిరపడ్డాం. చెన్నైలోనే ‘శాస్త్రీయ మాండలిన్‌ శిక్షణ’ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. 
– ఉప్పలపు నాగమణి, మాండలిన్‌ వాద్యకారిణి

అష్ట స్వర సంగమమ్‌
విజయనగరంలో పుట్టిన కన్యాకుమారి, పాలకొల్లు వాద్యకారిణి బేబీ నాగమణి, హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి తబలాలో పట్టా పుచ్చుకున్న కేరళ మహిళ రత్నశ్రీ, బెంగుళూరు నుంచి ఫ్లూట్‌ కళాకారిణి వాణీ మంజునాథ్, మోర్చింగ్‌ విద్వాంసురాలు భాగ్యలక్ష్మి ఎమ్‌ కృష్ణ, తమిళనాడు నుంచి మృదంగ విద్వాంసురాలు అశ్విని శ్రీనివాసన్, ఘట వాద్యకారిణి రమ్య రమేశ్, అనుతమ మురళి.. రేపు తెలుగు శ్రోతలను అలరించడానికి హైదరాబాద్‌లో కొలువుదీరనున్నారు. కన్యాకుమారి ఆధ్వర్యంలో ఈ ‘సంగీత సంగమమ్‌’ జరుగుతోంది. ఈ సంగీత విభావరిని వెంకటాచలం అయ్యర్‌ జ్ఞాపకార్థం ప్లాంజెరీ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు శంకర్‌ ప్లాంజెరీ, రాజ్యలక్ష్మి ప్లాంజెరీ దంపతులు 
తెలియచేశారు. 

నాన్నను చూసి నేర్చుకున్నాను
మాది బెంగళూరు. మా నాన్నగారు ప్రముఖ మోర్చింగ్‌ కళాకారుడు ‘గానకళా భూషణ’ విద్వాన్‌ డాక్టర్‌ ఎల్‌ భీమాచార్‌. ఆయన ప్రాక్టీస్‌ చేస్తుంటే రోజూ చూసేదాన్ని. అలా మోర్చింగ్‌ మీద ఆసక్తి కలిగింది. పదేళ్ల వయసు నుంచి ప్రాక్టీస్‌ మొదలు పెట్టాను. దేశవిదేశాల్లో పదిహేను వందల కచేరీల్లో పాల్గొన్నాను. డాక్టర్‌ ఎం. బాల మురళీ కృష్ణ, విదుషి నీల రామ్‌గోపాల్, విదుషి ఎ. కన్యాకుమారి, సంజయ్, సుధా రఘునాథన్‌ వంటి ప్రముఖులకు మోర్చింగ్‌ సహకారం అందించాను. ఆల్‌ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్‌ ఆర్టిస్ట్ట్‌ని. ఈ రంగంలో అమ్మాయిలను తీసుకురావాలనేది నా కోరిక.
భాగ్యలక్ష్మి ఎం. కృష్ణ, 
తొలి మహిళా మోర్చింగ్‌ కళాకారిణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top