మనోధైర్యమే మగువను నడిపిస్తుంది, గెలిపిస్తుంది | do not under estimate your power, says shobha dey | Sakshi
Sakshi News home page

మనోధైర్యమే మగువను నడిపిస్తుంది, గెలిపిస్తుంది

Nov 6 2013 11:55 PM | Updated on Sep 2 2017 12:20 AM

ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంటుంది. అయితే దురదృష్టమేమిటంటే... తమలో ఆ శక్తి ఉన్న విషయం చాలామంది మహిళలకు తెలియదు.

ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంటుంది. అయితే దురదృష్టమేమిటంటే... తమలో ఆ శక్తి ఉన్న విషయం చాలామంది మహిళలకు తెలియదు. అందుకే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. తాము చేయగలిగింది కూడా చేయకుండా ఉండిపోతారు. సాధించే సత్తా ఉన్నా, సాధించగలనన్న నమ్మకం లేక వెనకడుగు వేస్తుంటారు. ఎవరిలోనూ లేని ప్రతిభా పాటవాలు ఉన్నా... ఎవరి ప్రోత్సాహం కోసమో ఎదురుచూస్తూ ముందడుగు వేయడానికి సంశయిస్తుంటారు.

ఇలాంటి మహిళలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నారని నేను నిస్సందేహంగా చెప్పగలను. దుర్గాశక్తి నాగ్‌పాల్ ఐఏఎస్ గురించి విన్నప్పుడు నా అణువణువూ పులకించింది. చిన్న వయసు. పైగా ఆడపిల్ల. అయినా కూడా ఎంత తెగువ ఆమెలో! అవినీతి మీద సమరశంఖం పూరించింది. అవినీతిపరులని వణికించింది. ఎంత ధైర్యం, ఎంత స్థైర్యం! నిజాయతీగా ఉన్నందుకు ఆమెపై వేటుపడినా చలించలేదు. తానెంతో ప్రేమించే ఉద్యోగ బాధ్యతలకు దూరం కావాల్సి వచ్చినా తొణకలేదు, బెణకలేదు. ఆ ఆత్మవిశ్వాసం ఆమెను విజేయురాల్ని చేసింది.

ప్రజలు తెచ్చిన ఒత్తిడితో ప్రభుత్వమే తలవంచి, ఆమె ఉద్యోగాన్ని సగౌరవంగా తిరిగిచ్చింది. నేను చెప్పేదేమిటంటే... ప్రతి మహిళలోనూ ఒక దుర్గ ఉంది. కానీ ఆమెను వెలికితీయడంలోనే మహిళ విఫలమవుతోంది. తండ్రో, అన్నో, భర్తో తోడు ఉండాలని ఆశిస్తోంది తప్ప, ప్రయత్నిస్తే తానే ఎంతోమందికి అండగా నిలబడగలనన్న వాస్తవాన్ని గ్రహించడంలో స్త్రీ విఫలమవుతోంది.

నిజానికి దుర్గాశక్తి విజయం వెనుక ఆమె తండ్రి, భర్త, మామగారు ఉన్నారు. కానీ అందరి కుటుంబాల్లోనూ అలాంటివాళ్లు ఉండరు. లేనంతమాత్రాన వెనకడుగు వేయాల్సిన పని లేదు. ధైర్యంగా అడుగు వేస్తే... ఆత్మవిశ్వాసమే ఆయుధమవుతుంది. నమ్మకంగా ముందుకు సాగితే... మనోధైర్యమే తోడవుతుంది. అదే ప్రతి మహిళనూ నడిపిస్తుంది... గెలిపిస్తుంది.

 - శోభా డే
 ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement