ఫేస్ ద ప్రాబ్లమ్స్ | Face the Problems | Sakshi
Sakshi News home page

ఫేస్ ద ప్రాబ్లమ్స్

Published Fri, Apr 15 2016 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

ఫేస్ ద ప్రాబ్లమ్స్

ఫేస్ ద ప్రాబ్లమ్స్

సమస్యల్ని ఫేస్ చేయడం కష్టమే సమస్య వచ్చాక ఫేస్ చేయడం ఇంకా కష్టం ఫేస్‌లో ఉన్న... కళ్లు, ముక్కు, చెవులు, నోరు ప్రాబ్లమ్స్‌ను ఎలా ఫేస్ చేయాలో చూద్దాం అంతకంటే ముందు వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం!

 

చెవి చెవి ఇన్ఫెక్షన్
అందరిలోనూ చెవుల నుంచి గొంతులోకి ఒక యూస్టేషియన్ ట్యూబ్ అనే నాళం ఉంటుంది. అలర్జీలు లేదా జలుబు వంటి ఇన్ఫెక్షన్ల వల్ల యూస్టేషియన్ ట్యూబ్‌లోకి క్రిములు చేరుతాయి. అవి మధ్యచెవికి చేరినప్పుడు పిల్లల్లో తీవ్రమైన చెవి నొప్పి వస్తుంది. ఈ కారణం వల్లనే కొందరు పిల్లల్లో జలుబు చేసిన తర్వాత చెవి నొప్పి వస్తుంది.



నిర్ధారణ : ఓటోస్కోప్ ఉపయోగించి ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.


చికిత్స : యాంటీబయాటిక్స్, యాంటీ అలర్జీ మందులతో ఈ సమస్యకు చికిత్స చేస్తారు. ఇది దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా మారినప్పుడు పిల్లల వినికిడిని తెలుసుకునే ఆడియోగ్రామ్ పరీక్ష, చెవిలోని పొర ఇయర్ డ్రమ్ సాధారణంగా కదులుతుందో లేదో తెలుసుకునే టింపనోగ్రామ్ పరీక్షలు అవసరం కావచ్చు.

 

నివారణ: జబులు చేసిన వ్యక్తుల నుంచి పిల్లలను దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా కడగడం, మురికి చేతులను ముక్కుకు, కళ్లకు అంటకుండా చూడటం వంటి జాగ్రత్తలతో పిల్లలను చెవి ఇన్ఫెక్షన్ల నుంచి నివారించవచ్చు.

 

ముక్కు సైనసైటిస్
ముక్కుకు ఇరువైపులా ముఖంలో గాలి ఉండే కొన్ని ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈ ఖాళీ స్థలాలలో వచ్చే ఇన్ఫెక్షన్‌ను సైనసైటిస్ అంటారు. సాధారణంగా పిల్లల్లో జలుబు లేదా అలర్జిక్ ఇన్‌ఫ్లమేషన్ తర్వాత ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇది వచ్చిన వారిలో ముక్కు కారడం, తలనొప్పి, నోటిదుర్వాసన (బ్యాడ్ బ్రెత్), దగ్గు, జ్వరం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

 

నిర్ధారణ : ఎక్స్‌రే, సీటీ స్కాన్, సైనస్ స్రావాల కల్చర్ పరీక్షలతో ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.


చికిత్స : యాంటీబయాటిక్స్, అసిటమైనోఫెన్, ఛాతీ పట్టేసినట్లు ఉండటాన్ని తగ్గించే డీ కంజెస్టెంట్స్‌తో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అవసరం కావచ్చు.

 

అలర్జిక్ రైనైటిస్
ఏదైనా సరిపడని పదార్థం ముక్కులోకి వెళ్లి, అది తీవ్ర ఇబ్బంది  కలిగించడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇది కుటుంబ చరిత్రలో ఉండే రుగ్మత. సాధారణంగా పుప్పొడి, దుమ్ములో ఉండే డస్ట్‌మైట్స్, బొద్దింకలు వాటి విసర్జకాలు, జంతువుల ఒంటి నుంచి వెలువడే వాసనలు, పొగాకు పొగ వంటివి అలర్జిక్ రైనైటిస్‌కు కారణమవుతాయి.

 
లక్షణాలు
: ఈ సమస్య ఉన్నవారిలో తుమ్ములు, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, ముక్కులో దురద, ముక్కు కారుతూ ఉండటం వంటివి కనిపిస్తాయి.

