ఆట ఆడించేది ఎవరు? | Sakshi
Sakshi News home page

ఆట ఆడించేది ఎవరు?

Published Mon, Apr 6 2020 12:14 AM

Dead To Her Book Review By AV Ramana Murthy - Sakshi

ఇరవైకి పైగా నవలలు రాసిన బ్రిటిష్‌ రచయిత్రి సారా పిన్‌బరో తాజా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘డెడ్‌ టు హర్‌’ ఫిబ్రవరిలో విలియమ్‌ మారో ప్రచురణ సంస్థ ద్వారా విడుదలయింది. మూడేళ్ల క్రితం ఆమె రాసిన ‘బిహైండ్‌ హర్‌ ఐస్‌’ స్థాయికి తగ్గకుండా, కేవలం థ్రిల్లర్‌ నవలకి ఉండే సాధారణాంశాలే కాకుండా ఆర్థిక స్థితిగతుల్నీ, మానవ బలహీనతల్నీ, ప్రేమకి సంబంధించిన వివిధ వర్ణాలనీ ఈ నవలలో పొందుపరచడం విశేషం. మనం ఆడే ఆటల్ని ఆడించే మహాశక్తి నిజానికి ఇంకేదో ఉంటుందని అందరూ అంటారు కానీ, ఈ నవలలో ఆ మహాశక్తి రూపం కొంత భిన్నంగా ఉంటుంది; ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది.
 
కథలోకి వెళ్తే– చాలా ఏళ్ల క్రితం కొడుకునీ, ఈ మధ్యనే భార్యనీ కోల్పోయిన దాదాపు డెబ్భై ఏళ్ల విలియమ్‌ అనే సంపన్నుడి సంస్థలో జేసన్‌ భాగస్వామి. జేసన్‌ భార్యనుంచి అతని దృష్టి మరల్చి, అతన్ని విడాకులకి ప్రోత్సహించి, మర్సీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ల కాపురం బానే సాగుతున్న సమయంలో, వ్యాపార లావాదేవీల నుంచి బ్రేక్‌ కావాలని విలియమ్‌ ఒక సంవత్సరం పాటు యూరప్‌ అంతా తిరిగివస్తానని వెళ్లి, ఆరునెలల్లోనే ఇంగ్లండ్‌లో కెయీషా అనే ఇరవై రెండేళ్ల మెరుపుతీగని పెళ్లిచేసుకుని తిరిగివస్తాడు. అప్పటివరకూ కమ్యూనిటీలో అందమైన పిన్నవయస్కురాలి హోదాని అనుభవిస్తున్న ముప్పై అయిదేళ్ల మర్సీలో ఒక చిన్న అసూయ మొదలవుతుంది. దీనికి తోడు, జేసన్‌ చూపులు కెయీషాని పరిశీలించే పద్ధతి అనుమానాన్ని పుట్టిస్తుంది; జేసన్‌ అర్ధరాత్రి లేచి మాట్లాడే కాల్స్, పంపే మెసేజెస్‌ ఆ పెనుభూతాన్ని స్థిరపరుస్తాయి. మర్సీ, కెయీషా– ఇద్దరూ రెండో భార్యలే. ఇద్దరూ బీద నేపథ్యం గలవారే. ఇద్దరూ స్టేటస్‌ కోసం ఈ పెళ్లిళ్లు చేసుకున్నవారే. కానీ, అన్ని విషయాల్లోనూ కెయీషాదే పైచేయిగా ఉందిప్పుడు. విలియమ్‌ కంపెనీని తను కొనేసే ఉద్దేశంతో ఉన్న జేసన్, కెయీషాతో భార్యని స్నేహంగా ఉండమంటాడు. పుండు మీద కారం చల్లినట్టవుతుంది మర్సీకి.
 
చివరికి మర్సీకి కెయీషా స్నేహితురాలు అవుతుంది. కానీ, విచిత్రమైన పరిస్థితుల్లోకి ఆ స్నేహం విస్తరిస్తుంది. ‘‘ఇతరులు మనగురించి ఇలా అనుకుంటారేమో అని మనం భయపడుతూ ఉండేది నిజంగా మనం మనగురించి అలా అనుకునేదే!’’ అని కెయీషా మర్సీకి ఆలంబన అవుతుంది. ఆ స్నేహపు సన్నిహితత్వంలో మరిన్ని విషయాలు తెలుస్తాయి. విలియమ్‌ తొందరగా చచ్చిపోతే బాగుండునని కెయీషా ఎదురుచూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడినుంచి కథ ఊహించినదానికి విరుద్ధంగా విచిత్రమైన మలుపులు తిరుగుతూ, మంత్రతంత్రాలూ, వూడూలు లాంటి పక్కదోవ పట్టించే విషయాలతో సాగుతూ, ఊహించని ఘట్టాలకి చేరుతూ ఉంటుంది. ముళ్లు బిగుసుకుపోయిన పరిస్థితుల్లో మర్సీ చాలా పరిశోధన చేసి చాలా ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకుంటుంది. ఈ ఆట రహస్యం మొత్తం తన గుప్పిట్లో ఉందనుకుంటున్న సమయంలో, ఆ ఆటలో తన పాత్ర ఏమిటో తెలుసుకునే పరిస్థితి వస్తుంది!
 
ముందే చెప్పినట్టు, ఈ నవల కేవలం థ్రిల్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా, చేరుకున్న ప్రతి దశా ఎన్ని ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుందో చూపిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన స్నేహం ఎలా ఉంటుందో ఒకవైపూ, డబ్బాశ అంటుకున్న స్నేహం ఎలా ఉంటుందో మరో వైపూ చూపిస్తుంది. ప్రేమల్లో రకాలనీ, గాఢతల్నీ, పలచబారటాల్నీ చూపిస్తుంది. నవల మొదటి సగం కొంచెం నిదానంగా సాగినట్టు అనిపించినా, చకచకా నడిచే రెండో భాగానికి అది సరైన పునాదులు వేస్తుంది. అన్నీ మన అధీనంలో ఉన్నాయని ధీమాగా ఉండేవాళ్లు నిజానికి ఎలా పరాధీనంగా ఉండివుండే అవకాశం ఉందో చూపించిన తీరు మాత్రం నవల చదివి ఆశ్చర్యపడాల్సిన విషయం!
(నవల: డెడ్‌ టు హర్‌, రచయిత్రి: సారా పిన్‌బరో, విడుదల: 2020 ఫిబ్రవరి) 
-ఎ.వి. రమణమూర్తి

Advertisement
Advertisement