సెకన్లలో త్రీడీ బాడీ స్కాన్‌...

Body Scan in seconds - Sakshi

ఇప్పటివరకూ  శరీరం లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే... ముక్కలు ముక్కలుగా మాత్రమే సాధ్యం. పీఈటీ, సీటీ, ఎక్స్‌రే వంటి టెక్నాలజీల్లోని లోటుపాట్లు దీనికి కారణం. ఇలా కాకుండా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే మొత్తం శరీరాన్ని స్పష్టంగా స్కాన్‌ చేయగలిగితే వైద్యంలో, రోగులను కాపాడటంలో ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీ, షాంఘైలోని యునైటెడ్‌ ఇమేజింగ్‌ హెల్త్‌కేర్‌లు ఇప్పుడు ఈ అద్భుతాన్ని సాధ్యం చేశాయి. ఎక్స్‌ప్లోరర్‌ పేరుతో వీరు తయారు చేసిన పరికరం అటు పీఈటీ, ఇటు సీటీస్కాన్‌లు రెండింటిలోని మేలురకమైన లక్షణాలను కలబోసుకుని బాడీ స్కాన్‌లు చేస్తుంది. కేవలం 20 – 30 సెకన్లలో అవయవాలన్నింటి త్రీడీ చిత్రాలను అందివ్వగలదు.

ఈ రకమైన పరికరం కోసం పదేళ్ల క్రితమే ఆలోచన చేయగా తొలి నమూనా పరికరం 2016లో సిద్ధమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని విస్తృతంగా పరిశీలించిన తరువాత ఈ ఏడాది మొదట్లో వాణిజ్యస్థాయి ఎక్స్‌ప్లోరర్‌ను సిద్ధం చేశారు. పీఈటీ స్కాన్లలో కూడా కనపించని అంశాలు దీంట్లో కనిపిస్తాయని.. పైగా వాటికంటే 40 రెట్లు ఎక్కువ స్పష్టత కలిగి ఉండటం ఎక్స్‌ప్లోరర్‌ విశేషమని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రామ్‌సే బడావీ తెలిపారు. ఫలితంగా అతితక్కువ రేడియోధార్మిక పదార్థాన్ని శరీరంలోకి పంపటం ద్వారా కూడా అత్యంత స్పష్టమైన చిత్రాలు పొందవచ్చునన్నమాట. మరికొన్ని పరిశోధనల తరువాత దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తామని అంటున్నారు శాస్త్రవేత్తలు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top