 
నిర్ధారణ : కుటుంబ వైద్య చరిత్రతో పాటు బయటకు కనిపించే లక్షణాల ఆధారంగా ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.

 
నివారణ / చికిత్స: ఈ సమస్యను ప్రేరేపించే అంశాల నుంచి దూరంగా ఉండటం ద్వారా నివారించవచ్చు. పుప్పొడి వ్యాపించే సీజన్‌లో ఎయిర్‌కండిషన్‌లో ఉండటం, దుమ్ము ధూలికి ఎక్స్‌పోజ్ కాకపోవడం, బూజు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం కూడా నివారణకు మంచి మార్గం. ఇక యాంటీహిస్టమైన్స్, కార్టికోస్టెరాయిడ్స్, ముక్కులో వాడే స్ప్రేలు, యాంటీట్యూకోట్రైన్స్ వంటి మందులు వాడుతుంటారు.

 

కళ్లు  కళ్ల సమస్యలు
కళ్ల సమస్యలు: పిల్లల్లో కళ్లకు సంబంధించిన సమస్యలు ఈ కింది కారణాల వల్ల రావచ్చు. అవి...  కళ్లను అదేపనిగా రుద్దుతూ ఉండటం  కాంతికి తీవ్రంగా ప్రతిస్పందించే గుణం  ఒకేచోట దృష్టినిలపడంలో ఇబ్బందులు  ఏదైనా వస్తువును చూడటంలో సమస్యలు  ఆర్నెల్ల వయసు తర్వాత రెండు కనుగుడ్లు ఒకేవైపునకు, ఒకేలా కదలకపోవడం (అబ్‌నార్మల్ అలైన్‌మెంట్)  దీర్ఘకాలికంగా కళ్లు ఎర్రగా ఉండటం  కళ్లలో నల్లగుడ్డు ఉండాల్సిన చోట తెల్లటి మచ్చ ఉండటం.

 

నిర్ధారణ: సాధారణంగా కళ్ల సమస్యలు ఆసిటీ చార్ట్ వంటి కొన్ని స్క్రీనింగ్ పరీక్షలతో స్కూల్‌కు వెళ్లే ముందుగానే తెలిసిపోతుంటాయి. ఇక కాంతి కిరణాలు అవసరమైన చోట కేంద్రీకృతం కాకపోవడం వంటి సమస్యలను రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అంటారు. ఇందులో దగ్గరి దృష్టిలో కేవలం దగ్గరి వస్తువులు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యను మయోపియా అంటారు. ఇక కొందరు పిల్లల్లో దూరంగా ఉన్నవి కనిపిస్తూ దగ్గరగా ఉన్నవి స్పష్టంగా కనిపించవు. ఈ సమస్యను  హైపరోపియా అంటారు. ఇక కన్ను ముందువైపున ఉండే వంపు సరిగా లేకపోవడం వల్ల చూసే ప్రక్రియ ఇబ్బంది ఉంటుంది. దీన్ని ఆస్టిగ్మాటిజమ్ అంటారు. ఈ మూడు సమస్యలను కళ్లజోడు ఉపయోగించడం ద్వారా సరిచేయవచ్చు.

 

నోరు నోటిలో పుండ్లు (ఓరల్ అల్సర్స్)
ఇవి పిల్లలో చెంపలు, పెదవుల లోపలి వైపున, చిగుర్లపైన కనిపిస్తాయి. కొందరిలో నాలుకపైన కూడా కనిపిస్తుంటాయి.

 

కారణాలు : ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12, ఐరన్ వంటి లోపాల వల్ల ఇవి వస్తుంటాయి. కొందరిలో నోటిలో అయ్యే గాయాల వల్ల, తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలర్జీల  వల్ల కూడా కనిపిస్తుంటాయి.

 

చికిత్స/ నివారణ : సాధారణంగా ఈ సమస్య రెండు వారాల్లో తగ్గిపోతుంది. ఇలా పిల్లలో నోటిలో పుండ్లు వస్తున్నప్పుడు పోషకాహార లోపాలు లేక వ్యాధి నిరోధకతలోపాలు ఏవైనా ఉన్నాయా అని చూడాలి. కొన్ని ఆహారాలు సరిపడకపోవడం (ఫుడ్ అలర్జీ) కూడా ఉందేమో అని తెలుసుకోవాలి.

 

డాక్టర్ శివనారాయణరెడ్డి వెన్నపూస
కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ - ఇన్‌టెన్సివిస్ట్
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్,విక్రమ్‌పురి, సికింద్రాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement