‘గ్యాస్ట్రైటిస్‌’ బాధలనుంచి విముక్తి ఉందా?  

Family health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 42 ఏళ్లు. కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా?  – డి. నాగమల్లేశ్వరరావు, కర్నూలు 
జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు.  
కారణాలు : 20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙ పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్‌ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది. 
నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం  పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి ∙తిన్న అనంతరం కనీసం రెండు గంటల తర్వాతే నిద్రించాలి. 
చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

దీర్ఘకాలికంగా నీరసం... తగ్గుతుందా

నా వయసు 45 ఏళ్లు. గత ఆరు నెలల నుంచి ఒళ్లునొప్పులు, కండరాలు లాగడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. ఎప్పుడూ బాగా నీరసంగా ఉంటోంది. జ్వరంగా అనిపిస్తోంది. హోమియోçలో పరిష్కారం ఉందా?  – పి. రమాదేవి, హైదరాబాద్‌ 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌ (సీఎఫ్‌ఎస్‌)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారు శారీరక శ్రమతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా నీరసంతో బాధపడేవారిలో కనీసం ఆర్నెల్ల పాటు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో దీర్ఘకాలం నీరసం, నిస్సత్తువ లేదా అలసటతో పాటు విశ్రాంతి తీసుకున్నా ఉత్సాహంగా లేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. పురుషులతో పోలిస్తే ఇది మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. 
కారణాలు : ∙ఆందోళన, శరీర రక్షణ వ్యవస్థలో లోపాలు ∙అంటువ్యాధులకు గురికావడం ∙మానసిక వ్యాధులు, ముఖ్యంగా డిప్రెషన్‌ ∙హారోఎ్మన్‌ సమస్యలు, హైపోథైరాయిడిజమ్‌ 
లక్షణాలు : ∙బాగా విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించకపోవడం ∙ఏమాత్రం శారీరక శ్రమ చేయలేకపోవడం ∙నిద్రసరిపోనట్లుగా అనిపించడం ∙ఏకాగ్రత లోపించడం ∙తలనొప్పి ∙కండరాల నొప్పులు ∙రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవడం ∙చిరాకు 
వ్యాధి నిర్ధారణ : బ్రెయిన్‌ ఎమ్మారై, సీబీపీ, ఈఎస్‌ఆర్, టీఎస్‌హెచ్, యూరిన్‌ టెస్ట్‌ 
చికిత్స : హోమియో వైద్య విధానంలో సీఎఫ్‌ఎస్‌కు మేలైన చికిత్స అందుబాటులో ఉంది. ఈ విధానంలో వ్యాధి తీవ్రతను, రోగి ముఖ్యలక్షణాలను విశ్లేషించి మందులు సూచిస్తారు. ఈ సమస్యకు చైనా, యాసిడ్‌ఫాస్, ఆర్సినిక్‌ ఆల్బ్, కార్బోవెజ్, ఫెర్రమ్‌మెట్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్‌ పర్యవేక్షణలోనే వాడాలి. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో),  స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

తిన్న వెంటనే కడుపు మెలిపెట్టినట్లుగా నొప్పి! 
నా వయసు 38 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. కడుపులో నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. అయితే టాయిలెట్‌కు వెళ్లగానే నొప్పి తగ్గుతుంది. నా సమస్యకు హోమియోలో చికిత్స చెప్పండి. – ఎమ్‌. చంద్రశేఖర్, చిత్తూరు 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. 
వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. 
చికిత్స: ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్‌ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వారు సూచించిన మేరకు మందులు తీసుకోవాలి.
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top