సైన్యానికే సైనికుడు 

Captain Harbhajan  is Death anniversary - Sakshi

సమర వీరుడు భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా  ఓ అమర  వీరుడి జ్ఞాపకాలు.

సైన్యంలో ఎంతోమంది సైనికులు ఉంటారు.ప్రతి సైనికుడూ గొప్పవాడే. కానీ.. ఒక్కోసారి.. ‘ఈ సైనికుడు లేకపోతే..సైన్యమే లేదు’ అనిపించేలా ఒకడుంటాడు! సైన్యానికే సైనికుడతడు.  అలాంటి సైనికుడే కెప్టెన్‌ హర్భజన్‌.

అది సిక్కిం రాష్ట్రంలోని నాథులా కనుమ. ఇండో– చైనా సరిహద్దులో ఉన్న నాలుగు మీటింగ్‌ పాయింట్‌లలో ఒకటి. రెండు దేశాల సైనికులు జాతీయ జెండాలను గౌరవించే ఫ్లాగ్‌మీట్‌లో రెండు దేశాల సైనికులు, అధికారులు ఉన్నారు. భారత్‌ వైపు ఒక ఖాళీ కుర్చీ కూడా ఉంది. ఆ కుర్చీలో అధికారి ఉన్నట్లే, సైనిక వందనం చేస్తున్నారు. అది గౌరవ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ది. హర్భజన్‌ జనం మధ్య లేడు, కానీ జనం మనసులో ఉన్నాడు. సైనికులు రోజూ హర్భజన్‌ బూట్లు పాలిష్‌ చేస్తారు, బెడ్‌ షీట్‌ మారుస్తారు. కెప్టెన్‌ గది బయట సెంట్రీగా ఒక సిపాయి డ్యూటీ చేస్తాడు. జానపద కథలా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ క్రమం 1968 నుంచి అతడి నార్మల్‌ రిటైర్‌మెంట్‌ వయసు వరకు జరిగింది. ఇంతకీ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ ఎవరు?

యువరక్తం ఉరుకులు
హర్భజన్‌ సింగ్‌ది పంజాబ్, కపుర్తలా జిల్లాలోని బ్రౌన్‌దాల్‌ గ్రామం. సైన్యంలో ఉద్యోగం అంటే ఉత్తేజం, దేశం కోసం పనిచేయడా న్ని హీరోయిజం గా భావించేవాడు. 1956లో పంజాబ్‌ రెజిమెంట్‌ 23వ బెటాలియన్‌లో చేరాడు. సిక్కుల ధైర్యంతోపాటు హర్భజన్‌కి దేశభక్తీ ఎక్కువే. చైనా సరిహద్దు అప్పట్లో సెన్సిటివ్‌ జోన్‌ కావడం కూడా అతడి అంకిత భావానికి ఒక కారణం కావచ్చు. ‘దేశం కోసమే బతుకుతాను, దేశం కోసమే చస్తాను. వీర మరణమే  సైనికుడికి గౌరవం’ అనేవాడు. క్లిష్టమైన బాధ్యతలను ఇష్టంగా తలకెత్తుకునేవాడు. అప్పటికి అతడికి 27 ఏళ్లు. ఇరుదేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యేలా ఉంది! చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి.

యుద్ధానికి పరుగులు
పర్వత సానువుల్లో ఇరుకైన రాళ్లబాటలో యుద్ధ సామగ్రి, ఆహారాన్ని తరలించడం అంటే మాటలు కాదు. యుద్ధం చేయడం కంటే కష్టం. సైనికులు వార్‌మూడ్‌లోకి వచ్చేశారు. బృందాలుగా విడిపోయి ఒక్కొక్క పాయింట్‌లో మాటు వేశారు. కెప్టెన్‌ అన్ని స్థావరాలనూ పర్యవేక్షిస్తున్నాడు. ఎక్కడో సందేహం. ఈ సామగ్రితో యుద్ధానికి దిగగలమా? వాకీటాకీలో బేస్‌ క్యాంపుకు లైన్‌ కలిపాడు. అక్కడ సామగ్రి ఉంది, అది చేరడానికి అనువైన వాతావరణం లేదు. రాళ్లలో వాహనం ఎక్కడ ఆగిపోతుందో ఊహించలేం. టుకు కనుమ నుంచి డోంగ్‌చుయి కనుమకు చేర్చాలి సామగ్రిని. ‘‘నేను చేరుస్తాను’’ ముందుకొచ్చాడు హర్భజన్‌.

అంతుచిక్కని జాడలు
మిలటరీ వెహికల్‌ పది కిలోమీటర్ల దూరం వెళ్లేటప్పటికి వాకీటాకీలో ‘వాహనం నడిచే చప్పుడు వినిపిస్తోంది. శత్రువుకి సంకేతాలందే ప్రమాదం ఉంది’ అని అలర్ట్‌ వచ్చింది. అంతే... వాహనం నుంచి వస్తువులను దించాడు. మ్యూల్స్‌ (హిమాలయాల సానువుల్లో ఉండే పొట్టి గుర్రాలు)ను తోలుకొచ్చి వాటి మీద పేర్చాడు. దాదాపుగా ఏడాదంతా మంచుతో కప్పేసి ఉండే ఆ నేల, కాలు పెడితే జారడానికి సిద్ధంగా ఉంటుంది. అది అక్టోబర్‌ నెల. వర్షం కురిసిన నేల చిత్తడిగా ఉంది. హిమాలయాలలో కురిసిన వర్షంతో నదిపాయలు నిండుగా హోరెత్తుతూ ప్రవహిస్తున్నాయి. హర్భజన్‌ కాలు పట్టుతప్పి జారిందో, లేక అతడే నీళ్లను అంచనా వేయలేకపోయాడో..  చెప్పడానికి అతడి పక్కన అప్పుడు ఎవరూ లేరు. హర్భజన్‌ మాత్రం గమ్యం చేరలేదు. అతడి కోసం మూడు రోజులు గాలించిన తరవాత దేహం దొరికింది. ‘దేశం కోసం మరణించడమే సైనికుడికి గౌరవం’ అతడి మాటలు అందరికీ చెవుల్లో వినిపిస్తున్నాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు తోటి సైనికులు. 

డ్యూటీలో హర్భజన్‌ ఆత్మ!
హర్భజన్‌ జ్ఞాపకాలతోనే నిద్రపోవడంతోనో ఏమో అతడే కనిపిస్తున్నాడు తోటి సైనికులకు! మొదట్లో సింగ్‌ మీదున్న అభిమానం అనుకున్నారు. ‘రాత్రి కలలో కనిపించి తనకు ఇష్టమైన ప్రదేశం నాథులా పాస్‌ నుంచి ఎక్కడికీ పోను, ఇక్కడే సమాధి కట్టమన్నాడ’ని ఓ రోజు ఒక మిత్రుడు చెప్పాడు. మరో రోజు.. హటాత్తుగా మెలకువ వచ్చి లేచారు బెటాలియన్‌ టీమ్‌. సింగ్‌ నిద్రలేపాడని, చైనా సరిహద్దు వెంట పెట్రోలింగ్‌ చేయమంటున్నా డని చెప్పారు. నిద్రలో చెప్పిన మాట పట్టుకుని పెట్రోలింగ్‌ చేయడం హాస్యాస్పదం అని తెలుసు. అయినా సరే, ఓ సారి వెళ్లొచ్చేద్దాం అనుకున్నారు. 
కాకతాళీయమే కావచ్చు అది నిజంగా పెట్రోలింగ్‌ అవసరమైన సందర్భమే. సరిగ్గా అప్పుడే చైనా ఆర్మీ రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు దొరికాయి. సింగ్‌ ఇంకా డ్యూటీ చేస్తూనే ఉన్నాడనే అభిప్రాయం బలపడుతోంది అందరిలో. అవును, సింగ్‌ ఇంకా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు... అని నమ్మింది ఇండియన్‌ ఆర్మీ. అతడు కోరినట్లే సింగ్‌ జ్ఞాపకార్థం సమాధిని, ఆ తర్వాత ఓ స్మారక మందిరాన్ని కూడా కట్టారు. అతడి జీతంగా చిన్న మొత్తాన్ని అతడి తల్లికి నెలా నెలా పంపించేవారు. 

యూనిఫామ్‌కు బెర్త్‌ బుకింగ్‌!
సైనికులకు ఏటా రెండు నెలలు సెలవు ఉంటుంది. అలా అతడి సెలవుకు సొంతూరికి వెళ్లడానికి ఏటా సెప్టెంబర్‌ 11వ తేదీ దిబ్రూఘర్‌ ఎక్స్‌ప్రెస్‌లో సింగ్‌ పేరుతో బెర్త్‌ బుక్కయ్యేది, 13వ తేదీకి సొంతూరు చేరేవి అతడి యూనిఫామ్, ఇతర వస్తువులు. వాటిని ఇద్దరు సైనికులు తీసుకెళ్లేవారు. సింగ్‌ వచ్చే రోజు (అతడి జ్ఞాపకాలు, వస్తువులు) ఆ ఊరిలో ఘనస్వాగతం పలికేవారు గ్రామస్థులు. రెండు నెలల తర్వాత సైనికులు వచ్చి సింగ్‌ ఫొటో, వస్తువులను తీసుకుని తిరిగి నాథులా పాస్‌కు వెళ్లేవారు. ప్రభుత్వం అతడికి ఇంతటి ప్రేమను పంచడంతోపాటు గౌరవపూర్వకంగా కెప్టెన్‌ హోదాను కూడా ఇచ్చింది. సిపాయిగా ఉన్నప్పుడు మరణించిన హర్భజన్‌ సింగ్‌ కెప్టెన్‌గా రిటైరయ్యాడు. 

గర్వించే జ్ఞాపకాలు
కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ స్మారక భవనాన్ని సైనికులు దేవాలయంగా భావిస్తారు. నాథులా పాస్‌లో పోస్టింగ్‌ వచ్చిన వాళ్లు, అక్కడికి వెళ్లిన వెంటనే పై అధికారులకు రిపోర్ట్‌ చేయడానికంటే ముందు హర్భజన్‌ స్మారక మందిరానికి వెళ్లి సెల్యూట్‌ చేస్తారు. హర్భజన్‌తో కలిసి పని చేసిన వాళ్లకు అవి గర్వించే జ్ఞాపకాలు. వాళ్లు తమ తర్వాతి తరానికి ఆ జ్ఞాపకాలను అందిస్తూ వచ్చారు. సింగ్‌ భౌతికంగా లేకపోయినా తమ మధ్యే ఉన్నాడనే విశ్వాసం సైనికులకు ఉత్సాహాన్నిస్తోంది. అది నిజమా అబద్ధమా, తమ భ్రాంతి మాత్రమేనా అనే తర్కాన్ని పక్కన పెట్టి, దేశభక్తిని పెంపొందించే శక్తిగా హర్భజన్‌ సింగ్‌ స్మారకాన్ని గౌరవిస్తున్నారిప్పటికీ.  
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top